Dasara Movie Review: రివ్యూ: ‘దసరా’.. నాని సినిమా ఎలా ఉందంటే?

Nani`s Dasara Movie Review: నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 30 Mar 2023 15:55 IST

Dasara Movie Review | చిత్రం: దసరా; నటీనటులు: నాని, కీర్తిసురేష్‌, దీక్షిత్‌ శెట్టి, సముద్రఖని, షైన్‌ టామ్‌ చాకో, సాయికుమార్‌, జరీనా వాహబ్‌ తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణన్‌; సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌; ఎడిటింగ్‌: నవీన్‌ నూలి; నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి; రచన: శ్రీకాంత్‌ ఓదెల, జెల్ల శ్రీనాథ్‌, అర్జున పాతూరి, వంశీ కృష్ణ; దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల; విడుదల: 30-03-2023

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాని (Nani). క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆయన నటనను ఇష్టపడతారు. అందుకు తగినట్లుగానే నాని కథల ఎంపిక ఉంటుంది. ఇప్పుడు శ్రీరామనవమికి ‘దసరా’ (Dasara)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాని మాస్‌ లుక్‌లో దర్శనమివ్వడం, అతనికి జోడీగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించడం, ప్రచార చిత్రాలు మెప్పించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘దసరా’ అందుకుందా? (Dasara Movie Review) నాని ఏ మేరకు మెప్పించారు?

క‌థేంటంటే?

సింగ‌రేణి స‌మీపంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ సాగే క‌థ ఇది. ధ‌ర‌ణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్‌) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. సూరి కోసం త‌న ప్రేమ‌ని కూడా త్యాగం చేసిన‌వాడు ధ‌ర‌ణి. రైళ్లలో బొగ్గు దొంగ‌త‌నం చేయ‌డం.. తాగ‌డం స్నేహితులంతా క‌లసి తిర‌గ‌డం ఇదే వాళ్ల దిన‌చర్య. అయితే ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌లు వాళ్ల జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. చిన్న నంబి (షైన్ టామ్ చాకో) పోటీ చేసిన ఆ ఎన్నిక‌ల్లో సూరి అత‌ని స్నేహ‌బృందం.. రాజ‌న్న (సాయికుమార్‌)కి మద్దతుగా నిలిచి గెలిపించాక ఊళ్లో తీవ్ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. ఆ ప‌రిణామాలు ఎలాంటివి? ముగ్గురు స్నేహితుల జీవితాలు ఏ తోవ ప‌ట్టాయ‌నేది మిగ‌తా క‌థ‌. (Dasara Movie Review)

ఎలా ఉందంటే?

మ‌న‌వైన మూలాల్లోకి వెళ్లి ఆ జీవితాల్ని, క‌థ‌ల్ని స‌హ‌జంగా తెర‌పై ఆవిష్కరిస్తున్న ట్రెండ్ ఇది. ‘ద‌స‌రా’ తెలంగాణలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల స‌మీపంలోని వీర్లపల్లి క‌థ‌ని, అందులోని కొన్ని జీవితాల్ని చూపిస్తుంది. క‌థ కంటే నేపథ్యమే ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది అని చెప్పొచ్చు. కొత్త క‌థేమీ కాదు కానీ... పాత్రలతో స‌హా కొన్ని విషయాలు ‘రంగస్థలం’ మొద‌లుకొని ఇదివ‌ర‌కు వ‌చ్చిన వివిధ సినిమాల్ని గుర్తు చేస్తాయి. స్నేహం, ప్రేమ‌, త్యాగాల నేప‌థ్యంలో మంచి భావోద్వేగాల్నే రాబ‌ట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ ఊరిని, పెద్దల్ని, రాజ‌కీయాల్ని ప‌రిచ‌యం చేస్తూ సాగే  ఆరంభ స‌న్నివేశాలు ప్రభావం చూపించ‌క‌పోయినా... నాని ప‌రిచ‌యం నుంచే క‌థ‌లో వేగం పెరుగుతుంది. బొగ్గుని దొంగ‌త‌నం చేసే ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాత క్రమంగా స్నేహాన్ని, ప్రేమ‌ను ఎస్టాబ్లిష్ చేస్తూ ప‌ట్టు ప్రదర్శించారు దర్శకుడు.

ఎన్నిక‌ల్లో చిన్ననంబి పోటీ చేయ‌డం... యువ‌త‌రం మ‌ధ్య క్రికెట్ పోటీలు పెట్టడం, బార్ అకౌంటెంట్ పోస్ట్‌, వెన్నెల పెళ్లి చుట్టూ సాగే స‌న్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆ స‌న్నివేశాల‌న్నీ ఒక ఎత్తు అయితే.. విరామానికి ముందు వచ్చే స‌న్నివేశాలు మ‌రో ఎత్తు. సినిమాను మ‌రో మ‌లుపు తిప్పే ఆ ఎపిసోడ్ ద్వితీయార్థంపై ఆస‌క్తిని పెంచుతుంది. అయితే రెండో స‌గ‌భాగం క‌థ‌లో ధ‌ర‌ణి, వెన్నెల పాత్రల మ‌ధ్య మ‌రింత డ్రామా, సంఘర్షణ పండించేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ స‌న్నివేశాల్ని ప్రతీకారం కోణంలోనే  మ‌లిచారు దర్శకుడు. ప్రథమార్ధంపై ప్రభావం చూపించిన రాజ‌కీయ కోణం... ద్వితీయార్ధంలో ఏమాత్రం క‌నిపించ‌దు. దాంతో క‌థ‌, క‌థ‌నాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతాయి. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. హీరోయిజాన్ని మ‌రో స్థాయిలో చూపించారు ఆ సన్నివేశాల్లో. చివ‌రి స‌న్నివేశమైతే మ‌రింత హైలైట్‌. మొత్తంగా ప‌క్కా నాటుద‌నంతో కూడిన తెలంగాణలోని ఓ ప‌ల్లెటూరి క‌థ ఇది. (Dasara Movie Review)

ఎవ‌రెలా చేశారంటే?

ధ‌ర‌ణి పాత్రలో నాని ఒదిగిపోయాడు. ఆయ‌న న‌ట‌న సినిమాను మ‌రో స్థాయిలో నిల‌బెట్టింది. మ‌న‌సులో సంఘర్షణకు గుర‌వుతూనే స్నేహానికి ప్రాణ‌మిచ్చే యువ‌కుడిగా నాని అభిన‌యం హ‌త్తుకుంటుంది. సూరి, వెన్నెలగా న‌టించిన దీక్షిత్‌, కీర్తి సురేశ్‌... ఆ పాత్రలకు ప్రాణం పోశారు. కీర్తి సురేశ్ స‌హ‌జంగా క‌నిపించారు. ‘మ‌హాన‌టి’ స్థాయిలో ఆమె అభిన‌యం సాగుతుంది. చిన్న నంబిగా మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకో చూపుల‌తోనే భ‌య‌పెట్టారు. సముద్రఖ‌నిని కొత్త గెట‌ప్‌లో చూపించిన‌ప్పటికీ ఆయ‌న పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఊరి పెద్ద రాజన్నగా సాయికుమార్ పాత్రకి త‌గ్గస్థాయిలో నటించారు.

జ‌రీనా వ‌హాబ్, ఝాన్సీ త‌దిత‌రులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వీర్లపల్లిని సత్యన్‌ సూర్యన్‌ త‌న కెమెరాతో ఓ క‌థ‌లాగే చూపించారు. పాట‌లతోపాటు నేప‌థ్య సంగీతంతో సినిమాపై త‌న‌దైన ముద్రవేశారు సంతోష్ నారాయ‌ణ‌న్. ‘ధూమ్ ధామ్..’, ‘చ‌మ్కీల అంగీలేసి...’ పాటల చిత్రీక‌ర‌ణ బాగుంది. ఎడిటింగ్‌, క‌ళ విభాగాల ప‌నితీరు సినిమాపై ప్రభావం చూపించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల‌కి ఇదే తొలి చిత్రమైనా చాలా స‌న్నివేశాల్ని అనుభ‌వ‌మున్న దర్శకుడిలా తీర్చిదిద్దారు. మాట‌లు బాగున్నాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది. (Dasara Movie Review) 

బ‌లాలు: + నాని, కీర్తి సురేశ్ న‌ట‌న‌ + క‌థా నేప‌థ్యం, భావోద్వేగాలు + విరామం, పతాక స‌న్నివేశాలు
బ‌లహీన‌త‌లు: - ద్వితీయార్థంలో కొన్ని స‌న్నివేశాలు
చివ‌రిగా:ద‌స‌రా’ ధూమ్ ధామ్ (Dasara Movie Review) 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు