Nani: అవకాశం కోసం ఏడాదిన్నర పాటు ఆఫీస్‌ బయట వేచి చూసిన నాని

వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు నాని (Nani).

Updated : 09 Apr 2023 16:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు నాని (Nani). ఇటీవల ఆయన నటించిన ‘దసరా’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కెరీర్‌లో 30వ సినిమాలో నటిస్తున్న నాని నటుడు కాకముందు సహాయ దర్శకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధా గోపాళం’ చిత్రానికి క్లాప్‌ అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆయన ఆ అవకాశం రావడం కోసం ఏకంగా ఏడాదిన్నర పాటు బాపు ఆఫీస్‌ ముందు రోజూ వేచి చూసేవారట.

‘‘దర్శకులకు మనం ఏదోరకంగా కనిపిస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటారని అనుకునేవాడిని. అందుకు ఏం చేయాలా? అని ఆలోచించా. దీంతో రోజూ ఉదయం 9గంటల కల్లా బాపుగారి ఆఫీస్‌కు వెళ్లేవాడిని. బయట ఉండే కుర్చీల్లో కూర్చొని వాళ్లు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా? అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఒక్కోసారి రాత్రి 7 గంటల వరకూ వేచి చూసేవాడిని. ఆ సమయంలో నాకు కొంచెం పొట్ట ఉండేది. అలా వేచి చూడటం వల్ల అది మొత్తం పోయింది. ఎలాగంటే, లంచ్‌ టైమ్‌లో అందరూ ఆఫీస్‌ నుంచి బయటకు వస్తారు. ఆ సమయంలో నేను బయటకు వెళ్తే ఎవరికీ కనపడను. అందుకుని ఏడాదిన్నర పాటు మధ్యాహ్నం భోజనం చేయకుండా బాపుగారు, ఆయన టీమ్‌ వచ్చినప్పుడు కనపడాలని అలాగే ఉండేవాడిని. చివరిగా ఫైనల్‌గా ‘వీడు వదిలేలా లేడు’ అని భావించి ‘రాధాగోపాళం’ చిత్రానికి క్లాప్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ ఇచ్చారు. అది నాకు దక్కిన అదృష్టం. ఎందుకంటే బాపుగారి స్కూలు నుంచి నా కెరీర్‌ మొదలుపెట్టాలననే ఫీలింగ్‌ ఎప్పటికీ మర్చిపోను’’ అని నాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని