Dhoota: భారీ స్థాయిలో విడుదల కానున్న నాగచైతన్య తొలి వెబ్‌ సిరీస్

‘దూత’ (Dhootha) అనే వెబ్‌ సిరీస్‌తో నాగ చైతన్య ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 18 May 2023 13:11 IST

హైదరాబాద్‌: హీరో నాగచైతన్య ఇటీవల ‘కస్టడీ’తో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమాలో పోలీస్‌ పాత్రలో కనిపించి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ అక్కినేని హీరో నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘దూత’ (Dhootha). గతేడాదిలో ప్రకటించిన ఈ సిరీస్‌పై నాగచైతన్య తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ అంతా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. మొదట ఈ సిరీస్‌ను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నాం. ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ అమెజాన్‌ (Amazon) దీన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆ సంస్థ దీని విడుదలను భారీగా ప్లాన్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా రిలీజ్‌ చేయాలనుకుంటోంది. అందుకే మేము ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ డబ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ఇది తన తొలి వెబ్‌ సిరీస్‌ అని వెల్లడించిన చైతన్య (Nagachaitanya) దీని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. హారర్‌ కథతో రూపొందిస్తున్న ఇందులో ఆయన జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. తాను ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించలేదన్నారు. విక్రమ్‌.కె కుమార్‌ దర్శకత్వంలో రానున్న ఈ సిరీస్‌ను నాగచైతన్య ‘థాంక్యూ’ చేస్తున్నప్పుడే ప్రకటించారు. అయితే నాటి నుంచి ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. తాజాగా వచ్చిన ఈ న్యూస్‌తో ఆయన ఫ్యాన్స్‌ ఆనందిస్తున్నారు. ఈ సిరీస్‌ జులైలో విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని