Nagababu: మా ఇంటి హీరోలు ఇవ్వని అవకాశం సుస్మిత ఇచ్చింది: నాగబాబు

సంతోష్‌ శోభన్‌, గౌరి జి. కిషన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాగబాబు హాజరై, మాట్లాడారు.

Published : 15 Feb 2023 22:50 IST

హైదరాబాద్‌: తన ఇంట్లో చాలామంది హీరోలున్నా నటించేందుకు ఎప్పుడూ ఏ క్యారెక్టర్‌ ఇవ్వలేదని (నవ్వుతూ..), సుస్మిత రెండు అవకాశాలు ఇచ్చిందని చెబుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు నటుడు నాగబాబు (Nagababu). ‘శ్రీదేవి శోభన్‌బాబు’ (Sridevi Shobanbabu) ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడారు. సంతోష్‌ శోభన్‌ (Santosh Shoban), గౌరి జి. కిషన్‌ జంటగా నూతన దర్శకుడు ప్రశాంత్‌కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన చిత్రమిది. విష్ణు ప్రసాద్‌తో కలిసి చిరంజీవి తనయ సుస్మిత ఈ సినిమాని నిర్మించారు. ఈ నెల 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

వేడుకనుద్దేశించి నాగబాబు మాట్లాడుతూ.. ‘‘సుస్మిత తలుచుకుంటే ఏ హీరో అయిన తన సినిమాల్లో నటిస్తాడు. కానీ, తను ఎవరి సపోర్ట్‌ తీసుకోకుండా ఇండిపెండెంట్‌ ప్రొడ్యూసర్‌గా అన్నీ నేర్చుకుంటోంది. ఆమె తర్వలోనే మెగా ప్రొడ్యూసర్‌ అవుతుంది. దర్శకుడు ప్రశాంత్‌ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. డైరెక్టర్‌గా అతడికి మంచి భవిష్యత్తు ఉంది. సంతోష్‌ ఫాదర్‌ శోభన్‌ నాకు బాగా తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఆయన వారసత్వాన్ని సంతోష్‌ ముందుకు తీసుకెళ్తున్నాడు. సినిమా అనేది పురుషులకు మాత్రమే కాదు.. అందరికీ చెందింది. టెలివిజన్‌ విషయంలో ఫిమేల్‌ డామినేషన్‌, సినిమా విషయంలో మేల్‌ డామినేషన్‌ కనిపిస్తోంది. ‘‘ఆడ పిల్లలను సినిమా పరిశ్రమలోకి పంపించకూడదు, వారు నటించకూడదు, చిత్రాలు నిర్మించకూడదు’’.. ఇలాంటి ఆలోచనతో ఇంకా మనలో చాలామంది ఉన్నారు. బయటేకాదు ఈ ఇండస్ట్రీలోనూ ఉన్నారు. అవకాశం ఇస్తే ఆడవారు మగవారి కంటే బాగా యాక్ట్‌ చేయగలరు. సినిమాలకు దర్శకత్వం వహించగలరు. చాలామంది విషయంలో అది రుజువైంది’’ అని నాగబాబు అన్నారు.

‘‘ఎమోషన్స్‌ ఉన్న కథలు తెరకెక్కించే యువ దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రశాంత్‌ ఎలాంటి కమర్షియల్‌ హంగులద్దకుండా తన మనసులో ఏం అనుకున్నాడో దాన్నే తెరపైకి తీసుకొచ్చాడు’’ అని సుస్మిత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని