
Hansika: మనిషి చర్మంతో వ్యాపారం.. ఉత్కంఠగా హన్సిక ‘..శ్రుతి’ టీజర్
ఇంటర్నెట్ డెస్క్: హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఈ నాయికా ప్రాధాన్య చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హన్సిక తన గురించి తాను పరిచయం చేసుకునే సన్నివేశంతో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సంభాషణలు బట్టి చూస్తుంటే మనిషి చర్మంతో చేసే వ్యాపారం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ‘చర్మం వలిచి బిజినెస్ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను’ అనే ప్రశ్నతో టీజర్ ముగిసింది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. మురళిశర్మ, పూజా రామచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం: కిషోర్ బోయిడపు.