Updated : 23 Sep 2022 08:04 IST

Naga Shaurya: పాదయాత్ర చాలా విషయాలు నేర్పింది

సున్నితమైన ప్రేమకథలకు.. వినోదభరితంగా సాగే కుటుంబ కథా చిత్రాలకూ చిరునామా నాగశౌర్య. నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తూ.. ప్రేమకథల్లో చక్కగా ఒదిగిపోయే ఈ యువ హీరో.. ఇప్పుడు ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari)తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. అనీష్‌ ఆర్‌.కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. ఉషా ముల్పూరి నిర్మించారు. షిర్లీ సేథియా కథానాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు నాగశౌర్య (Naga Shaurya). ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివే..

ఈ చిత్రం కోసం పాదయాత్ర చేశారు. అది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించింది? 

‘‘ఆరోగ్యం కొంచెం తేడా కొట్టింది. అయితే అది పాదయాత్ర కంటే సినిమా రిలీజ్‌ ఒత్తిడి వల్ల అని భావిస్తున్నా. నా కెరీర్‌లో ఇంత ఒత్తిడి ఎప్పుడూ ఎదుర్కోలేదు. పాదయాత్రలో ప్రేక్షకుల అభిమానం చూస్తే నిజంగా ఒక వరం అనిపించింది. ఈ పాదయాత్రతో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా’’. 

ఇప్పటికే బ్రాహ్మణ పాత్రలతో ‘అదుర్స్‌’, ‘డిజే’, ‘అంటే.. సుందరానికీ’ వంటి చిత్రాలొచ్చాయి కదా. ఇది ఎంత కొత్తగా ఉంటుంది? 

‘‘అదుర్స్‌’, ‘డిజే’, ‘అంటే సుందరానికీ’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలు ఉన్న మాత్రాన పాత్రలు, కథలు ఒకటి కాదు. దేనికదే భిన్నమైనది. ఈ చిత్రం కూడా వాటన్నింటికీ పూర్తి భిన్నంగానే ఉంటుంది’’. 

ఈ పాత్ర కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా సిద్ధమయ్యారా? 

‘‘కమల్‌హాసన్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌.. ఇలా చాలా మంది స్టార్లు బ్రాహ్మణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చేస్తున్నప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నా. నాకు అవసరాల శ్రీనివాస్‌ మంచి మిత్రుడు. తను బ్రాహ్మిణే కావడం వల్ల వారి మాటతీరు.. నడవడిక.. ఇలా అనేక విషయాల్ని ఆయనకు తెలియకుండానే తన నుంచి గమనించి నేర్చుకున్నా. సినిమా కచ్చితంగా ఏ ఒక్కరి మనోభావాల్ని నొప్పించని విధంగానే ఉంటుంది’’. 

ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా? 

‘‘పాన్‌ ఇండియా చెయ్యాలనుకొని చేస్తే.. కుదిరేది కాదు. మంచి కథ రావాలి. కథ లేకుండా ఏం చేయలేం. వాస్తవానికి మంచి కథా బలమున్న సినిమా తీస్తే ప్రపంచమంతా చూస్తారని నమ్ముతాను. నేను ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ సినిమా చేస్తున్నా’’.  

క్లాస్‌గా సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్లు.. మాస్‌ సినిమాలు.. వీటిలో ఏవి మీకు బాగా సౌకర్యంగా అనిపిస్తాయి? 

‘‘ఒక నటుడిగా నేను అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటా. అన్ని జానర్స్‌లో నా ప్రతిభను నిరూపించుకోవాలని ఉంటుంది. రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో నేను వీక్‌ (నవ్వుతూ). దర్శకుడు చాలా కష్టపడి జాగ్రత్తగా ఇందులో చేయించారు’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని