Sarkaru Vaari Paata: థియేటర్‌లో ఫ్యాన్స్ డ్యాన్స్ వేయడం పక్కా: తమన్

మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’(sarkaru vaari paata).

Published : 30 Apr 2022 21:33 IST

మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సర్కారు వారి పాట’ (sarkaru vaari paata). కీర్తి సురేశ్‌ కథానాయిక. తమన్‌ సంగీత దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘కళావతి’ సాంగ్‌, ‘సర్కారువారి పాట’ గురించి అనేక విషయాలను పంచుకున్నారిలా..

ఒకే సమయంలో వివిధ ప్రాజెక్టులు చేస్తూ అందరి అంచనాలను అందుకోవటం సాధ్యమేనా?

తమన్‌: చాలా కష్టం. ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో విభిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ‘సర్కారు వారి పాట’ (sarkaru vaari paata) పూర్తి కమర్షియల్ సినిమా. సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే తగ్గదు. సినిమా అంతా షైనింగ్ కనిపిస్తూనే ఇదొక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్.

లిరికల్ వీడియోకి కూడా భారీగా ఖర్చు పెట్టడంపై మీ అభిప్రాయం?

తమన్‌: ఆడియో కంపెనీలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. పాట బాగోలేకపోతే పెట్టుబడి పెట్టరు. అంతేకాదు, తగిన రాబడి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటారు. 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. పాన్ ఇండియా సినిమాలే కాదు పాటలు కూడా అయిపోయాయి.

గతంలో ఏదైనా పాట హిట్‌ కావాలంటే కాస్త సమయం పట్టేది. ఇప్పుడు పరిస్థితి మారింది కదా!

తమన్‌: అవును. మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒక ఎత్తయితే, అందరి అంచనాలను అందుకోవటం మరో ఎత్తు. దర్శకుడు, హీరో, ఫ్యాన్స్.. ఇలా అందరూ ఏదో ఒక సూచన చేస్తూనే ఉంటారు. దీంతో పాటు మిగతా భాషల పాటలతో కూడా పోటీ ఉంటుంది.

కళావతి పాట ఓకే అవ్వడానికి ఎన్ని వెర్షన్స్ చేశారు ?

తమన్‌: మేం ఎన్ని ట్యూన్స్ అయినా చేయడానికి రెడీ. అది కథకు సరిపొతుందా లేదా ? అనేది ముఖ్యం. దర్శకుడు ఎంతో కాలం కష్టపడి ఒక కథని రెడీ చేసుకుంటాడు. కథని లిరికల్‌గా చెప్పడానికి పాట కావాలి. ఇది చాలా పెద్ద బాధ్యత  సర్కారు వారి పాటలో కళావతి పాట ఇలా కథలో నుంచి వచ్చిందే. దీనికి ఒకటే వెర్షన్‌ రాశారు. నేను, దర్శకుడు పరశురాం, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్‌లో మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైన్‌ పాటగా మారి ఇప్పుడు ఫాస్టెస్ట్‌గా 150 మిలియన్స్ వ్యూస్ క్రాస్‌ చేసింది.

సినిమాకు సంబంధించి మొదట ఏం పాట విడుదల చేయాలనే చర్చ ఉంటుందా ?

తమన్‌: కచ్చితంగా ఉంటుంది. మా సినిమానే కాకుండా ఆ సమయానికి బయట సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తున్నాయనేది కూడా చూస్తాం. కళావతి పాట విడుదలకి ముందు డీజే టిల్లు, లాలా భీమ్లా నాయక్, బీస్ట్ పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ మూడు పాటలు కూడా లౌడ్ మాస్ సాంగ్స్. అలాంటి సమయంలో మెలోడీ సాంగ్ అయితే బెస్ట్ అని భావించి.. కళావతి (sarkaru vaari paata) పాట రిలీజ్ చేశాం. అలాగే, సితార వీడియోలు కొన్ని మహేశ్‌ గారి చూపించి .. పెన్నీ సాంగ్ సితారతోనే చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశా. తర్వాత నమ్రతగారిని కలసి చెప్పా. ఓకే చెప్పారు. మేం పొద్దునుంచి చేస్తే సితార మూడు గంటల్లో సాంగ్ షూటింగ్ ఫినిష్‌ చేసింది. ఫైనల్ కట్ చూసిన మహేష్ గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

ఎంతో కష్టపడి చేసిన పాట లీక్ అవ్వడంతో ఎలా ఫీలయ్యారు ?

తమన్‌: కోపం రాలేదు గానీ చాలా బాధ అనిపించింది. కరోనాతో నిర్మాతలు కుదేలయ్యారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ బాగు కోరుకోవాలి కానీ ఇలాంటి పనులు ఎలా చేస్తారో అర్థం కాదు. లీకు ఎవరు చేశారో తెలిసింది. కానీ ఏం చేస్తాం.. మా నిర్మాతలు పెద్ద మనసున్న వ్యక్తులు. కెరీర్ నాశనం కాకూడదని వార్నింగ్ ఇచ్చి పంపాం.

‘అఖండ’ తర్వాత తమనే నేపథ్య సంగీతం చేయాలనే అభిప్రాయం వచ్చింది ? దీన్ని ఎలా చూస్తారు ?

తమన్‌: ఈ క్రెడిట్ బాలయ్య, బోయపాటికే దక్కుతుంది. సినిమాలో మేజిక్ లేకపోతే ఎంత మ్యూజిక్ చేసినా నిలబడదు. ‘అఖండ’లో ఆ పవర్ ఉంది.

‘సర్కారు వారి పాట’లో మీకు సవాల్ గా అనిపించిన పాట ?

తమన్‌: టైటిల్ సాంగ్‌కు ఎక్కువ కష్టపడ్డాం. అయితే ఫైనల్‌ గా అద్భుతమైన పాట వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని