Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) బయటపెట్టారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో భాగంగా...

Updated : 10 Aug 2022 12:23 IST

హైదరాబాద్: తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) బయటపెట్టారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి స్పందించారు. ‘‘మీ చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏమిటి? దానిని ఎందుకు వేయించుకున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘చేతి మణికట్టు దగ్గర మాత్రమే నాకు పచ్చబొట్టు ఉంటుంది. అదంటే నాకెంతో ఇష్టం. సామ్‌తో పెళ్లి జరిగిన తేదీని పచ్చబొట్టుగా వేయించుకున్నా. చూసేవారికి అది డేట్‌ అనే విషయం తెలియదు. దాంతో నా అభిమానులు చాలామంది ఆ పచ్చబొట్టుని కాపీ కొడుతున్నారు. ఇటీవల నేను పలువురు అభిమానుల్ని కలిశా. వారిలో కొంతమంది నా చేతిపై ఉన్న పచ్చబొట్టునే కాపీ కొట్టి వేయించుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నా అభిమానులందరికీ చెప్పేది ఒక్కటే.. దయచేసి టాటూ విషయంలో నన్ను ఫాలో కాకండి. ఎందుకంటే అది నా మ్యారేజ్‌ డేట్‌’’ అని వివరించారు.

‘‘సామ్‌-మీరూ విడిపోయిన తర్వాత ఆ పచ్చబొట్టు మార్చుకోవాలని అనిపించలేదా?’’ అని ప్రశ్నించగా.. ‘‘దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఈ టాటూ ఉండటం వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు’’ అని చై తెలిపారు. ఒకవేళ తనకిప్పుడు సామ్‌ ఎదురైతే ఆమెకు హాయ్‌ చెప్పి ఆలింగనం చేసుకుంటానని అన్నారు. తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతానికి తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. స్నేహితులుగా పరిచయమైన సామ్‌-చై 2017 అక్టోబర్‌ 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత గతేడాది అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్‌లో బిజీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని