Muttiah Muralitharan: 20 శాతమే క్రికెట్‌... 80 శాతం నా జీవితమే!

‘‘చేయి తిరిగిన స్క్రిప్ట్‌ రైటర్‌ కూడా నా జీవితంలాంటి కథని ఊహించి రాయలేడు. అన్ని ఒడుదొడుకులు... ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. నా జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో కల్పితాల్ని జోడించకుండా... కేవలం నిజాలే చెప్పాలనే షరతు విధించా.

Updated : 28 Sep 2023 14:11 IST

‘‘చేయి తిరిగిన స్క్రిప్ట్‌ రైటర్‌ కూడా నా జీవితంలాంటి కథని ఊహించి రాయలేడు. అన్ని ఒడుదొడుకులు... ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. నా జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో కల్పితాల్ని జోడించకుండా... కేవలం నిజాలే చెప్పాలనే షరతు విధించా. ఇందులో 20 శాతం క్రికెట్‌ ఉంటే... 80 శాతం నా జీవితమే ఉంటుంది’’ అన్నారు శ్రీలంక జట్టు మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌. టెస్ట్‌ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ఆయన. ఈ స్పిన్‌ దిగ్గజం జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే.. ‘800’. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకుడు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో అక్టోబరు 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, సింహళీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ముత్తయ్య మురళీధరన్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

  • ‘‘నా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో... నా జీవితం ఆధారంగా తీసిన ‘800’ ప్రయాణం కూడా అలాగే సాగింది. నా జీవితం సినిమాగా రూపొందాలని నేనెప్పుడూ కోరుకోలేదు. యాదృచ్ఛికంగానే ఈ ప్రయత్నం మొదలైంది. ఎన్నో అవాంతరాలు ఎదురైనా, చివరికి సినిమా పూర్తయ్యి, ప్రేక్షకుల ముందుకొస్తోంది. సేవా కార్యక్రమాల కోసం 20ఏళ్ల కిందట నేను ఫౌండేషన్‌ స్థాపించా. దర్శకుడు వెంకట్‌ప్రభు 2008లో ఒకసారి శ్రీలంకలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చారు. అప్పుడు ఆయనతోపాటు, ఈ చిత్ర దర్శకుడు శ్రీపతి కూడా ఉన్నారు. నా భార్య మదిమలర్‌, దర్శకుడు వెంకట్‌ ప్రభు చిన్నప్పటి స్నేహితులు. నేను సాధించిన ట్రోఫీలు, ఘనతల్ని చూసి బయోపిక్‌ ప్రతిపాదన తీసుకొచ్చారు. నేను వద్దని వారించా. నా ఫౌండేషన్‌ నుంచి ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుందని నా మేనేజర్‌ ఒప్పించాడు. అలా శ్రీపతి కథ రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వెంకట్‌ ప్రభు, తొలి  నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత సురేష్‌ ప్రొడక్షన్స్‌లో విజయ్‌ సేతుపతి హీరోగా సినిమా చేయాలనుకున్నాం. ఆ తర్వాత ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలుసు. ఈ స్క్రిప్ట్‌ సిద్ధం కావడం, నాతోపాటు అప్పటిదాకా కలిసి ప్రయాణం చేయడంతో శ్రీపతినే దర్శకత్వం వహించమని కోరాం. అలా మధుర్‌ మిట్టల్‌ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కింది. ఆలస్యమైనా సినిమా పూర్తయింది, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తోంది’’.

  • ‘‘సినిమా విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. నేనేమైనా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడటం లేదు కదా. నేను సినిమాకి పెద్ద అభిమానిని. వేలాది సినిమాల్ని చూశా. భారతీయ సినిమాల్ని అస్సలు మిస్‌ కాను. నా సినిమాని కూడా థియేటర్లోనే చూడాలని రషెస్‌ కూడా చూడలేదు. సెట్‌కి కూడా ఒక్కసారి వెళ్లాను, అది కూడా మా తల్లిదండ్రుల ఇంటికి దగ్గరలో చిత్రీకరణ జరుగుతోందని తెలిసి వెళ్లానంతే. సినిమాని  తెరపైనే చూసి ఆస్వాదించాలని ఎదురు చూస్తున్నా. కల్పితాలు లేని కథ ఇది. క్రికెటర్‌ని కాబట్టి, నా జీవిత చిత్రంలో అంతా క్రికెట్టే ఉంటుందనుకోవద్దు. 20 శాతం క్రికెట్‌ ఉంటే, 80 శాతం ఎవరికీ తెలియని నా జీవితం ఉంది. 800 వికెట్ల వరకు నా ప్రయాణం, నా బాల్యం ఏమిటి?, జట్టుకి నన్నెందుకు ఎంపిక చేశారు? నా కుటుంబం, దేశం ఎదుర్కొన్న పరిస్థితులు ఇవన్నీ సినిమాలో చూడొచ్చు. ఇవన్నీ చాలామందికి తెలియని విషయాలే. నిజమైన కథ లేకపోతే అది బయోపిక్‌ కాదనేది నా ఉద్దేశం. ఎటువంటి మసాలా లేకుండా వాస్తవాల్నే తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు’’.

  • ‘‘శ్రీలంకలో తెలుగు సినిమాలు నేరుగా విడుదల కావు. తమిళం, హిందీ సినిమాలతోపాటు, ఆ భాషల్లో డబ్‌ చేసిన తెలుగు సినిమాలు విడుదలవుతాయి. మేం అలా డబ్‌ అయిన తెలుగు సినిమాలే చూస్తుంటాం. ఒకప్పుడు హిందీ సినిమాలు అక్కడ టాప్‌లో ఉండేవి. ఇప్పుడు తెలుగు సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో స్టార్‌ హీరోలు ఎక్కువమంది ఉన్నారు. నేను నాని సినిమాలు ఎక్కువగా చూశా. తన సినిమాల్లో డ్రామా, భావోద్వేగాలు చాలా సహజంగా ఉంటాయి’’.

  • ‘‘ఈసారి ప్రపంచ కప్‌లో నా ఫేవరెట్‌ జట్టు శ్రీలంకే. వేరే జట్టు పేరు నేనెందుకు చెబుతాను. అయితే భారత్‌, ఆస్ట్రేలియా జట్లు కూడా బలంగా ఉన్నాయి. క్రికెట్‌లో ఫేవరేట్‌ జట్లే గెలుస్తాయని చెప్పలేం. విజయం వరించాలంటే అదృష్టం కీలకం. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ చూశారు కదా (నవ్వుతూ). మైదానంలో ఏమైనా జరగొచ్చు’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని