Naga Chaitanya: సామ్‌తో విడాకులు.. నా జీవితంలో ఏం జరిగిందో వాళ్లకే తెలుసు: నాగచైతన్య

పరస్పర అంగీకారంతో అగ్రకథానాయిక సమంత (Samantha) నుంచి విడిపోవడంపై నటుడు నాగచైతన్య (Naga Chaitanya) స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై సోషల్‌మీడియా వేదికగా జరుగుతోన్న ప్రచారంతో...

Published : 01 Aug 2022 11:41 IST

ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు

హైదరాబాద్‌: పరస్పర అంగీకారంతో అగ్రకథానాయిక సమంత (Samantha) నుంచి విడిపోవడంపై నటుడు నాగచైతన్య (Naga Chaitanya) స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై సోషల్‌మీడియా వేదికగా జరుగుతోన్న ప్రచారంతో విసిగెత్తిపోయిన చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక నటుడిగా తన వర్క్‌ గురించే అందరూ మాట్లాడుకోవాలని భావిస్తున్నానని, వ్యక్తిగత జీవితం గురించి కాదని అన్నారు. ఈ రంగంలో ఉన్నప్పుడు నటీనటుల వ్యక్తిగత జీవితంపై కూడా అందరూ ఫోకస్‌ చేస్తుంటారని, అది నిజంగా దురదృష్టకరమన్నారు.

‘‘కెరీర్‌లో నేను సాధించిన విజయాలకంటే నా వ్యక్తిగత జీవితం ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలవడం చూస్తుంటే చిరాకుగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలను ఏదో ఒక ప్రకటన రూపంలో తెలియజేస్తుంటా. మంచైనా, చెడైనా నా జీవితం గురించి అందరితో పంచుకోవాల్సిన విషయాలన్నింటినీ చెప్పాల్సినంత వరకూ చెబుతా. విడిపోయినప్పుడు కూడా సమంత, నేనూ ఏమైతే చెప్పాలనుకున్నామో అదే విషయాన్ని మేమిద్దరం ప్రకటనల రూపంలో బయటపెట్టాం. విడిపోయి ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగిపోవాలనుకుంటున్నామనే చెప్పాం. అంతకు మించి మా మధ్య జరిగిన ఒక్క విషయాన్ని నేను ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకోవడం లేదు. నా జీవితంలో అసలు ఏం జరిగిందో నా కుటుంబం, బంధుమిత్రులందరికీ తెలుసు. ఇక న్యూస్‌ని న్యూసే రీప్లేస్‌ చేస్తుంది. సోషల్‌మీడియాలో నా గురించి జరుగుతోన్న ప్రచారాలు, ఉహాగానాలన్నీ తాత్కాలికమైనవి. దీనిపై నేనెంత స్పందిస్తే అన్ని వార్తలు పుట్టుకొస్తాయి. అది నాకిష్టం లేదు. అందుకే నేను వాటిని పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఏదో ఒకరోజు ఈ ప్రచారాలన్నింటికీ ముగింపు ఉంటుందనే నమ్మకం నాకు ఉంది’’ అని చైతన్య చెప్పుకొచ్చారు. 

సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న సామ్‌-చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఈ జంట 2020లో ప్రకటించారు. విడాకుల అనంతరం  ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సామ్‌ పలు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాము విడిపోవడం అంత సాధారణంగా జరగలేదని, తమ మధ్య సఖ్యత లేదని, ఒకవేళ తామిద్దరం ఒకే గదిలో ఉండాల్సి వస్తే అక్కడ పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలంటూ సామ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని