KalyanRam: ‘బింబిసార’కు మొదటి ఆడియన్‌ అతనే..!

త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బింబిసార’ (Bimbisara). సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈసినిమా ఆగస్టు 5న...

Published : 28 Jul 2022 15:54 IST

ఆయన ‘ఎస్‌’ చెప్పగానే మాటల్లో చెప్పలేని ఆనందం పొందా: కల్యాణ్‌ రామ్‌

హైదరాబాద్‌: త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బింబిసార’ (Bimbisara). సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈసినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ విశేషాలు తెలియజేస్తూ కల్యాణ్‌రామ్‌ స్పెషల్‌వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. ఇందులో ‘బింబిసార’ ప్రాజెక్ట్‌ ఎలా పట్టాలెక్కింది? షూట్‌ ఎన్నిరోజులు చేశారు? ఆ సినిమాని ఫస్ట్‌ చూసింది ఎవరు? ఇలాంటి ఎన్నో విశేషాలు ఆయన పంచుకున్నారు.

అదే మొదటి అడుగు..!

‘‘వశిష్ఠ.. నాకెంతో కాలంగా తెలుసు. చారిత్రక నేపథ్యం ఉన్న కథలో నటించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అలాంటి సమయంలో ఓసారి వశిష్ఠ ‘బింబిసార’ కథ చెప్పారు. ఇలాంటి కథ కోసమే కదా ఇన్నాళ్లు ఎదురుచూస్తున్నా అనిపించింది. ఇందులోని ఎన్నో అంశాలు నాలో ఆసక్తి పెంచాయి. దాంతో ఈ కథను వినమని హరికృష్ణకూ చెప్పా. నేనెలా అయితే ఫీలయ్యానో అదే తను కూడా ఫీలయ్యాడు. ఇలాంటి సినిమా కథ మనం చేయాలి అన్నాడు. అలా, ‘బింబిసార’కు మొదటి అడుగు పడింది’’

అది నన్ను ఆకర్షించింది..!

‘‘చరిత్రకు వర్తమానానికి ముడిపెడుతూ సాగే విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో ఒక క్రూరమైన రాజు‌.. చరిత్ర నుంచి ప్రస్తుతానికి వస్తే ఎలా ఉంటాడు? అనే పాయింట్‌ నన్నెంతో ఆతృతకు గురి చేసింది. ఇలాంటి పాత్ర నేనెప్పుడూ చేయలేదు. ముఖ్యంగా అహంకారభావాలు ఎక్కువగా ఉన్న క్రూరమైన రాజు టైమ్‌ ట్రావెల్‌ చేసి అప్పటివరకూ తాను చేసింది తప్పని తెలుసుకుని ఎంతో మారతాడు. అతని ప్రయాణం నన్ను ఆకర్షించింది’’ 

75 కేజీలకు తగ్గా..! 

‘‘ఈ కథ నా వద్దకు వచ్చినప్పుడు నేను ‘ఎంత మంచి వాడవురా’ చేస్తున్నా. అప్పుడు నా బరువు 88 కేజీలు. ‘బింబిసార’ చేసేందుకు నేను అప్పుడు సిద్ధంగా లేను. ఈ సినిమా కోసం వర్కౌట్లు చేయాలని నిర్ణయించుకున్నా. అలా, ఎంతో శ్రమించి 88 కేజీల నుంచి 75 కేజీలకు తగ్గా. ఆ తర్వాత లుక్‌ టెస్టులు, కాస్టూమ్స్‌, ఆభరణాల టెస్టులు చేశారు’’

నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫిల్మ్..!

‘‘మాకు సొంతంగా ఒక వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ ఉంది. ‘బింబిసార’ వర్క్‌ మొత్తం అక్కడే జరిగింది. 135 రోజులపాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించాం. నా కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ఈ సినిమా. అందుకు ఎంతో గర్వంగా ఉంది’’

అప్పుడెంతో ఆనందం..!

‘‘కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా పూర్తయ్యాక ఆయనకు ఫస్ట్‌ కాపీ చూపించాం. ఆయనే ఈ సినిమాకి ఫస్ట్‌ ఆడియన్‌. సినిమా చూసి ఆయన ఏం అంటారో? అని బాగా కంగారుపడ్డా. కానీ, సినిమా చూసి మనం ఈ ప్రాజెక్ట్‌ చేస్తున్నాం అన్నారు. అందుకు నాకెంతో ఆనందంగా అనిపించింది. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు థియేటర్‌లో అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’

అందుకే మొసలి..!

‘‘ఇందులో బింబిసారుడి పాత్ర ఎంతో క్రూరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎలాంటి జంతువులను పెంచుకుంటే బాగుంటుందని ఎక్కువగా ఆలోచించా. పులులు, సింహాలు లాంటివి పెంచుకోవడం సర్వసాధారణం. కానీ మొసలిని పెంచుకుంటే బాగుంటుందనిపించింది. అలా, మొసలిని ఫైనల్‌ చేశాం. ఒక సీన్‌లో బింబిసారుడు(కల్యాణ్‌రామ్‌) సింహాసనంపై కూర్చొని ఏదో తింటూ.. దానిలోని కొంత భాగాన్ని మొసలికి విసరగా.. అది ఒక్కసారిగా నీటిపైకి వచ్చి క్యాచ్‌ పట్టుకున్నట్లు చూపించాం. ఆ సీన్‌ నాకెంతో ఇష్టం’’ అని కల్యాణ్‌రామ్‌, వశిష్ఠ చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని