Balakrishna: ‘అన్‌స్టాపబుల్‌’లో చిరంజీవి.. బాలయ్య రియాక్షన్‌ ఇదే..

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2’ ప్రోమో విడుదల కార్యక్రమం మంగళవారం సాయంత్రం విజయవాడలో వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా, మెగస్టార్‌ చిరంజీవి ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడంపై బాలయ్య స్పందించారు. 

Published : 06 Oct 2022 02:04 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable). ‘ఆహా’ వేదికగా త్వరలోనే సీజన్‌ 2’ మరి కొన్నిరోజుల్లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2’ ప్రోమో విడుదల చేశారు. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ మరోస్థాయిలో ఉండనుందని బాలయ్య తెలిపారు. అనంతరం ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

మీరు అన్‌స్టాపబుల్ హీరో.. మరి మీ ఇంట్లో అన్‌స్టాపబుల్‌ ఎవరు?

బాలకృష్ణ: వసుంధర. తనే నా అదృష్టం. నన్ను, నా కుటుంబాన్ని ఎంతో ఓర్పుగా చూసుకుంటుంది. సినిమాలు, రాజకీయం, క్యాన్సర్‌ ఆస్పత్రి.. ఇలా పలు విషయాల్లో నేనెప్పుడూ బిజీగా ఉంటా. తనే ఇంట్లోని అన్ని విషయాలు దగ్గర ఉండి చూసుకుంటుంది.

దసరా వేడుకలను మీ ఇంట్లో ఎలా జరుపుకొంటారు?

బాలకృష్ణ: అమ్మవారిని ప్రతిష్ఠించి.. వివిధ రూపాల్లో ఆమెను పూజిస్తాం. అందరూ బాగుండాలి అని ప్రార్థిస్తాం.

మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటి?

బాలకృష్ణ: ఆయన ఎన్నో నేపథ్యాల్లో సినిమాలు చేశారు. ఆయన ఏ పాత్ర వేసినా అన్‌స్టాపబులే.

నటుడిగా, రాజకీయ నాయకుడిగా, హోస్ట్‌గా.. ఇలా వివిధ రంగాల్లో మీరు కొనసాగుతున్నారు. మీ ఎనర్జీకి కారణం ఏమిటి?

బాలకృష్ణ: మా నాన్న. ఆయనే నా స్ఫూర్తి ప్రదాత. తండ్రిగానే కాకుండా గురువు, దైవంగా ఆయన్ని భావిస్తాను. తర్వాత ప్రేక్షక దేవుళ్లు. మనం ఎప్పటికీ ఒక ట్రెండ్‌ సెట్టర్‌లా ఉండాలని నాన్న నేర్పించారు.

మీకు ఎన్‌బీకే 103 టీమ్‌ ఇష్టమా? అన్‌స్టాపబుల్‌ టీమ్‌ ఇష్టమా?

బాలకృష్ణ: వాళ్లూ వీళ్లూ అని ఏమీ లేదు. అందరూ ఇష్టమే.

‘అన్‌స్టాపబుల్‌ - 2’లో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌  పాల్గొనే అవకాశాలున్నాయా?

బాలకృష్ణ: తప్పకుండా ఉంటాయి. వాళ్ల ఇష్టం, సమయాభావానికి అనుగుణంగా తప్పకుండా ఉంటుంది. వాళ్లు కార్యక్రమంలో పాల్గొనేలా టీమే ప్రయత్నం చేయాలి.

‘అన్‌స్టాపబుల్‌ - సీజన్‌ 1’ అనుభవం ఎలా ఉంది?

బాలకృష్ణ: ఒక సినిమా షూటింగ్‌ మాదిరిగానే ఫీలయ్యాను. నేను ఎలాంటి ఇబ్బందిపడకుండా ఉండేలా ‘ఆహా’ టీమ్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని