Nag Ashwin: అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్‌పై నాగ్‌ అశ్విన్‌ పోస్ట్‌

ప్రభాస్‌పై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 03 Jul 2024 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సాఫీస్‌ వద్ద ‘కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతోంది. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వాటన్నింటికీ హీరో ప్రభాస్‌ (Prabhas) కీలకమని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)కొనియాడారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఆ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఫొటో పంచుకుంటూ.. ‘‘ఈ విజయాలన్నింటికీ కారణం అక్కడ క్యాజువల్‌గా కూర్చొన్న వ్యక్తే. ఆయన బిగ్గెస్ట్‌ బాక్సాఫీస్‌ స్టార్‌. దర్శకత్వంలో నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. మేకింగ్‌ విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశారు. మనందరి డార్లింగ్‌, భైరవ (సినిమాలోని పాత్ర పేరు) ఇప్పుడు K____’’ అంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ కొంతసేపు కర్ణుడిగా కనిపిస్తారనే సంగతి తెలిసిందే. పార్ట్‌ 2లో ఆ క్యారెక్టర్‌ మరింత ప్రభావం చూపనుందనే ఉద్దేశంతోనే అశ్విన్‌.. కర్ణ అని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

అమితాబ్‌తో డైలాగ్స్‌.. అదే నా ఆస్తి: అర్జున్‌ దాస్‌

ఈ చిత్రంలోని కృష్ణుడి పాత్ర పోషించిన తమిళ నటుడు కృష్ణకుమార్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కింది. ఆ క్యారెక్టర్‌కు డబ్బింగ్‌ చెప్పిన మరో నటుడు అర్జున్‌ దాస్‌ (Arjun Das)కూ మంచి గుర్తింపు లభించింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ అర్జున్‌ దాస్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘కల్కి’లో కృష్ణుడి పాత్రకు మీతో డబ్బింగ్‌ చెప్పించాలనుకుంటున్నామని నిర్మాత స్వప్న కొన్ని వారాల క్రితం నాకు ఫోన్‌ చేశారు. నేను చేద్దామా, వద్దా? అనే సందేహంలో ఉండగా అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి డైలాగ్స్‌ పంచుకునే అవకాశం ఉందన్నారు. చిన్నప్పటి నుంచీ నేను అమితాబ్‌కు  అభిమానిని. పాఠశాల, కాలేజీ రోజుల్లో ఆయన వాయిస్‌ని అనుకరించేవాడిని. దీంతో, డబ్బింగ్‌ చెప్పేందుకు అంగీకరించా. సమయాభావం వల్ల తెలుగు, హిందీలోనే చెప్పా. ఈ అవకాశం ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌, స్వప్న, ప్రభాస్‌లకు కృతజ్ఞతలు. ‘నీకు భవనాలు ఉన్నాయా? బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఎంత ఉంది?’ అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే అమితాబ్‌తో డైలాగ్స్‌ షేర్‌ చేసుకున్నా.. అదే నా ఆస్తి అని చెబుతా’’ అంటూ అభిమానం చాటుకున్నారు. కల్కిలో అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా నటించిన సంగతి తెలిసిందే.

రజనీకాంత్‌, విజయ్‌ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్‌.. ‘కల్కి’ వసూళ్లు ఎంతంటే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని