Nani: కొత్త దర్శకులకు ఛాన్సులు.. నాని ఖాతాలో హిట్‌లు

శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడితో కలిసి నాని ‘దసరా’ (Dasara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నాని (nani) ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొత్త దర్శకులు ఎవరో చూద్దాం.

Updated : 28 Mar 2023 19:11 IST

అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు తియ్యాలనుకుంటారు యంగ్‌ హీరోలు. కానీ ఆ ట్రెండ్‌ను నేచురల్‌ స్టార్‌ నాని (nani) పూర్తిగా మార్చేశాడు. మంచి కాన్సెప్ట్‌తో వస్తే చాలు కొత్త వారికి ఓకే చెప్పేస్తూ.. సూపర్‌ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అనుభవాన్ని పక్కన పెట్టి కొత్త ఆలోచనలకు ప్రాధాన్యమిస్తున్నాడు. కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. కొత్త డైరెక్టర్‌లతో సినిమాలు తీస్తూ కోట్లు వసూళ్లు చేస్తున్నాడు. అలా ఓ కొత్త దర్శకుడితో కొత్త కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ‘దసరా’ (Dasara). నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాని తర్వాత తన 30వ సినిమాను కూడా నాని కొత్త దర్శకుడితోనే తీయనున్నాడు. ఇప్పటి వరకు నాని అవకాశమిచ్చిన న్యూ డైరెక్టర్స్‌ లిస్ట్‌పై ఓ లుక్‌ వేద్దామా మరి.


సౌరవ్‌తో కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌ సినిమా..

కొత్త టాలెంట్‌కు అవకాశాలివ్వడంలో ముందుంటాడు నాని.  తన 30వ సినిమాతో సౌరవ్‌ (sourav) అనే మరో దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చెయ్యనున్నాడు. తన కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలవనున్న ఈ సినిమాకు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.  ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ఈ సినిమాలో ఆయన సరసన సీతారామంలో  సీతగా అలరించిన మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కనిపించనుంది. అల్రెడీ ఈ చిత్రంపై అప్‌డేట్స్‌ ఇస్తూ అంచనాలు పెంచేస్తున్నాడు నాని. మరి ఈ కొత్త దర్శకుడు నానికి ఎలాంటి హిట్‌ ఇస్తాడా? అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

శ్రీకాంత్‌ ఓదెలతో ఊర మాస్‌ అవతారంలో..

కొత్తదనం నిండిన కథల్ని ఎంకరేజ్‌ చేసే నాని.. శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడితో కలిసి ‘దసరా’ (Dasara)గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటి వరకు చూడని ఊర మాస్‌ లుక్‌తో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు సోషల్‌ మీడియాను ఉర్రూతలూగిస్తున్నాయి. క్లాస్‌గా కనిపించే హీరోకు ‘చమ్కీల అంగీలేసి’ మాస్‌ లుక్‌ తీసుకువచ్చిన ఈ కొత్త దర్శకుడికి మార్చి 30న విడుదలవ్వనున్న ‘దసరా’ సినిమా సూపర్‌ సక్సెస్‌ ఇవ్వాలని నాని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నాని (Nani) సరసన కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) నటించింది.

శివ నిర్వాణతో నిన్ను కోరి ..

నాని కెరీర్‌లోనే మరిచిపోలేని సినిమా ‘నిన్ను కోరి’ (Ninnu Kori). 2017లో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం నానికి కోట్లాది అభిమానులను తీసుకువచ్చింది.  శివ నిర్వాణ (Shiva Nirvana)ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇందులోని పాటలు ట్రెండ్‌ను సెట్‌ చేశాయి. నానిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన ఈ మూవీలో ఆయన సరసన నివేదా థామస్‌ నటించింది. ఈ సినిమా సక్సెస్‌ సాధించడంతో శివ నిర్వాణ వరసగా అవకాశాలు అందుకున్నాడు. 

నాగ్‌ అశ్విన్‌తో ఎవడే సుబ్రహ్మణ్యం అనిపించి..

‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. ఆయన టాలెంట్‌ను మొదట గుర్తించింది నానినే. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin)తో కలిసి నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) అనే సినిమా చేశారు. ఎవరెస్ట్‌ పర్వతంపై షూటింగ్‌ చేసిన తొలి సినిమాగా చరిత్రకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోనే విజయ్‌ దేవరకొండ, మాళవిక నాయర్‌ నటించారు. ఈ సినిమా తర్వాత నాగ్‌ అశ్విన్‌ వెంటనే ‘మహానటి’ లాంటి చిత్రంతో టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిపోయారు.

అలా మొదలైన నందినీ రెడ్డి..

దర్శకులుగా రాణిస్తున్న మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. నాని 2011లోనే నందినీ రెడ్డి (Nandini Reddy) అనే మహిళా దర్శకురాలితో కలిసి ‘అలా మొదలైంది’ (Ala Modalaindi) సినిమా తీశాడు.  డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి నాని కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అయింది.  ఈ చిత్రానికి నందినీ రెడ్డి ఉత్తమ నూతన దర్శకురాలిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలోని టాప్‌ మహిళా దర్శకుల్లో ఒకరుగా ఉన్నారు.

తాతినేని సత్యతో రీమేక్‌తో మెప్పించి..

నాని హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లోనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. తాతినేని సత్య (Tatineni Satya)తో కలిసి ‘భీమిలి కబడ్డీ జట్టు’ (Bheemili Kabaddi Jattu) అనే ఒక రీమేక్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్‌ అందుకున్నాడు. తమిళ చిత్రానికి కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అప్పటి నుంచి తన తాజాగా  చిత్రం వరకూ నాని కొత్త దర్శకులకు అవకాశమిస్తూ.. హిట్‌లు అందుకుంటూనే ఉన్నాడు.

కొత్త దర్శకులతో సినిమాలు తియ్యడమే కాదు. కొందరి దర్శకుల రెండో చిత్రాల్లోనూ నాని నటించాడు. కథలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని నాని తన సినిమాలతో రుజువు చేస్తున్నాడు. కొత్త దర్శకుడితో కలిసి నాని తీసిన ‘దసరా’ మార్చి 30న థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందని నమ్మకంతో ఉన్నాడు. అటు ప్రేక్షకులు కూడా నానిని మాస్‌ అవతార్‌లో బిగ్‌ స్క్రీన్‌పై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు