Nagababu: పవన్‌కు ఇచ్చే గొప్ప బహుమతి అదే..: చరణ్‌ బర్త్‌డే వేడుకల్లో నాగబాబు కామెంట్స్‌

ప్రముఖ హీరో రామ్‌చరణ్‌ పుట్టినరోజు వేడుకల్లో నటుడు, నిర్మాత నాగబాబు సందడి చేశారు. చరణ్‌ గర్వకారణమని పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 22:08 IST

హైదరాబాద్‌: సీఎం అంటూ నినాదం చేస్తే సరిపోదని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్‌కల్యాణ్‌ అభిమానులకు సూచించారు నటుడు, నిర్మాత నాగబాబు. మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నాగబాబు మాట్లాడారు. ఆయనతోపాటు పలువురు సినీ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ అభిమానులు హాజరై సందడి చేశారు.

వేడుకనుద్దేశించి నాగబాబు మాట్లాడుతూ..‘‘మా తోబుట్టువులందరికీ అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) ఎలాగో.. మా పిల్లలకు చరణ్‌ బాబు అంతే. చిన్నప్పుడు చరణ్‌ అమాయకంగా ఉండేవాడు. యుక్త వయసులో చాలా కోపంగా, ఎమోషనల్‌గా ఉండేవాడు. తర్వాత మెచ్యూరిటీతో సాఫ్ట్‌గా మారాడు. ‘ప్రతి ఇంటికి ఇలాంటి కొడుకు ఉంటే బావుణ్ను’ అని అనుకునేలా చేస్తాడు. మా పిల్లలు, మా సిస్టర్స్‌ పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వారు చరణ్‌ దగ్గరకే వెళ్తారు. పెద్దన్నగా బాధ్యత తీసుకుని, వారిని సరైన దారిలో నడిపిస్తుంటాడు. చరణ్‌ మా అందరికీ గర్వకారణం. బాలీవుడ్‌లో కొందరు తనను తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు బాలీవుడ్‌ మొత్తం తనవైపు చూసేలా చేశాడు. తనని ‘ఆస్కార్‌’ అవార్డుల వేడుకల్లో చూసి తెలుగువారంతా గర్వించారు. ఆ స్క్రీన్‌పై చరణ్‌ని చూడగానే చాలా సంతోషించా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌కి, ముఖ్యంగా దర్శకుడు రాజమౌళికి నా కృతజ్ఞతలు. జనసేన కార్యకర్తగా ఆ పార్టీకి ఏం చేద్దామనుకుంటున్నప్పుడు.. చరణ్‌ సినిమా ‘ఆరెంజ్‌’ (Orange) రీరిలీజ్‌ ఆలోచన వచ్చింది. దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని పార్టీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ‘ఆరెంజ్‌’ విడుదల సమయంలో నేను ఆర్థికంగా నష్టపోయినా.. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి షాక్‌ అయ్యా. ఈ జనరేషన్‌కు అది సరైన సినిమా అనిపించింది’’ అని నాగబాబు ఆనందం వ్యక్తం చేశారు.

‘సీఎం.. సీఎం’ అంటూ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)ను ఉద్దేశిస్తూ అభిమానులు/జనసేన కార్యకర్తలు నినాదాలు చేయడంపై నాగబాబు స్పందించారు. ‘‘సీఎం.. సీఎం’ అని అరిస్తే కాదు.. ఓట్లు వేయాలి’ అని ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ మీకు చాలా సార్లు చెప్పాడు కదా. అందుకే సీఎం అంటూ నినాదాలు చేయడం కాదు ప్రజలను మోటివేట్‌ చేయండి. అదే పవన్‌కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’’ అని జనసైనికులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని