Oscars: ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో ‘నాటు నాటు’

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల సందడి మొదలైంది. ఈసారీ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు చిత్రాలు పోటీపడుతున్నాయి.

Updated : 23 Dec 2022 06:59 IST

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ (Oscars) పురస్కారాల సందడి మొదలైంది. ఈసారీ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు చిత్రాలు పోటీపడుతున్నాయి. తాజాగా ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లో పోటీపడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌లను అకాడమీ ప్రకటించింది. పది విభాగాలకు సంబంధించిన ఈ జాబితాలో నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానం దక్కించుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ (The Film Show), ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) నుంచి ‘నాటునాటు’ (Naatu Naatu), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ (All That Breathes), ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్‌ విష్పెర్స్‌’ (the elephant whisperer) చోటు దక్కించుకున్నాయి. షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. దాని ఆధారంగా జనవరి 24న ఆస్కార్‌ నామినేషన్‌ అందుకున్న చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 12న జరిగే ఆస్కార్‌ వేడుకలో విజేతలకు పురస్కారాలను అందజేస్తారు.  రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘నాటు నాటు’ పాటకు కీరవాణి స్వరాలు అందించగా, ప్రేమ రక్షిత్‌ నృత్యాలు సమకూర్చారు.

తొలిసారి ఈ జాబితాలో పాకిస్థానీ చిత్రం: తొలిసారి ఓ పాకిస్థానీ చిత్రానికి ఈ జాబితాలో చోటు దక్కింది. సాజిద్‌ హుస్సేన్‌ దర్శకత్వం వహించిన ‘జాయ్‌ల్యాండ్‌’ చిత్రం ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగం షార్ట్‌లిస్ట్‌లో అవకాశం దక్కించుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని