Thaman: వాడు ఇలాంటి పని చేస్తాడనుకోలేదు: తమన్‌

జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా కానీ ఈరోజు ఎంతో బాధగా ఉందని అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌. వరుస హిట్‌ ఆల్బమ్స్‌తో మాంచి ఫామ్‌లో వెళ్తోన్న ఆయన ప్రస్తుతం మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తోన్న ‘సర్కారువారి పాట’ కోసం....

Updated : 07 Dec 2022 18:45 IST

జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా కానీ... పాట లీక్‌పై సంగీత దర్శకుడు భావోద్వేగం

హైదరాబాద్‌: జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నా కానీ ఈ రోజు ఎంతో బాధగా ఉందని అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌. వరుస హిట్‌ ఆల్బమ్స్‌తో మాంచి ఫామ్‌లో దూసుకెళ్తున్న ఆయన ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తోన్న ‘సర్కారువారి పాట’ కోసం పని చేస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలోని మొదటి పాటని ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని సైతం ఇటీవల విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రం ‘కళావతి’ ఫుల్‌సాంగ్‌ నెట్టింట్లో లీక్‌ అయ్యింది. దీనిపై చిత్రబృందం షాకైంది. తమన్‌ భావోద్వేగానికి గురయ్యారు. హృదయం ముక్కలైందంటూ ఓ ఆడియోని ట్విటర్‌లో షేర్‌ చేశారు.

‘‘మనసంతా బాధగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సుమారు ఆర్నెళ్లుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాం. ఈ పాట షూట్‌ చేసినప్పుడు ఎనిమిది మందికి కరోనా వచ్చింది. అయినా సరే, మేమంతా కలిసి మంచి సాంగ్‌ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశాం. త్వరలో మీ అందరికీ ఈ పాట వినిపించాలనుకున్నాం. కానీ, ఒకడు అంత ఈజీగా దీన్ని లీక్‌ చేసేసి.. ఆన్‌లైన్‌లో పెట్టేశాడు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాడికి పని ఇస్తే ఈ పని చేస్తాడనుకోలేదు. గుండె తరుక్కుపోతుంది. కోపం, బాధ ఉప్పొంగుకొస్తున్నాయి. దీన్ని ఇలాగే వదిలేసి ఎలా ముందుకు సాగిపోవాలో అర్థం కావడం లేదు. గుండె ముక్కలైనట్లు ఉంది. సాధారణంగా నేను ఎంతో ధైర్యంగా ఉంటాను. జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు ఈరోజు ఎంతో బాధకు గురవుతున్నాను. ఈ ఆడియో పెట్టడానికి కారణం ఏమిటంటే.. పైరసీ చేసినవాడికి మా బాధ అర్థం కావాలి. పైరసీ ఎంత ఘోరమైన విషయమో తెలుసుకోవాలి. సుమారు 1000 మంది కష్టం ఈ పాట. అభిమానులందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నా’’ అని తమన్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు పాట లీక్‌ కావడంతో 14వ తేదీన రిలీజ్‌ చేయాల్సిన ‘కళావతి’ పాటను ఆదివారం (13వ తేదీ) విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు