Thank you Review: రివ్యూ: థాంక్యూ

నాగచైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా ఎలా ఉందంటే..?

Updated : 22 Jul 2022 14:35 IST

Thank you Review: చిత్రం: థాంక్యూ; న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికాగోర్‌, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీరావు, సాయి సుశాంత్ రెడ్డి, త‌దిత‌రులు; క‌థ‌: బి.వి.ఎస్‌.ర‌వి; సంగీతం: త‌మ‌న్; ఛాయాగ్రహ‌ణం: పి.సి.శ్రీరామ్‌; కూర్పు: న‌వీన్ నూలి; నిర్మాణం: దిల్‌రాజు, శిరీష్‌; నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌; ద‌ర్శక‌త్వం: విక్రమ్ కె.కుమార్‌; విడుద‌ల‌: 22-07-2022

క‌రోనా సమయానికి ముందు నాగ‌చైత‌న్య(Naga Chaitanya) ఒప్పుకున్న చిత్రాల్లో ఒక‌టి ‘థాంక్యూ’ (Thank You Review). చాలాసార్లు  విడుద‌ల తేదీల్ని మార్చుకొన్న ఈ సినిమా ఎట్టకేల‌కు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘మ‌నం’ (Manam) త‌ర్వాత నాగ‌చైత‌న్య - విక్రమ్ కె.కుమార్ (Vikram K Kumar) క‌లిసి చేసిన సినిమా ఇది. ప్రచార చిత్రాల్లో నాగ‌చైత‌న్య క‌నిపించిన విధానంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని కాస్త ఆక‌ర్షించింది. ఇటీవ‌ల విడుద‌ల‌వుతున్న సినిమాల‌కి ప్రేక్షకుల స్పంద‌న కొర‌వ‌డిన ఈ ద‌శ‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘థాంక్యూ’ ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం (Thankyou Review).

క‌థేంటంటే: అభిరామ్ (నాగ‌చైత‌న్య) (Naga Chaitanya) పేదింటి కుర్రాడు. చిన్ననాటి నుంచే త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలుంటాయి. త‌న జీవితంలో ఒకొక్క మ‌జిలీ త‌ర్వాత అమెరికా చేరుకుంటాడు. అక్కడ త‌న తెలివితేట‌ల‌తో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అత‌డి మ‌న‌సుని చూసి ప్రియ (రాశీఖ‌న్నా)(Rashi Khanna) ప్రేమిస్తుంది. ఇద్దరూ స‌హ‌జీవ‌నం చేస్తారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అభి ఆలోచ‌న‌లు మారిపోతాయి. జీవితంలో ఎన్నో వ‌దులుకుని ఇక్కడిదాకా వ‌చ్చా.. రాజీ ప‌డే ప్రస‌క్తే లేదంటూ ఎవ్వరినీ లెక్క చేయ‌డు. నేను, నా ఎదుగుద‌ల అన్నట్టుగానే వ్యవ‌హరిస్తుంటాడు. ఎదుటివాళ్ల మ‌నోభావాల్ని అస్సలు ప‌ట్టించుకోడు. దీంతో ప్రియ అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. అభి అలా సెల్ఫ్ సెంట్రిక్‌గా మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? ప్రియ దూర‌మ‌య్యాకైనా అతడి ఆలోచ‌న‌లు మారాయా? ఆ తర్వాత ఇండియాకి వ‌చ్చిన అభి ఏం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌ (Thank you Review).

ఎలా ఉందంటే: అభిరామ్ ప్రయాణ‌మే ఈ సినిమా. జీవితంలో అప్పటిదాకా దాటుకుంటూ వ‌చ్చిన ఒక్కొక్క ద‌శ‌ని ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచ‌డ‌మ‌నే కాన్సెప్ట్ మ‌న సినిమాకి కొత్తేమీ కాదు.  నాగ‌చైత‌న్య ‘ప్రేమ‌మ్‌’ కూడా అలాంటి ప్రయ‌త్నమే. కాక‌పోతే ఈ క‌థ‌లో ప్రేమ‌కంటే కూడా జీవితంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. తెలిసో తెలియ‌కో ఒక్కొక్కరూ మ‌న జీవితాన్ని ఒక్కో మ‌లుపు తిప్పుతుంటారు. మ‌నం ఎదిగాక కృత‌జ్ఞత‌గా వాళ్లని గుర్తు చేసుకోవాల్సిందే అని చెప్పే ప్రయ‌త్నం ఇందులో క‌నిపిస్తుంది. క‌థేదైనా క‌థ‌నంతో దానికి కొత్త హంగులు తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తుంటారు. ఇందులోని క‌థ అంద‌రికీ తెలిసిందే. క‌థ‌నం విష‌యంలోనూ పెద్దగా క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. ఆరంభ స‌న్నివేశాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రియ‌, అభిరామ్ క‌ల‌వ‌డం.. వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం.. ఆ త‌ర్వాత అభిరామ్ ఎదుగుద‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు ప్రేక్షకుడిని క‌థ‌లో లీనం చేస్తాయి. కానీ ఈ క‌థాగ‌మ‌నం ఏమిటో ప్రేక్షకుడి ఊహ‌కు అందేలా సాగుతుంది. మ‌న‌స్సాక్షి ఎపిసోడ్ త‌ర్వాత క‌థ‌లో ఉప‌క‌థ‌లు మొద‌ల‌వుతాయి. నాగ‌చైత‌న్య - మాళ‌విక నాయ‌ర్ (పార్వతి) మ‌ధ్య సాగే తొలిక‌థ కొత్తగా అనిపించ‌క‌పోయినా అందంగానే ఉంటుంది. ద్వితీయార్ధం త‌ర్వాత మొద‌ల‌య్యే రెండో క‌థ విష‌యంలోనే స‌మ‌స్యంతా. సుదీర్ఘంగా సాగ‌డం, అందులో కొత్తద‌నమేదీ లేక‌పోవ‌డంతో సినిమా రొటీన్‌గా మారిపోయింది. క‌టౌట్లు, హాకీ అంటూ చాలా హంగామానే ఉంటుంది కానీ, ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా సాగ‌దీత‌గానే అనిపిస్తాయి. పార్వతి, శ‌ర్వాని క‌లిశాక ప‌తాక స‌న్నివేశాలు మొద‌ల‌వుతాయి. అవి భావోద్వేగాల‌తో మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉన్నప్పటికీ అప్పటికే జ‌రగాల్సిన న‌ష్టమంతా జ‌రిగిపోయిన‌ట్టు అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: నాగ‌చైత‌న్య త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకున్నాడు. మూడు కోణాల్లో ఆయ‌న పాత్ర క‌నిపిస్తుంది. ఆ మూడు గెట‌ప్పుల్లోనూ త‌న‌దైన మార్క్ క‌నిపిస్తుంది. రాశీఖ‌న్నాతో క‌లిసి ప‌తాక స‌న్నివేశాల్లో అభిన‌యం ఇంకా బాగుంటుంది. రాశీఖ‌న్నా పాత్రతోనే ఈ క‌థ మొద‌ల‌వుతుంది. ప్రియ పాత్రలో ఆమె క‌నిపించిన విధానం, న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మాళ‌విక నాయ‌ర్ పార్వతి పాత్రలో స‌హ‌జంగా ఒదిగిపోయింది. అవికాగోర్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ, పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది. ప్రకాశ్‌రాజ్‌, సుశాంత్‌రెడ్డి కీల‌క పాత్రల్లో క‌నిపిస్తారు. సాంకేతిక విభాగాల్లో పి.సి.శ్రీరామ్ కెమెరా ప‌నిత‌నం అబ్బుర ప‌రుస్తుంది. ప్రతి ఫ్రేమ్ అందంగా క‌నిపిస్తుంది. తమ‌న్ పాట‌లు గుర్తు పెట్టుకునేలా లేక‌పోయినా నేప‌థ్య సంగీతంపై త‌న‌దైన ప్రభావం చూపించారాయన. ఇతర విభాగాలు ప‌ర్వాలేద‌నిపించాయి. సినిమాలో విక్రమ్‌.కె కుమార్ మ్యాజిక్‌ క‌నిపించ‌లేదు. నిర్మాణం బాగుంది.

బ‌లాలు
+ నాగ‌చైత‌న్య న‌ట‌న
+ అక్కడ‌క్కడా భావోద్వేగాలు
+ ఛాయాగ్రహ‌ణం
బ‌ల‌హీన‌త‌లు
- తెలిసిన క‌థ‌
- కొత్తద‌నం కొర‌వ‌డిన క‌థ‌నం

చివ‌రిగా: థాంక్యూ.. కొన్ని స‌న్నివేశాల‌కు మాత్రమే..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని