Koti Music Director : మ్యూజికల్‌ సన్యాసిగా మారుదామనుకున్నా..కోటి

సుస్వరాల సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తనయుడిగా, సంగీత చక్రవర్తికి శిష్యుడిగా ఎన్నో వందల చిత్రాలకు పని చేసిన సాలూరి కోటేశ్వరరావు అలియాస్‌ కోటి పాటల పూదోటలో విరబూసిన గులాబీలాంటి వారు.

Updated : 24 May 2022 13:15 IST

Music Director koti: సుస్వరాల సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తనయుడిగా, సంగీత చక్రవర్తికి శిష్యుడిగా ఎన్నో వందల చిత్రాలకు పని చేశారు సాలూరి కోటేశ్వరరావు అలియాస్‌ కోటి. పాటల పూదోటలో విరబూసిన గులాబీలాంటి వారు ఆయన. అగ్ర సంగీత దర్శకుల హవా నడుస్తున్న సమయంలోనే తనదైన బాణీలతో మెలోడీ పాటలతో ఆకట్టుకున్నారు. దాదాపుగా 400 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతేకాదు ఔత్సాహిక గాయనీగాయకులు ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో సత్తా చాటుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ‘ఈటీవీ చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో ఎన్నో విశేషాలను తెలిపారు.

కరోనా సమయంలో మీ పాట అద్భుతంగా ఉంది. ఎలా చేశారు..?

కోటి: ఈ పాట అందరికీ వెళ్లింది. దీనికి కారణం చిరంజీవి. పాట రికార్డింగ్‌ చేసి ఆయనకు పంపించా. ‘కోటి చాలా బాగుంది. ఇద్దరం కలిసి చేద్దాం’ అన్నారు. తర్వాత నాగార్జున, సాయిధరమ్‌ వాళ్లను కూడా తీసుకున్నాం. ప్రధాని మోదీ కూడా పాటపై ట్వీట్‌ చేశారు.

నాలుగు వందల సినిమాలంటే ఆషామాషీ కాదు..ఇంటికన్నా స్టూడియోలలోనే ఎక్కువగా ఉన్నట్టున్నారు..?

కోటి: నిజమే. చాలా సమయం వెచ్చించా. వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని సినిమాలు ఎలా చేయగలిగానా? అనిపిస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. భగవంతుడు, తండ్రిగారు, గురువు చక్రవర్తి ఆశీస్సులతోనే సాధ్యమయ్యింది. గురువుగారి వద్దే 650 సినిమాలకు సహాయకునిగా పనిచేశా. ఆయన 940 సినిమాలకు సంగీతం అందించారు.

నాన్నగారు మ్యూజిక్‌ సిట్టింగ్‌లకు వెళ్లడం చర్చలు చేయడం మీకు గుర్తుందా?

కోటి: మ్యూజిక్‌ సిట్టింగ్‌లు మా ఇంట్లోనే జరిగేవి. పిల్లలతో కలిసి మేం బాగా అల్లరి చేసేవాళ్లం. అయినా వాళ్లు తలుపు వేసుకొని పని చేసుకునే వారు. ఇంటికి వచ్చి నాన్నగారితో ఘంటసాల, సుశీలగారు మాట్లాడేవారు. మా ఇల్లు సరస్వతి నిలయం. మా అన్నయ్య వాసూరావు ఎంతోమందికి గిటారు నేర్పించేవారు.

మీ తాతగారికి కూడా సంగీతంలో ప్రవేశం ఉందా..?

కోటి: ఆయన విజయనగరంలో ఆస్థాన విద్వాంసుడు. ఆయనే సన్యాసిరాజు. నాన్న, పెద్దనాన్నలకు శాస్త్రీయ, కర్ణాటక సంగీతం నేర్పించారు. వాళ్లు అప్పట్లో ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు.. ఇప్పుడు మేం గోల్డ్‌స్పూన్‌తో అనుభవిస్తున్నాం. 

మీ తండ్రి సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన వాటిలో మనసుకు హత్తుకున్న పాటేది..?

కోటి: మనసున మనసై.. బతుకున బ్రతుకై...ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటను శ్రీశ్రీ రాశారు. గొప్ప మహానుభావుడిని చూసే అదృష్టం దక్కింది. ఓ పెళ్లిలో 9వ ఏటా అనుకుంటా. డ్రమ్స్‌ వాయిస్తున్నా. ఇప్పటి శివమణిలా అప్పుడే బాగా వాయించేవాడిని. నాకు ఇష్టమైన నటుడు ఎంజీఆర్‌ ఆ పెళ్లికి వచ్చారు. వధూవరులను దీవించి వెళ్తుండగా జనం నా చుట్టూ చేరి అరుస్తున్నారు. ఎంజీఆర్‌ వెళ్తూ ఆగి నన్ను చూశారు. రజినీకాంత్‌ 1977-78లో తాజ్‌లో చూసి ఎవరీ బాయ్‌ చాలా స్మార్ట్‌, షార్ప్‌గా ఉన్నారన్నారు.

చక్రవర్తి వద్ద శిష్యరికం ఎందుకు చేయాల్సి వచ్చింది...?

కోటి: నాన్నగారికి పని తగ్గిపోయింది. అప్పుడే మహదేవన్‌ వచ్చారు. కొత్త ఒరవడి మొదలయ్యింది. చక్రవర్తిగారు బిజీ అవుతుండటంతో మా ముగ్గురు అన్నయ్యలు అక్కడే చేరారు. మొదట రమేష్‌నాయుడి దగ్గర పని చేశా. అప్పటికి నాకు 17ఏళ్లే ఉంటాయి. తర్వాత చక్రవర్తి వద్దకు వెళ్లి గిటార్‌ వాయిస్తానన్నా. మంచిరోజు చూసుకొని వచ్చేయ్‌ అన్నారు. కొడుకులా ఆదరించారు. ఆర్డీ బర్మన్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌లతో రీరికార్డింగ్‌ చేయడం నేర్చుకున్నాను. పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి, వెంకటేశ్‌, ఇళయరాజాల దగ్గర పని చేస్తూ నేను, రాజ్‌ కలిసి చక్రవర్తి వద్ద సహాయకులుగా పని చేశాం. అక్కడి నుంచే రాజ్‌-కోటిగా సంగీతం అందించడం మొదలెట్టాం. 

రాజ్‌-కోటిల మొదటి సినిమా ఏదీ..?

కోటి: ప్రళయగర్జన 1984లో విడుదలయ్యింది. అందులో మోహన్‌బాబు హీరో.

మీ నాన్న, చక్రవర్తి స్టైల్‌ నుంచి బయట పడేందుకు ఎంతకాలం పట్టింది..?

కోటి: గురువుగారి స్టైల్‌ చేయలేదు. ఎలక్ట్రానిక్‌ బీట్‌తో సంగీతం ఎలా చేయాలనే దానికిపై శ్రద్ధ పెట్టా. కొత్త ట్రెండ్‌ మొదలెట్టాం. హాలీవుడ్‌ సౌండ్‌ట్రాక్‌ విని చేసేవాళ్లం. ఎవరికి అర్థమయ్యేది కాదు. మాకు మొదటిగా బ్రేక్‌ ఇచ్చింది రేలంగి సంసారం సినిమా. శోభన్‌, రాజేంద్రప్రసాద్‌, జయప్రద నటించారు. కృష్ణగారి ‘నా పిలుపే ప్రభంజనం’, ‘సింహాసనం’ చిత్రాల్లో రాజ్‌సీతారాం పాడారు. ఆయనతో వెళ్లి కృష్ణగారితో మాట్లాడాం. అలా ‘రౌడీనంబరు వన్‌’కు మమ్మల్ని ఎంపిక చేశారు. ‘సార్‌.. బాలుగారితో పాటలు పాడిద్దాం’ అని చెప్పడంతో కృష్ణగారు ‘నాకేం అభ్యంతరం లేద’న్నారు. వెంటనే బాలుతో మాట్లాడి ఇద్దరిని కలిపాం. అప్పటి నుంచి మేం వెనక్కి తిరిగి చూడలేదు. పద్మాలయకు అంకితం అయిపోయాం.

సంగీత దర్శకులుగా ఓ పేరు..బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు ప్రత్యేకతగా మీరు ఎలా నిలిచారు..?

కోటి: చక్రవర్తి దగ్గర పని చేసినపుడే హాలీవుడ్‌ సినిమాలను చూసి ఏ సన్నివేశానికి ఎలా చేయాలో తెలుసుకొని, నేర్చుకొని చేసే వాళ్లం. ‘పెద్దరాయుడు’, ‘హలోబ్రదర్‌’, ‘అక్కమొగుడు’ ఏ సినిమా తీసుకున్నా విభిన్నంగా చేశామని మీకే తెలుస్తుంది. హిందీలో 12 సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చాం. మరణశాసనం సినిమాకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌కు మంచి పేరు రాగానే పవన్‌, నాగేంద్రబాబు కలిసి చిరంజీవికి చెప్పడంతో ‘యముడికి మొగుడు’ అవకాశం ఇచ్చారు. దాన్ని ఛాలెంజింగ్‌గా చేశాం. పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌. మన కుర్రాళ్లు దొరికారు అంటూ ప్రోత్సహించారు. కొన్ని సినిమాలకు ఇళయరాజాగారు సూచించారు.

చిరంజీవి రెండో ఇన్నింగ్స్‌ లాంటి హిట్లర్‌ సినిమాకు మీరే చేశారు కదా..?

కోటి: ఆ సినిమాలో అన్ని పాటలు మనసును హత్తుకుంటాయి. హబిబ్బి పాటను అద్భుతంగా చేయాలని అనుకున్నాం. చాలా బాగా వచ్చింది. ఆ పాట ట్రెండ్‌ సెట్‌గా మారింది.

ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు విభేదాలు వస్తాయి కదా..మీరెలా పని చేశారు..?

కోటి: ఇద్దరం మా గురువు దగ్గర పనిచేశాం. ఏ పాట చేసినా ఇద్దరం చేస్తామే తప్ప ఒక్కరం చేశామని చెప్పుకోం. పదేళ్లు కలిసి వండర్స్‌ చేశాం. ఆ తర్వాత విడిపోయి నా సొంత బాణీని ఏర్పాటు చేసుకున్నా. ‘నువ్వేకావాలి’, ‘నువ్వునాకు నచ్చావ్‌’, ‘మల్లేశ్వరి’ లాంటి సినిమాలు చేశా. కొద్దిరోజులకు కొత్త తరం వచ్చింది. నాకు కొంచెం మార్కెట్‌ తగ్గింది. మళ్లీ ‘అరుంధతి’తో నేనెంటో నిరూపించుకున్నా. కానీ ఆ తర్వాత ఆ స్థాయి సినిమా రాకపోవడంతో చేయలేదు.

‘హలోబ్రదర్‌’ లాంటి సినిమా చేసిన తర్వాత రాజ్‌తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..?

కోటి: కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏమీ లేదు. ఆ టైంలో అలా జరిగింది. చివరి వరకు కలిసి పని చేద్దామనుకున్నాం. కానీ చేయలేకపోయాం. అయినా ఇప్పటికీ మేం స్నేహంగానే ఉంటాం. విడిపోయాక ‘భలే బుల్లోడు’ సినిమా చేశా. జగపతిబాబు హీరో. చాలామంది కలిసి పనిచేయాలని అడిగారు. కానీ చేయలేకపోయాం.

రాజా, కేవీ మహదేవన్‌లాంటి వారు హార్మోనియంతో పాటలు చేస్తారని విన్నాం..మీరు ఎలా ట్యూన్‌ చేస్తారు..?

కోటి: నేను గిటార్‌లోనే కంపోజ్‌ చేస్తా. హార్మోనియం ఎలాగో గిటార్‌లో కూడా స్వరాలు వస్తాయి. నాకు ఇందులో సౌకర్యంగా ఉంటుంది. సత్యంగారు తబల, చక్రవర్తిగారు పాట చూడగానే ట్యూన్‌ కట్టేస్తారు. కొన్నిసార్లు ఆయనే పల్లవి ఓపెనింగ్‌ ఇస్తారు. నేను కూడా అలాగే ఇచ్చేవాడిని.

వేటూరి, సిరివెన్నెల, ఆత్రేయలతో మీ అనుబంధం ఎలా ఉండేది..?

కోటి: ఆత్రేయ చాలా సమయం తీసుకుంటారు. ముందు ట్యూన్‌ ఇవ్వాలనేవారు. కొత్త ట్యూన్లు వస్తే కొత్త పదాలు వస్తాయనే వారు. వేటూరి గురించి చెప్పలేం. యముడికి మొగుడుకు అన్ని పాటలు రాశారు. ‘అందం.. హిందోళం’ ‘వానజల్లు..’అలా అన్ని పాటలు సూపర్‌ హిట్టే. వేటూరి, సిరివెన్నెల ఇద్దరూ కూడా గమకాలతోనే పాటలు రాశారు. ఎప్పుడు మార్చాలని కోరలేదు. భువనచంద్ర కూడా బాగా రాస్తారు.

బాలుగారితో మీ అనుబంధం సాగింది..?

కోటి: బాలూ మమ్మల్ని చీకట్లో పెట్టి వెళ్లిపోయారు. మాకు అన్నింటిలోనూ ఆయనే కదా. రాజ్‌-కోటికి అన్ని పాటలు ఆయనే పాడారు. మాది ఆత్మీయబంధం. అన్ని వేల పాటలు పాడినా అహం మాత్రం లేదు. చక్రవర్తి, ఇళయరాజాలకు పాడినా మాకూ ప్రాధాన్యం ఇచ్చేవారు. మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకున్నారు. ‘హలోబ్రదర్‌’ పాటలు విని బాలు డబ్బింగ్‌ రైట్స్‌ కొన్నారు.

సంగీతంలో మాట వినపడకుండా ధ్వనులే వినిపిస్తున్నాయి దీన్ని ఎలా చెప్పవచ్చు..?

కోటి: సౌండ్‌ ఇంజినీరు తప్పు చేయడు కదా! సౌండ్‌ ఎక్కువగా పెడితే క్లారిటీ ఉండదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత సౌండ్‌ పెంచేస్తున్నారు. ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా మాట వినపడకుండా చేయాలనుకోడు.

మీ శిష్యుల్లో చాలా గొప్పస్థాయికి వెళ్లిన వారున్నారు. ఏఆర్‌ రెహమాన్‌, మణిశర్మ, తమన్‌ వాళ్ల గురించి చెప్పండి..?

కోటి: రెహమాన్‌ తొలుత ఇళయరాజా దగ్గర చేరారు. మేం బిజీ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గర ఒక్కటే కీ బోర్డు ఉండేది. కంప్యూటర్లు వచ్చిన తర్వాత రెహమాన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దాదాపుగా 8ఏళ్లు మా దగ్గర పని చేశారు. తర్వాత మణిశర్మ, దేవీశ్రీ ప్రసాద్‌, తమన్‌, హారీశ్‌జై శంకర్‌ కూడా నేర్చుకున్నారు.

మీ శిష్యులు మీకు పోటీగా తయారయ్యారు. ఎలా అనిపిస్తుంది..?

కోటి: ఎప్పటికైనా నేనే వాళ్లకు పోటీ. వాళ్లు నాకు పోటీ కాదు. నేను ఒప్పుకోను. అవకాశం వస్తే నాకు నేనే పోటీ.

సంగీత దర్శకులుగా ఉన్నపుడు దర్శకులు, హీరో, నిర్మాతలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి..?

కోటి: ఏం ఉంటుంది. డబ్బుల విషయంలోనే.. అడిగినంత ఎవరూ ఇవ్వరు. సినిమా హిట్‌ అయితే అడిగినంత ఇస్తామంటారు. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాం. నేను ఎక్కడ కూడా డిమాండ్‌ చేయలేదు. పని విషయంలోనే ఒత్తిడి చేసేవాడిని. దాసరి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.

ఈ జర్నీలో బాధ పడిన సందర్భాలున్నాయా..?

కోటి: చిరంజీవి ‘స్టార్‌ స్టార్‌.. మెగాస్టార్‌ స్టార్‌..’ ‘కొదమసింహం’లో చేశాం. మొదట ‘రాజా విక్రమార్క’ డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టికి వినిపించాం. ఆయన పెద్దగా స్పందించలేదు. దీంతో ఈ పాట ‘కొదమసింహం’ సినిమాకు ఇచ్చేశాం. అది తెలిసి రవిరాజా వచ్చి పేచీ పెట్టారు. ‘ఆ పాట మొదట నేను విన్నాను. నా సినిమాకు కావాలి’ అని అన్నారు. చివరికి చిరంజీవి ఇన్‌వాల్వ్‌ అయి సెట్‌ చేశారు.

సినిమాలు చేసుకుంటూనే ప్రైవేట్ ఆల్బమ్స్‌ చేశారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది..?

కోటి: రెహమాన్‌ స్టూడియోలో శుభ వాయిస్‌ విన్నా. ‘చిక్‌..భం’ ఆల్బం చేశాం. హిట్‌ అయ్యింది. అప్పటికి మాకు ఒక్క సినిమా లేదు. ఆ తర్వాత అందరూ వచ్చారు.

అప్పుడు గ్యాప్‌ ఎందుకు వచ్చింది..?

కోటి: ఒక సినిమాతో ఆర్‌కే క్యాసెట్స్‌ పెట్టారు. ఆడియో రైట్స్‌ అడిగాం. నిర్మాతలు బయట ఎక్కువ డబ్బు రావాలనుకుంటారు. మేం అమ్ముడు పోయిన దాని ఆధారంగా ఇస్తామని చెప్పారు. అక్కడ చిన్న తేడా వచ్చి పక్కన పెట్టారు. ఒక్క సినిమా లేకుండా పోయింది. కన్నడ పరిశ్రమకు వెళ్లాం. అక్కడ 48 సినిమాలు చేశాం.

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చాలామందితో పాటలు పాడించారు. మీరెందుకు పాటలు పాడలేదు..?

కోటి: తమన్‌ ఇష్టంతో ‘బృందావనం’లో నేనూ కీరవాణి కలిసి పాట పాడాం. ‘తపస్సు’, ‘ప్రియా..ఓ ప్రియాలో’ రెండు, మూడు పాటలు పాడాను.

ఒక సమయంలో పెళ్లి చేసుకోవద్దనుకున్నారట ఎందుకు..?

కోటి: మ్యూజికల్‌ సన్యాసిగా మారాలనుకున్నా. సన్యాసిగా మారి ఓన్లీ మ్యూజిక్‌ చేద్దామనుకున్నా. దాని అంతు చూద్దామనుకున్నా. చిదంబరం షిప్‌లో సింగపూర్‌ నుంచి వస్తుండగా స్నేహితునితో సముద్రంలో శపథం చేశా. వారం జర్నీ ఉంటుంది. ఒడ్డుకు చేరుకునే సరికి ఇంట్లో సంబంధం చూసి పెట్టారు. ఎవర్నడిగి పెళ్లి సంబంధం చూశారని గొడవ పెట్టుకున్నా. చివరికి అలా జరిగిపోయింది. అదృష్టం నా భార్య జ్యోతి. ఆమె రావడం నా కెరీర్‌కు కలిసొచ్చింది. మొదటి కూతురు పుట్టింది. ఆమెతో మరో మెట్టు ఎక్కా. తర్వాత ఇద్దరబ్బాయిలు. రాజీవ్‌ హీరోగా చేస్తున్నాడు. రోషన్‌ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. వాళ్లకు ఇంకా బ్రేక్‌ రాలేదు.

ఇంతకాలం తర్వాత ఇంకా చేయాల్సింది ఉంది అనిపిస్తుందా..?

కోటి: ఎందుకుండదు. ఏదో చేయాలనిపిస్తుంది. ఇంకా భిన్నంగా చేయాలనిపిస్తుంది. కచ్చితంగా చేస్తా. హిందీ, ఇంటర్నేషనల్‌ స్థాయిలో వెళ్లాలని ఉంది. తెలుగులో అయితే ఇక్కడే ఉండిపోతుంది. రెండు, మూడు నెలల్లో ప్రారంభం అవుతుంది.

కొత్తగా వచ్చే మ్యూజిక్‌ డైరెక్టర్లు, సింగర్లకు ఉండాల్సిన లక్షణం ఏదీ..? వారికి మీరిచ్చే సలహా ఏదీ..?

కోటి: సంగీత పరిజ్ఞానం ఉండాలి. రెండు, మూడు పాటలు పాడితే సరిపోదు. సంగీత దర్శకులు కూడా బాగా నేర్చుకోవాలి. కష్టపడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని