Nachindi GirlFriend: చూశాక ‘నచ్చింది...’ అంటారు!

తెరపైన ఇప్పటిదాకా చూడని ఓ కొత్త అంశాన్ని మా సినిమాలో స్పృశించామంటున్నారు దర్శకుడు గురు పవన్‌.

Updated : 07 Nov 2022 08:06 IST

తెరపైన ఇప్పటిదాకా చూడని ఓ కొత్త అంశాన్ని మా సినిమాలో స్పృశించామంటున్నారు దర్శకుడు గురు పవన్‌. ‘ఇదే మా ప్రయాణం’తో మెగాఫోన్‌ చేతపట్టిన ఆయన, రెండో చిత్రంగా ‘నచ్చింది గాళ్‌ఫ్రెండూ’ తెరకెక్కించారు. ఉదయ్‌శంకర్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘నా తొలి సినిమాని రహదారి ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కించా. ఈ కథ కూడా ఇంచుమించు అలాంటిదే. విశాఖ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందించాం. ఆహ్లాదాన్ని పంచే ప్రేమకథతోపాటు, థ్రిల్లింగ్‌ అంశాలూ ఉంటాయి. మనందరి ఫోన్లలో పెట్టుబడులకి సంబంధించిన యాప్స్‌ ఉంటాయి. వాటిద్వారా ఒక తప్పు జరిగితే ఏ స్థాయిలో నష్టం జరుగుతుందనేది ఊహకు కూడా అందదు. అలాంటి ఒక సమస్యని కథానాయకుడు ఓ సూపర్‌హీరోలా కాకుండా... సాధారణ యువకుడిగానే తనకున్న ప్రతిభతో ఎలా పరిష్కరించాడనేది కీలకం. దేశంలో నిత్యం జరుగుతున్న ఇలాంటి సంఘటనని ప్రేమకథకి ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది’’.

* ‘‘ఉదయ్‌ శంకర్‌ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన సినిమాగా నిలిచిపోతుంది. తను గతంలో ‘ఆటగదరా శివ’, ‘మిస్‌మ్యాచ్‌’ తదితర చిత్రాలు చేశారు. థ్రిల్లింగ్‌ ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా కూడా తన శైలికి తగ్గట్టుగానే ఉంటుంది. అమ్మాయి నచ్చిందంటే ఆమెని ప్రేమలోకి దించే యువకుడిగా కనిపిస్తాడు. ట్రాఫిక్‌లో కనిపించిన కథానాయికని ఎలా ప్రేమలోకి దించాడనేది ఇందులో ఆసక్తికరం. ఈ పాత్రలో తన నటన కొత్తగా ఉంటుంది. కథానాయిక జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ నటన అలరిస్తుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, మధునందన్‌ తదితరుల పాత్రలు కీలకం. కథని అనుకున్నట్టుగా తెరకెక్కించేందుకు నిర్మాత అట్లూరి నారాయణరావు చక్కటి సహకారం అందించారు. సిద్ధం మనోహర్‌ కెమెరా పనితనం, గిఫ్టన్‌ సంగీతం సినిమాకి ప్రధాన బలం. ఇది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇంటిల్లిపాదినీ అలరించే వినోదం ఇందులో ఉంది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు