Updated : 28 Jun 2022 15:59 IST

Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్‌ కథ ఇదీ!

ఆయన జీవనం అతి సామాన్యం.. ఆయన ప్రతిభ అసామాన్యం.. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శం.. గూఢచర్యం ఆరోపణలతో ఆ ఆదర్శ శిఖరం ఒక్కసారిగా నేలకొరిగింది. ఆయన్ను కీర్తించిన నోళ్లే దూషించాయి. చప్పట్లు కొట్టిన చేతులే రాళ్లు రువ్వేందుకు సిద్ధమయ్యాయి. దేశం గర్వించదగ్గ ఇస్రో శాస్త్రవేత్త అని అ‌భివర్ణించిన మీడియానే ఆయన్ను దేశ ద్రోహిగా చూపించింది. చివరకు న్యాయమే గెలిచింది. ఆ పడిలేచిన కెరటమే నంబి నారాయణన్. సినీ, క్రీడా, రాజకీయ.. ఇలా ఎందరో ప్రముఖుల జీవితాలు తెరపైకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. కానీ, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం గురించి తొలిసారి రూపొందిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ప్రముఖ నటుడు ఆర్‌.మాధవన్‌(Madhavan) దర్శకుడిగా మారి, తెరకెక్కించిన తొలి చిత్రమిది.  జులై 1న విడుదలవుతున్న సందర్భంగా నంబి నారాయణన్‌ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అంతా రహస్యంగా..!

అది 1994 నవంబరు 30. నారాయణన్‌ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ తయారీ ప్రాజెక్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రోజులవి. తమ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ముగ్గురు కేరళ పోలీసులు నారాయణన్‌(Nambi Narayanan) ఇంటికి చేరుకుని, విచారణ పేరుతో ఆయన్ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. సినిమాల్లో చూపించినట్టు డ్రామా క్రియేట్‌ చేసిన పోలీసులు ‘మిమ్మల్ని అరెస్టు చేశాం’ అని నారాయణన్‌తో మరుసటి రోజు చెప్పారు. అప్పుడు నారాయణన్‌కు ఏం అర్థంకాలేదు. అంతా అయోమయ పరిస్థితి.  అప్పటికే ఈ విషయం కాస్తా మీడియాకు చేరింది. నిజానిజాలు తెలుసుకోకుండా పత్రికలు ఇష్టమొచ్చినట్టు నారాయణన్‌ నేరస్థుడంటూ కథనాలు రాశాయి. అంతే, ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన నారాయణన్‌ జీవితం తల్లకిందులైంది. దేశం కోసం శ్రమించిన ఆయనపై దేశద్రోహి అనే ముద్ర పడింది. ఈ ఘటన సంచలనమైంది. అసలు ఆయన ఎదుర్కొన్న ఆరోపణలేంటి? ఎందుకు అరెస్టు అయ్యారు? అనే విషయాలు చూసే ముందు నారాయణన్‌ ఇస్రోలో ఎలా ప్రవేశించారో చూద్దాం..

ఆ ఆసక్తితోనే..

నంబి నారాయణన్‌(Nambi Narayanan) 1941 డిసెంబరు 12న తమిళనాడులో  ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. నారాయణన్‌కు ఐదుగురు అక్కలు. చిన్నప్పటి నుంచీ ఆయన చదువుల్లో చురుకుగా ఉండేవారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నారాయణన్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్లు స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారంలో పనిచేశారు. నేలపై నడిచే వాటికంటే గాల్లో ఎగిరే వాటిపై నారాయణన్‌కు ఎంతో ఆసక్తి. వాటి గమనాన్ని స్టడీ చేసేవారు. ఆ జిజ్ఞాసతోనే 1966లో ఇస్రో ‘తుంబా ఈక్విటోరియల్‌ రాకెట్‌’ లాంచింగ్‌ స్టేషన్‌లో చేరారు. ఆ సమయంలోనే ఆయనకు ఇస్రో ఛైర్మన్‌ విక్రమ్‌ సారాబాయ్‌ పరిచయమయ్యారు. నారాయణన్‌ ప్రతిభకు విక్రమ్‌ ఆశ్చర్యపోయారు. అనతికాలంలోనే అంచలంచెలుగా ఎదుగుతూ ‘నాసా’ ఫెలోషిప్‌ను అందుకున్నారు నారాయణన్‌. నాసా ఉద్యోగ అవకాశం ఇస్తానన్నా వదులుకుని ఇండియాకు తిరిగొచ్చారు. సాలిడ్‌ ప్రొపెలెంట్స్‌ వాడకం అధిక ఖర్చుతో కూడుకున్నది, దాన్ని లిక్విడ్‌ ఫ్యూయల్‌ టెక్నాలజీతో అధిగమించవచ్చని అప్పటి ఇస్రో ఛైర్మన్‌ సతీష్‌ ధావన్‌కు వివరించారు. అదే సమయంలో అబ్దుల్‌ కలాంతోనూ నారాయణన్‌ కలిసి పని చేశారు. సాంకేతికపరంగా అప్పుడప్పుడే అడుగులేస్తోన్న ఇస్రోను  ఫ్యూయల్‌ టెక్నాలజీతో మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారాయన. అలా వచ్చిందే క్రయోజెనిక్‌ ఇంజిన్స్‌ ఆలోచన. అయితే, ఈ సాంకేతికకు పెట్టింది పేరు అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌. దాంతో ఆయా దేశాల నుంచి ఆ టెక్నాలజీని దిగుమతి చేయాలనుకున్నారు. చివరకు రష్యాతో రూ. 235 కోట్ల ఒప్పందం కుదిరింది. అంతా సవ్యంగానే జరుగుతుందనుకునేలోపు నారాయణన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

ఊహించని పరిణామం

వీసా గడుపు ముగిసినా ఇంకా భారత్‌లోనే ఉన్నారనే కారణంతో మాల్దీవులకు చెందిన ఓ మహిళను కేరళ పోలీసు అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె స్నేహితురాలూ అరెస్టు అయింది. ఈ మహిళలిద్దరూ గూఢచారులని, భారత రాకెట్‌ సాంకేతిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారని, వీరికి ఇస్రో శాస్త్రవేత్తలు సమాచారం అందిస్తున్నారని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. వీరికి సహకరించిన వారిలో ఆయన కూడా ఉన్నారని పోలీసులు ఆరోపించారు. అలా ఆయన పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రష్యా క్రయోజెనిక్‌ ఇంజిన్‌ టెక్నాలజీ ఒప్పందాన్ని వెనక్కితీసుకుంది.

జైల్లో 50 రోజులు..

దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్న ఆయన దాదాపు 50 రోజులు జైల్లో గడిపారు. నారాయణన్‌(Nambi Narayanan)ను కోర్టుకు తీసుకెళ్లే ప్రతిసారీ ‘దేశద్రోహి’ అంటూ అక్కడున్న వారంతా నినాదాలు చేసేవారు. విచారణ పేరిట సంబంధిత అధికారులు నారాయణన్‌ను ఎన్ని హింసలు పెట్టారో అనుభవించిన ఆయన ఒక్కరికే తెలుసు.  అయినా ఆయన సమాధానం ఒక్కటే ‘నేను ఎలాంటి తప్పూ చేయలేదు’.

నిరపరాధిగా నిరూపితమై..

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఇన్ని అవమానాలు ఎదురైనా నారాయణన్‌ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ‘నిజం దాచినా దాగదు. చివరకు గెలిచేది న్యాయమే’ అనే ధోరణితో పోరాటం చేశారు. నారాయణన్‌ కేసు కొన్ని రోజుల తర్వాత కేరళ ఇంటిలిజెన్స్‌ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయ్యింది. తానెలాంటి  సమాచార చోరీకీ పాల్పడలేదని నారాయణ్‌(Nambi Narayanan) సీబీఐ అధికారులకు వివరించారు. 1995 జనవరి 19న నారాయణన్‌కు బెయిల్‌ మంజూరైంది. ఈయనతోపాటు అభియోగాలు ఎదుర్కొన్న మరో ఐదుగురూ నిర్దోషులని 1996లో సీబీఐ ప్రకటించింది. ఇస్రోకు సంబంధించిన సమాచారమేదీ పాకిస్థాన్‌కు వెళ్లినట్టు ఎలాంటి ఆధారాల్లేవని వెల్లడించింది. క్రయోజెనిక్‌ ఇంజిన్ల ప్రణాళిక చోరీకి గురికాలేదని ఇస్రో చేపట్టిన అంతర్గత దర్యాప్తులోనూ స్పష్టమైంది. మీడియా, నారాయణన్‌ పై నిందలు మోపిన వారంతా తమ పొరపాటును తెలుసుకున్నారు. అలా నిర్దోషిగా నిరూపితమైన నారాయణన్‌ మళ్లీ ఇస్రోలో అడుగుపెట్టారు. అయినా పరిస్థితి అంతకు ముందులా లేదు. స్థానిక ప్రభుత్వం మళ్లీ కేసును తెరిచేందుకు ప్రయత్నించింది. సుప్రీం కోర్టుకు వెళ్లగా 1998లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ కేసును తిరస్కరించింది.

ప్రభుత్వ పరిహారం

తనపై ఆరోపణలు చేసి, అక్రమంగా కేసును బానాయించినందుకు కేరళ ప్రభుత్వంపై నారాయణన్‌(Nambi Narayanan) కేసు వేశారు. రూ. 50 లక్షలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. తన తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఆ రూ. 50 లక్షలేకాకుండా కోటి 30 లక్షలు రూపాయలు చెల్లిస్తామని 2019లో తెలిపింది. ఆయనపై అక్రమ కేసు పెట్టడంలో కేరళ పోలీసుల పాత్రపై విచారణ జరపాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్‌ను పద్మ భూషణ్‌తో సత్కరించింది.

మిస్టరీ వీడలేదు..!

నారాయణన్‌(Nambi Narayanan)పై కుట్ర పన్నిన వ్యక్తుల వివరాలు ఇప్పటికీ తెలియలేదు. అదొక మిస్టరీగా మారింది. అధునాతమైన సాంకేతికతో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరొస్తుందన్న నెపంతోనే అగ్ర దేశాలు ఇలా చేసి ఉండొచ్చనేది ప్రచారంలో ఉన్న మాట. నిర్దోషి అని తేలినంత మాత్రాన పోయిన పరువు, అత్యంత విలువైన కాలం తిరిగిరావు కదా. నారాయణన్‌ను అన్యాయంగా అరెస్టు చేయడం వల్ల ఇస్రో రెండు దశాబ్దాలు వెనకపడిందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.

తెరపై ఎలా ఉండబోతుంది?

ఒక కథ ప్రేక్షకుడికి కనెక్ట్‌కావాలంటే బరువైన భావోద్వేగాలు అవసరం. అప్పుడే ఆ కథను, సినిమాను ప్రేక్షకుడు ఆకళింపు చేసుకుంటాడు. ఇస్రో శాస్త్రవేత్తగా శిఖరస్థాయి ఖ్యాతిని గడించి, అదే స్థాయిలో అవమానాలపాలైన నారాయణన్‌ జీవిత కథలో భావోద్వేగాలకు కొదవలేదు. అయితే, మాధవన్‌ వాటిని ఏ స్థాయిలో పండించారన్న దానిపై  సినిమా ఆధారపడి ఉంటుంది. నారాయణన్‌ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన శక్తులేవన్నది ఇప్పటికీ మిస్టరీయే. మరి ‘రాకెట్రీ’లో వాటిని చూపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని