Chiranjeevi: అది నా వల్ల కాని పని.. రీమేక్స్‌పై చిరు కామెంట్స్‌ వైరల్‌

పలు భాషల్లో విజయం సాధించిన చిత్రాలను రీమేక్‌ చేసి తన కెరీర్‌లో సూపర్‌హిట్స్‌ అందుకున్నారు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). తాజాగా ఆయన ఓ బాలీవుడ్‌ బడా హీరోకు చెందిన....

Published : 01 Aug 2022 10:55 IST

హైదరాబాద్‌: పలు భాషల్లో విజయం సాధించిన చిత్రాలను రీమేక్‌ చేసి తన కెరీర్‌లో సూపర్‌హిట్స్‌ అందుకున్నారు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). తాజాగా ఆయన ఓ బాలీవుడ్‌ బడా హీరోకు చెందిన సూపర్‌ హిట్‌ చిత్రాలపై స్పందించారు. ఆ హీరో చిత్రాలను తాను రీమేక్‌ చేయలేనని తేల్చి చెప్పేశారు. ఇంతకీ చిరు ఏ హీరో సినిమాల గురించి చెప్పారంటే.. ఆమిర్‌ఖాన్ (Aamir Khan)‌. 

ఆమిర్‌ఖాన్‌ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ చిరంజీవి సమర్పణలో విడుదల కానుంది. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి, ఆమిర్‌ఖాన్‌, నాగచైతన్యలను నాగార్జున ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. దీనిలో నాగ్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమిర్‌ఖాన్‌, చిరు, చై సరదాగా సమాధానాలు చెప్పారు. తాను హోస్ట్‌గా ముగ్గురు స్టార్‌లను ఇంటర్వ్యూ చేయడం అద్భుతంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం నాగ్‌.. ‘‘అవకాశం వస్తే ఆమిర్‌ నటించిన ఏ సినిమాలను మీరు రీమేక్‌ చేయాలనుకుంటున్నారు?’’ అని చిరుని ప్రశ్నించగా.. ‘‘నో.. నేను చేయలేను’’ అని సమాధానమిచ్చారు. మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమిర్‌కు వృత్తిపట్ల ఉన్న నిబద్ధతను మెచ్చుకుంటూ చిరు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

చిరు వ్యాఖ్యలపై ఆమిర్‌ స్పందిస్తూ.. ‘‘నేను మీతో ఓ సినిమా చేయాలనుకుంటున్నా. కుదిరితే ఆ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తా. లేదంటే నిర్మాతగా అయినా వ్యవహరిస్తా’’ అని తన మనసులోని మాట బయటపెట్టారు. ఇక ఈ ఇంటర్వ్యూలోనే చిరు తన ఫస్ట్‌లవ్ గురించి స్పందించారు. ‘‘నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు నా మొదటి ప్రేమకథ మొదలైంది. అప్పట్లో ఓ అమ్మాయిని ఇష్టపడ్డా. ఒక అమ్మాయి సైకిల్‌ తొక్కడమంటే మొగల్తూరులో అప్పట్లో అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. ఆ అమ్మాయి సాయంతో నేను సైకిల్‌ తొక్కుతుండేవాడిని. సైకిల్‌పై శ్రద్ధ పెట్టడం కంటే ఆమెపైనే నా దృష్టి మొత్తం ఉండేది. నేను తననే చూస్తున్నానని అర్థమైన ఆమె వెంటనే అటు కాదు, ఇటు చూడు అంటుండేది’’ అని చిరు ఆనాటి మధుర జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిరు చెప్పిన ఎన్నో విశేషాలు అందరి ఆకట్టుకుంటున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని