Kalki 2898 AD: కల్కి కథ ఏంటో చెప్పేసిన నాగ్‌ అశ్విన్‌.. ఆ మూడు ప్రపంచాలు ఇవే!

Kalki 2898 AD: ‘కల్కి’ కథ ఏయే నేపథ్యాల మధ్య నడుస్తోంన్న అంశాలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు.

Published : 20 Jun 2024 00:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) కథ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అన్నారు. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీ ఇది. దీపిక పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్‌-1 జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ముంబయిలో ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, ‘కల్కి’ కథాసారాన్ని క్లుప్తంగా వివరించారు.

‘‘మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ ఇది. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ లేదా వారణాసి ఈ ప్రపంచంలో మొదటి నగరమని అనేక పుస్తకాలు, శాసనాల్లో ఉంది. నాగరికత పుట్టుక కూడా ఇక్కడి నుంచే మొదలైందని చెబుతారు. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే చివరి నగరమైతే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. మానవుడు బతకడానికి అవసరమైన వనరుల కోసం ఇక్కడి ప్రజలు నిత్యం పోరాటం చేస్తుంటారు. జీవనది అయిన గంగా ఎండిపోవడంతో కాశీ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు. అదే సమయంలో తిరగేసిన పిరమిడ్‌ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్‌. ఆకాశంలో కిలోమీటర మేర ఉండే ఇక్కడ లభించని వస్తువు, పదార్థమంటూ ఉండదు. ఒక ముక్కలో చెప్పాలంటే అదొక స్వర్గం. నీరు, ఆహారం, పచ్చదనం ఇలా ప్రతిదీ అక్కడ ఉంటుంది’’

‘‘కాశీ ప్రజలు ఎప్పటికైనా కాంప్లెక్స్‌ వెళ్లి అన్నింటినీ ఆస్వాదించాలనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉండటంతో అవి కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే మిలియన్ల కొద్దీ యూనిట్స్‌ కలిగి ఉండాలి. ఒకరకంగా అక్కడ అడుగు పెట్టడమంటే జీవితాన్ని పణంగా పెట్టడమే. ఈ రెండు ప్రపంచాలు కాకుండా మరో ప్రపంచం కూడా ఉంటుంది. అదే శంబాలా. వివిధ సంస్కృతుల్లో ఈ పేరును వినియోగించారు. టిబెటిన్‌ కల్చర్‌లో దీన్ని షాంగ్రిలా అని వ్యవహరిస్తారు. ప్రతి సంస్కృతిలో ఒక రహస్య ప్రపంచం దాగి ఉంటుంది. దాన్నే కొందరు ఆధునిక ప్రపంచం లేదా అవతార్‌ లోకం అంటారు. కల్కితో ఆ ప్రపంచానికి లింక్‌ అయి ఉంటుంది. ఇక్కడ నుంచే విష్ణు చివరి అవతారం వస్తుంది. ఈ మూడు ప్రపంచాలు ఒకదానితో ఒకటి కనెక్ట్‌ అవుతూ ‘కల్కి’ కథ నడుస్తుంది’’

‘‘ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే కాంప్లెక్స్‌లో మనుషులు, వారు వాడే వాహనాలు, ఆయుధాలను డిజైన్‌ చేసుకున్నాం. అలాగే వనరులన్నీ అయిపోయి నిర్జీవంగా మారిన కాశీ, అక్కడి పరిస్థితులను కూడా డిజైన్‌ చేసుకున్నాం. ఇక్కడ డబ్బును యూనిట్స్‌తో కొలుస్తారు. బౌంటీ హంటర్స్‌ యూనిట్స్‌ సంపాదించి కాంప్లెక్స్‌కు వెళ్లాలనుకుంటారు. అదే వాళ్ల జీవితాశయంగా బతుకుతారు. ఇక శంబాలా అనేది అతి పెద్ద శరణార్థి క్యాంపులాంటిది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, సంస్కృతులకు చెందిన వాళ్లను కాంప్లెక్స్‌ సభ్యులు వేటాడి హతమార్చగా మిగిలిన వాళ్లు తలదాచుకునే ప్రదేశం. వీరిలోనే రెబల్స్‌ కూడా ఉంటారు. కాంప్లెక్స్‌ సభ్యులతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్యే నడిచే కథ వాటి మధ్య ఏర్పడే సంఘర్షణలే ‘కల్కి’ కథ’’ అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని