Nabha Natesh: ఆ ఆపరేషన్‌ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్‌

Nabha Natesh: ‘డార్లింగ్‌’ మూవీ ట్రైలర్‌ విడుదల వేడుకలో కథానాయిక నభా నటేశ్‌ మాట్లాడారు. తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు.

Published : 08 Jul 2024 00:07 IST

హైదరాబాద్‌: కెరీర్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో జరిగిన ప్రమాదం ఎంతో ఇబ్బంది పెట్టిందని కథానాయిక నభా నటేశ్‌ (Nabha Natesh) తెలిపారు. ప్రియదర్శితో కలిసి ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డార్లింగ్‌’ (Darling Movie). అశ్విన్‌ రామ్‌ దర్శకుడు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది.

ఈ సందర్భంగా నభా నటేశ్‌ మాట్లాడారు. ‘‘యాక్సిడెంట్‌ అయిన తర్వాత కొన్నాళ్లు సినిమాలు చేయలేదు. ఏ మనిషి అయినా శారీరకంగా గాయపడితే, మానసికంగానూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో ప్రమాదం బారినపడ్డా. అప్పుడు నేను నటిస్తున్న మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. గాయం నుంచి కోలుకోవడానికి ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే, ఎలాగైనా షూటింగ్‌ పూర్తి చేయాలన్న ఉత్సుకతతో ఆపరేషన్‌ జరిగిన పది రోజులకే సెట్స్‌కు వెళ్లాను. అదే నా కెరీర్‌పై ప్రభావం చూపింది’’

‘‘గాయం తిరగబెట్టడంతో రిహాబిలిటేషన్‌ తీసుకోవాల్సి వచ్చింది. మరో సర్జరీ కూడా చేశారు. మానసికంగా ఏదైతే మనం సక్సెస్‌ అనుకుంటున్నామో అది అసలైనది కాదని అర్థమైంది. మనమందరం మనుషులం. గాయాలైనప్పుడు, ఎముకలు విరిగినప్పుడు శ్రద్ధ తీసుకుని, అవి మానడానికి తగిన సమయం ఇవ్వాలి. అప్పుడే పూర్తిగా కోలుకోగలం. గాయం మానిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలా?అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ‘డార్లింగ్‌’ స్క్రిప్ట్‌ నా దగ్గరకు వచ్చింది. ఇందులో నటిస్తున్నానని ప్రకటించాను. ‘ఇస్మార్ట్‌’ వంటి కమర్షియల్‌ తర్వాత ఇలాంటి మూవీలు అవసరమా? అన్నారు. ఇప్పుడు కంటెంటే న్యూ కమర్షియల్‌. చాలా సార్లు అది నిరూపితమైంది. అశ్విన్‌ రామ్‌ రాసిన పాత్ర విన్న తర్వాత వెంటనే ఓకే చెప్పేశా’’ అని నభా నటేశ్‌ చెప్పుకొచ్చారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసకున్న ఈ మూవీ జులై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని