Ante Sundaraniki: నాని ‘నవ్వుల హోమం’ మొదలైంది.. ఆ తేదీ ఖరారైంది

తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కథానాయకుడు నాని. ఇప్పటికే పలు కామెడీ ఎంటర్‌టైనర్‌లతో నవ్వించిన ఆయన త్వరలోనే ‘అంటే సుందరానికీ!’తో మరోసారి సందడి చేయనున్నారు.

Published : 23 Feb 2022 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కథానాయకుడు నాని. ఇప్పటికే పలు పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ సినిమాతో నవ్వించిన ఆయన త్వరలోనే ‘అంటే సుందరానికీ!’తో మరోసారి సందడి చేయనున్నారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది. సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. ‘బర్త్‌డే హోమం’ పేరుతో పంచుకున్న ఈ వీడియో ఆద్యంతం నవ్వుల జల్లు కురిపిస్తోంది. ‘పుట్టినరోజున ఏంటి ఇది? ఇంకో రెండు హోమాలు చేస్తే గిన్నిస్‌ బుక్‌ ఎక్కొచ్చు’’ అంటూ నాని చెప్పిన సంభాషణలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. వీడియోతోపాటు చిత్ర బృందం  చేసిన ట్వీటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘అంటే మావాడి జాతకం ప్రకారం బర్త్‌డే హోమం జరిగిన 108 రోజులు వరకు బయటికు రాకూడదన్నారు. అందుకే జూన్‌ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్లకు వస్తున్నాడు. యువ సుందరుడి బర్త్‌డే హోమం ఇప్పుడే మొదలైంది’’ అని సరదాగా రాసుకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన 7 విడుదల తేదీలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటిల్లోని ఓ తేదీని (జూన్‌ 10) చిత్ర బృందం ఎంపిక చేసింది.

‘బ్రోచేవారెవరురా’తో మంచి విజయం అందుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నజ్రియా కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చారు. నాని ప్రస్తుతం ‘దసరా’ అనే చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని