Muttiah Muralitharan: నాని సినిమాలు ఎక్కువగా చూశా: ముత్తయ్య మురళీధరన్‌

‘800’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు క్రికెటర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ (Muttiah Muralitharan). తెలుగు సినిమాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 27 Sep 2023 17:57 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ నటుడు నాని నటించిన చిత్రాలను తాను ఎక్కువగా చూశానని ప్రముఖ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో సూపర్ హీరోలు, స్టార్ హీరోలు ఎక్కువ మంది ఉన్నారని.. నాని అంటే తనకు ఇష్టమని అన్నారు. నాని సహజంగా యాక్ట్‌ చేస్తారని.. అది తనకెంతో నచ్చుతుందన్నారు. ఆయన నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘జెర్సీ’, ‘ఈగ’ చిత్రాలను తాను చూశానని చెప్పారు.

అనంతరం ఆయన తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘శ్రీలంకలో తెలుగు సినిమాలు విడుదల కావు. తమిళం, హిందీ సినిమాలు విడుదలవుతాయి. ఆయా భాషల్లో డబ్బింగ్ చేసిన తెలుగు చిత్రాలను మేము చూస్తుంటాం. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ చిత్రాలను మేము కూడా చూశాం. సాధారణంగా శ్రీలంకలో హిందీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగు చిత్రాలకు మా దేశంలో విశేష ఆదరణ పెరిగింది’’ అని ఆయన తెలిపారు.

Telugu Movies: ‘స్కంద’ టు ‘పెదకాపు 1’.. ఈ వారం సినిమాల నేపథ్యమేంటి?రన్‌టైమ్‌ ఎంతంటే?

ముత్తయ్య మురళీధరన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘800’. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకుడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేం మధుర్‌ మిత్తల్‌ కథానాయకుడిగా నటించారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 6న విడుదల కానుంది. ఈసినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మురళీధరన్‌ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని