Kushi: మణిరత్నం సినిమా పేర్లతో విజయ్‌ పాట

‘‘నా రోజా నువ్వే... నా దిల్‌ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే’ అంటూ మణిరత్నం సినిమాలోని పేర్లతో ప్రేమ పాటని అందుకున్నాడు విజయ్‌ దేవరకొండ.

Updated : 10 May 2023 12:38 IST

‘‘నా రోజా నువ్వే... నా దిల్‌ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే’ అంటూ మణిరత్నం సినిమాలోని పేర్లతో ప్రేమ పాటని అందుకున్నాడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ఇదంతా ‘ఖుషి’ (Kushi) సినిమా కోసమే. విజయ్‌ దేవరకొండ, సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని పాటని విడుదల చేశారు. మణిరత్నంపై తనకున్న ప్రేమని చాటుతూ ఈ పాటని దర్శకుడు శివ నిర్వాణ రచించడంతోపాటు నృత్య రీతులు సమకూర్చడం విశేషం. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. ‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే... నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది... ’, ‘నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా... నీ గుండె సడి లయలో నే మారనా నీ ప్రతిధ్వనిగా...’ అంటూ సాగుతుందీ పాట. కశ్మీరీ యువతిగా సమంత, ఆమె ప్రేమించిన యువకుడిగా విజయ్‌ కనిపిస్తారు. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీశర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్‌వణ్నన్‌, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు నటిస్తున్నారు.


వైవిధ్యంగా పోస్టర్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వీడీ 12’(వర్కింగ్‌ టైటిల్‌). ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్‌దేవర కొండ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పియానోని తలపించేలా పేర్చిన కాగితపు ముక్కలపై హీరో రూపం కనిపించడం ఆకట్టుకుంది. ఈ చిత్రం ఓ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని