Nani: ఆ సినిమాలో నటించి ఉంటే బాగుండేది అనిపించింది: నాని

కామెడీ కథలకు కొంతకాలంగా దూరంగా ఉన్న నాని ‘అంటే... సుందరానికీ!’ చిత్రంతో ఆ లోటును తీర్చబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్‌’ స్థాయిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు.

Published : 06 Jun 2022 22:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కామెడీ కథలకు కొంతకాలంగా దూరంగా ఉన్న నాని ‘అంటే... సుందరానికీ!’ చిత్రంతో ఆ లోటును తీర్చబోతున్నారు. ‘భలే భలే మగాడివోయ్‌’ స్థాయిలో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ‘..సుందరానికీ!’ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివీ..

* ఈ సినిమా ట్రైలర్‌లో మీ పాత్ర అమాయకత్వంగా కనిపించింది. దీనికోసం ఎలా సన్నద్ధమయ్యారు?

నాని: ఇతర వాటితో పోలిస్తే అమాయకత్వ పాత్రలు పోషించడం నాకు సులువైన పని. నేను ఇందులో బ్రాహ్మణ కుర్రాడు సుందర్‌ అనే పాత్ర పోషించా. సుందర్‌ది విభిన్నమైన అమాయకత్వం. మీరు ఊహించినట్టు ఉండదు. సుందర్‌ చేసే చిలిపి పనులన్నీ అమాయకత్వంతో బయటపడతాయి. నరేశ్‌ గారితో వచ్చే సన్నివేశాలు మరింత ఫన్‌ పంచుతాయి. ఈ సినిమాతో మా కాంబినేషన్‌ మరో స్థాయిలో నిలవబోతుంది.

* ఈ  సినిమాలో మీ కామెడీ టైమింగ్‌ ఎలా ఉంటుంది?

నాని: నా గత చిత్రాల్లో కనిపించని టైమింగ్ ఇందులో ఉంటుంది. చాలా సరదాగా సాగుతుంది. ఇందులో కొత్త నాని, సరికొత్త హావభావాలను మీరంతా చూస్తారు. ప్రేక్షకులంతా ఈ క్యారెక్టర్‌లో లీనమవుతారనే నమ్మకం ఉంది.

* దర్శకుడు వివేక్ ఆత్రేయతో ప్రయాణం ఎలా అనిపించింది?

నాని: రెండు, మూడు సినిమాలు చేసిన దర్శకులతో ఎందుకు పనిచేస్తున్నావంటూ చాలామంది నన్ను అడుగుతుంటారు. ప్రస్తుతం గొప్ప స్థాయిలో ఉన్న దర్శకుల కంటే భవిష్యత్తులో టాప్‌ డైరెక్టర్ల జాబితాలో నిలిచే వారితో పనిచేయడం నాకు ఆనందాన్నిస్తుంది. వివేక్‌ నాకు కథ చెప్పినప్పుడే ఆయన త్వరలోనే అగ్ర దర్శకుల లిస్ట్‌లో చేరతారనే నమ్మకం కలిగింది. వివేక్‌ రచనా, దర్శకత్వం అద్భుతంగా ఉంటాయి. ప్రతి సన్నివేశంలోనూ తన మార్క్‌ కనిపిస్తుంది. నా కెరీర్‌ ప్రారంభంలో నన్ను నమ్మి చాలామంది సినిమాలు రూపొందించారు. క్రమక్రమంగా నన్ను నేను నిరూపించుకుని ఈ స్థాయికి చేరుకున్నా. నేనూ ప్రతిభ ఉన్న వారిని నమ్ముతా. వారి అనుభవం గురించి ఆలోచించను. ప్రాజెక్టు విషయంలో భయపడను.

* నాయికగా నజ్రియాను ఎంపిక చేయాలనే నిర్ణయం ఎవరిది?

నాని: ఈ నిర్ణయం నాదీ వివేక్‌ది. లీల అనే పాత్రకు నజ్రియాను పోలిన కథానాయికలు ఎవరు? అని చర్చించుకున్నాం. ఎంత ప్రయత్నించినా ఎవరూ కనిపించలేదు. నజ్రియానే తీసుకుంటే మంచిదనిపించి ఆమెను సంప్రదించాం. ఎన్నో పెద్ద సినిమాల అవకాశాలను ఒప్పుకోని ఆమె ఈ కథ వినగానే తప్పకుండా చేస్తానని ముందుకొచ్చింది.

* బారిస్టర్ పార్వతీశం నవలకు, ఈ సినిమాకు మధ్య సంబంధం ఉందా?

నాని: ఏమాత్రం సంబంధం లేదు. పంచెకట్టు మాత్రమే సుందర్‌ పాత్రకు రిఫరెన్స్‌గా తీసుకున్నాం. సంబంధిత సన్నివేశం మంచి వినోదం పంచుతుంది. కొందరు అనుకుంటున్నట్టు ఈ సినిమా ‘సీతాకోక చిలుక’, ‘మరో చరిత్ర’ను పోలి ఉండదు. చాలా కొత్త కథ ఇది.

* ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి వివరిస్తారా?

నాని: సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఈ సినిమాకి ప్రధాన బలం. తన సంగీతంతో కథకు ప్రాణం పోశాడు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం అదుర్స్‌. సినిమాటోగ్రాఫర్‌ నికేత్‌ పనితనం ప్రతి సీన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో నేను నటించిన రెండో చిత్రమిది. నిర్మాతలు నవీన్‌, రవికి సినిమాలంటే ఓ ప్యాషన్‌.

* మీది ప్రేమ వివాహం కదా.. ఏవైనా సమస్యలు ఎదురయ్యాయా?

నాని: ఎలాంటి సమస్యలు రాలేదు. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు మా పెళ్లి జరిగింది. నా భార్యది సైంటిస్ట్‌ ఫ్యామిలీ. నాది సినిమా రంగం కాబట్టి మొదట్లో కాస్త కంగారు పడినా తర్వాత నన్ను నమ్మారు.

* మీరు ఇటీవల సినిమా టికెట్ ధరలు పెంచమని కోరారు. కానీ, ఇప్పుడు నిర్మాతలు తగ్గిస్తున్నారు కదా?

నాని: నేను టికెట్‌ ధరలు పెంచమని అడిగిన సందర్భం వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. సాధారణ ధరలను బాగా తగ్గించి రూ. 30, రూ. 40 చేయడం వల్ల ఇంత తక్కువ రేట్లతో సినిమాలను ప్రదర్శించడం కష్టమని చెప్పాను. భారీ బడ్జెట్‌ చిత్రాలకు ధరలు పెంచుకోవచ్చు. అందుకే నేనూ అలాంటి సినిమాల గురించి మాట్లాడలేదు. అయినా నేను ఎక్కువగా పెంచమని చెప్పలేదు. అంతకుముందున్న సాధారణ ధరలనే అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశా.

* పాన్‌ ఇండియా మార్కెట్‌పై మీ అభిప్రాయం?

నాని: మన సినిమాని మనమే పాన్‌ ఇండియా అనుకుంటే సరిపోదనేది నా అభిప్రాయం. కంటెంట్‌ను బట్టి ప్రేక్షకులే ఈ మాట చెప్పాలి. ఉదాహరణకు ‘పుష్ప’ చిత్రాన్ని తీసుకుంటే.. అది దక్షిణాది అడవుల్లో సాగే కథ. ఉత్తరాది ప్రాంతానికి సంబంధం లేకపోయినా ప్రేక్షకులంతా ఆదరించారు. అలా ఎవరైనా కథపై దృష్టి పెట్టాలిగానీ పోస్టర్‌పై పాన్‌ ఇండియా అని రాసుకుంటే సరిపోదు.

* ఫలానా సినిమాలో మీరు నటించి ఉంటే బావుండనిపించిందా?

నాని: సూర్య నటించిన ‘జై భీమ్‌’ సినిమా విషయంలో అలా అనిపించింది.

* మీ తదుపరి సినిమా ‘దసరా’ గురించి చెప్తారా..?

నాని: 25 శాతం షూటింగ్ పూర్తయింది. పవర్‌ఫుల్‌ మాస్‌ చిత్రమిది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు.

* మీ నిర్మాణ సంస్థలో రాబోతున్న సినిమాలు?

నాని: ప్రస్తుతం ‘మీట్‌ క్యూట్‌’ అనే సినిమా రూపొందుతోంది. అది నేరుగా ఓటీటీలోకి వస్తుంది. త్వరలోనే సంబంధిత వివరాలు ప్రకటిస్తాం. అడివి శేష్‌ హీరోగా ‘హిట్‌ 2’ రానుంది. హిట్‌ సిరీస్‌లు వస్తూనే ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని