అందుకే ఆ రిస్క్‌ తీసుకోలేను..!

నాకు కటౌట్లు అవసరం లేదు మీ అభిమానం చాలు. పాలాభిషేకాలు వద్దు మీ ప్రేమ చాలు. స్టార్‌ అని పిలవద్దు మీ ఇంట్లో వ్యక్తిగా నాని అని పిలవండి చాలు’ అంటుంటారు యువ కథానాయకుడు నాని

Updated : 16 Nov 2023 14:53 IST

‘నాకు కటౌట్లు అవసరం లేదు మీ అభిమానం చాలు. పాలాభిషేకాలు వద్దు మీ ప్రేమ చాలు. స్టార్‌ అని పిలవద్దు మీ ఇంట్లో వ్యక్తిగా నాని అని పిలవండి చాలు’ అంటుంటారు యువ కథానాయకుడు నాని. ఎప్పటికప్పుడు విభిన్న కథల్ని ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. ఫలితం ఎలా ఉన్నా ప్రయోగాలు చేసేందుకు ముందుంటారు. నటుడు, నిర్మాత, వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నాని  పుట్టిన రోజు (బుధవారం) సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు తెలుసుకుందాం...  

అలా మొదలైంది..

నాని పూర్తి పేరు ఘంటా నవీన్‌ బాబు. రాంబాబు, విజయ లక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించారు. నానికి అక్క ఉన్నారు. పేరు దీప్తి. స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకో అబ్బాయి. తొలినాళ్లలో రేడియో జాకీగా అలరించారు నాని. కొన్నాళ్లు బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనుకోకుండా ‘అష్టా చమ్మా’ చిత్రంతో కథానాయకుడిగా మారారు. మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైంది ఆయన నట ప్రయాణం. కథానాయకుడుగా ఇప్పటికే 25 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. 26వ సినిమా ‘టక్‌ జగదీష్‌’ ఏప్రిల్‌లో రాబోతుంది. 27వ చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రీకరణ జరుపుకుంటోంది.  28వ సినిమాగా ‘అంటే సుందరానికీ!’ ఖరారైంది. సంవత్సరానికి రెండు మూడు చిత్రాలు అందించేందుకు ఆసక్తి చూపుతుంటారు నాని. కెరీర్‌ ప్రారంభంలో వరుస పరాజయాలు చవిచూసినా నిలదొక్కుకుని ‘నేచులర్‌ స్టార్‌’గా ఎదిగారు.

సినిమా ప్రచారంలో ప్రత్యేకం..

నాని గళానికీ అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘ఓకే బంగారం’ చిత్రానికి నానితో డబ్బింగ్‌ చెప్పించారు. సినిమా ప్రచార విషయంలోనూ నాని రూటు సెపరేట్‌ అనాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో అలతి పదాలతో ఆయన పెట్టే పోస్టులు ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ఇలా ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించడమే కాదు సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ప్రకటనల్ని(యాడ్స్‌) తనదైన శైలిలో వినిపించి దట్‌ ఈజ్‌ నాని అనిపిస్తారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘పైసా’. ఈ సినిమాతోనే నాని ‘పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అని తొలిసారి సూచించారు. ఆ తర్వాత టైటిల్‌కి తగ్గట్టు చెప్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో కొన్ని...

* మందు సిగరెట్లు తాగకండి పోతారు.. లోకలైనా నాన్‌లోకలైనా (నేను లోకల్‌)

* మందు సిగరెట్టు తాగకండి పోతారు.. హీరో అయినా విలన్‌ అయినా (జెంటిల్‌మేన్‌) 

* తెలుగు సినిమాలే చేస్తా..

జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తాను. ఎస్వీ రంగారావు, ప్రకాశ్‌ రాజ్‌, నానాపటేకర్‌ వంటి వారు భాష మీదున్న పట్టు వల్ల మంచి నటులయ్యారు. నాకు వచ్చిన భాష తెలుగు. అందులోనే ఓ మాటను సొంతం చేసుకుని చెప్పగలను. మరో భాషలో అలా చేయలేను. తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్టుగా ఇతర చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అందుకే బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదని ఓ సందర్భంలో తెలిపారు నాని

* ఫాలోయింగ్‌..

2012లో ట్విటర్‌ ఖాతా తెరిచారు నాని. ఆయనను ఇప్పటివరకూ అనుసరిస్తున్న వారి సంఖ్య: 3.9 మిలియన్‌ పైగా. ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌: 3.4 మిలియన్‌ పైగా. 

* ఇష్టమైన దర్శకులు : రాజమౌళి, మణిరత్నం, త్రివిక్రమ్‌.

* బాగా నచ్చిన చిత్రం: దళపతి

* వంట: అమ్మమ్మ చేసే చేపల పులుసు

* ఇష్టమైన డ్రెస్‌: తెల్లచొక్కా, నీలం జీన్స్‌

*  విజయం, ఓటమిలోనూ ఒకేలా ఉండటం నాని పాలసీ


* బాల్యంలో అక్క దీప్తితో..

*తండ్రి రాంబాబుతో..

* తల్లితో కలిసి ఇలా..

*కొడుకు అర్జున్‌తో సరదాగా..

*సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్న తొలి ఫొటో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని