Bangarraju: నాగచైతన్య విషయంలో.. మీకు ప్రామిస్‌ చేస్తున్నా: నాగార్జున

‘‘బంగార్రాజు’ సినిమాలో కొత్త నాగచైతన్యను చూస్తారు. ఇది నా ప్రామిస్‌’ అని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రమే ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు.

Updated : 13 Jan 2022 22:28 IST

హైదరాబాద్‌: ‘‘బంగార్రాజు’ సినిమాలో కొత్త నాగ చైతన్యను చూస్తారు. ఇది నా ప్రామిస్‌’’ అని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రమే ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది.

వేడుకనుద్దేశించి నాగార్జున మాట్లాడుతూ.. ‘‘పంచె ధరించినప్పుడల్లా మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) గుర్తొస్తుంటారు. ఆయన మాతోనే ఉన్నట్టుంటుంది. సంక్రాంతి పండగ, తెలుగు సినిమా ప్రేక్షకులు ఫెవికాల్‌లా అతుక్కుని ఉంటారని ఎక్కడో విన్నా. అలాంటిది పండగకు సినిమా లేకపోతే ఎలా? అందుకే మా టీమ్‌ అంతా ఎంతో కష్టపడి అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేసింది. ఈ సందర్భంగా వారందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నా. తనకు ఇది మూడో చిత్రమైనా కృతిశెట్టి చాలా బాగా నటించింది. ఇందులో కొత్త నాగచైతన్యను చూస్తారు. ఇది నా ప్రామిస్‌. తన నుంచి మాస్‌ అంశాలు కోరుకుంటున్నారు కదా.. అవి ఈ చిత్రంలో కనిపిస్తాయి. సినిమా గురించి ఇప్పుడు కాదు ‘బ్లాక్‌బ్లస్టర్‌ సక్సెస్‌ పార్టీ’లో చెబుతా. ఎక్కువమంది అభిమానులతో ఈ వేడుకను ఘనంగా చేద్దామనుకున్నా కానీ కొవిడ్‌ నిబంధనల వల్ల కుదరలేదు. సక్సెస్‌ మీట్‌లో మీ అందరినీ కలుస్తా’’ అని అన్నారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా గతేడాది సెప్టెంబరులో ప్రారంభించాం. సంక్రాంతికి విడుదల చేయగలమా? అని ఆ సమయంలోనే నాన్నని అడిగా. నన్ను నమ్ము అని ఒకే మాట అన్నారాయన. అనుకున్నట్టుగానే సంక్రాంతికి సినిమా సిద్ధమైంది. సినిమాకు సంబంధించి నిర్వహించే వేడుకల్లో మీరు ఎలాంటి జోష్‌ చూపిస్తారో ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం అంతే ఎనర్జీతో ఉంటుంది. ఎప్పటి నుంచో చెప్తున్నాం.. ఇది నిజంగా పండగలాంటి సినిమా. సంక్రాంతి పండగ కోసమే నాన్న ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు పనిచేసిన నటులు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. తప్పకుండా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. నచ్చితే ‘వాసివాడి తస్సాదియ్యా’ అనే డైలాగ్‌ చెబుతూ థియేటర్‌ నుంచి బయటకురండి. కొవిడ్‌ నిబంధనలు పాటించండి’’ అని విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని