Vikranth Rona: ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జాబితాలోకి ‘విక్రాంత్‌ రోణ’: నాగార్జున

‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల పోస్టర్లు తమ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గర్వంగా పెట్టుకుంటామని, ఆ జాబితాలో ‘విక్రాంత్‌ రోణ’ త్వరలో చేరుతుందన్నారు ప్రముఖ నటుడు నాగార్జున. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, ఆయన మాట్లాడారు.

Updated : 26 Jul 2022 16:19 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ (Baahubali), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లాంటి చిత్రాల పోస్టర్లను తమ అన్నపూర్ణ స్టూడియోస్‌లో (Annapurna Studios) గర్వంగా పెట్టుకున్నామని, ఆ జాబితాలో ‘విక్రాంత్‌ రోణ’ (Vikranth Rona) త్వరలో చేరుతుందన్నారు ప్రముఖ నటుడు నాగార్జున (Akkineni Nagarjuna). ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, ఆయన మాట్లాడారు. కిచ్చా సుదీప్‌ (Kiccha Sudeep) హీరోగా తెరకెక్కిన త్రీడీ సినిమానే ‘విక్రాంత్‌ రోణ’. అనుప్‌ భండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 28న విడుదల కానుంది.

వేడుకనుద్దేశించి నాగార్జున మాట్లాడుతూ.. ‘‘సుదీప్‌ కన్నడ అబ్బాయి కాదు. మన తెలుగువాడే. తానెప్పుడూ ఇక్కడే ఉంటాడు (హైదరాబాద్‌). భారతీయ సినీ ప్రేక్షకులందరికీ సుదీప్‌ తెలుసు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి, మెప్పించాడు. ఇప్పుడు ‘విక్రాంత్‌ రోణ’తో ఒకేసారి అన్ని భాషల వారిని పలకరించబోతున్నాడు. ‘ఫేవరెట్‌ ఫిల్మ్‌ను ఇక్కడ చిత్రీకరించారు’ అని గర్వంగా ఫీలవుతూ ఆయా చిత్రాలకు సంబంధించి పెద్ద పెద్ద పోస్టర్లను అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెడుతుంటాం. ఈ క్రమంలో ఇటీవల.. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాల పోస్టర్లు పెట్టాం. ట్రైలర్‌ చూసినప్పుడే ‘విక్రాంత్‌ రోణ’ కూడా ఆ జాబితాలో చేరుతుందనిపించింది. ఇతర చిత్ర పరిశ్రమల ప్రేక్షకుల గురించి నాకు తెలియదుగానీ సినిమా నచ్చితే చాలు తెలుగు ప్రేక్షకులు దాన్ని ఓ స్థాయిలో నిలబెడతారు. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వాలి’’ అని నాగార్జున ఆకాంక్షించారు.

ఒక్క ఫోన్‌ కాల్‌తో వచ్చారు: సుదీప్‌

‘‘టెలివిజన్‌లో నేను చూసిన తొలి తెలుగు సినిమా ‘రాముడు- భీముడు’. థియేటర్‌లో చూసిన తొలి తెలుగు చిత్రం ‘శివ’. నేను ఈ సినిమాని 2 రోజుల్లో 3 షోలు చూశా. సైకిల్‌ చైన్‌తో ఎవరినైనా కొట్టొచ్చని ఈ చిత్రం చూసేంత వరకూ ఎవరికీ తెలియదు. ఆ స్ఫూర్తితో నా స్నేహితులతో కలిసి సైకిల్‌ షాప్‌కు వెళ్లి, అక్కడున్న చైన్లు తీసుకుని బ్యాగ్స్‌లో పెట్టుకునేవాడ్ని. ఇతరులను సరదాగా భయపెట్టేందుకు అలా చేసేవాడ్ని. అలాంటిది  ఆ సినిమా హీరో నాగార్జున సర్‌ పక్కన నేను నిల్చోవడం సంతోషంగా ఉంది. ఆయన్ను నేరుగా కలవకపోయినా ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఆహ్వానించగానే ఈ వేడుకకు వచ్చారు. థ్యాంక్స్‌ నాగార్జున సర్‌. ‘విక్రాంత్‌ రోణ’ సినిమా చిత్రీకరణ సుమారు 70 శాతం హైదరాబాద్‌లోనే సాగింది. ఇందులో ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్‌ చేశాం. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా’.. ఇలా తెలుగు సినిమాల్లో నేను ఏ చిన్న పాత్ర పోషించినా నన్ను మీరు ఆదరించారు’’ అని సుదీప్‌ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని