Nani: వెంకటేశ్‌ మహా కాంట్రవర్సీ.. అలా జరగడం దురదృష్టకరం: నాని

వెంకటేశ్‌ మహా వివాదంపై స్పందించారు నటుడు నాని (Nani). చర్చా కార్యక్రమంలో అతడు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు.

Published : 17 Mar 2023 15:12 IST

హైదరాబాద్‌: ‘కేజీయఫ్‌’ (KGF) ను ఉద్దేశిస్తూ ఇటీవల దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) చేసిన వైరల్‌ కామెంట్స్‌పై నటుడు నాని (Nani) స్పందించారు. మొత్తం వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ దురదృష్టకరమని అన్నారు. వెంకటేశ్‌ మహా మాట్లాడిన విధానం సరికాదని అభిప్రాయపడ్డారు.

‘‘ఇటీవల దర్శకులందరూ కలిసి పాల్గొన్న చర్చా కార్యక్రమాన్ని నేనూ చూశాను. వెంకటేశ్‌ మహా మాట్లాడిన విధానం సరైనది కాదు. నా ఉద్దేశం ప్రకారం చెప్పాలంటే.. ఒక సినిమా చూసిన తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చి దాని గురించి మన ఫ్రెండ్స్‌తో ఒక టోన్‌లో చెబుతాం. కానీ, ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి అదే పాయింట్‌ని మరోలా చెబుతాం. ఇటీవల చర్చా కార్యక్రమంలోనూ అదే జరిగింది. సినిమాలపై జరుగుతోన్న చర్చ ఉన్నట్టుండి థియేటర్‌ బయట మాట్లాడే విధంగా మారింది. దానివల్లే అతడు విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సింది. ఈ కాంట్రవర్సీపై ఇప్పటికే వివరణ ఇచ్చాడు కాబట్టి.. అతడి గురించి మాట్లాడను. ఇక అదే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నలుగురు దర్శకులు నాకు బాగా తెలుసు. వారితో నేను వర్క్‌ చేశాను. వాళ్లకు మాస్‌, కమర్షియల్‌ సినిమా అంటే ఎంతో ఇష్టం. ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని సరదాగా చెప్పినప్పుడు ఆ పక్కనే ఉన్న వాళ్లు నవ్వడం సహజం. దాన్ని తప్పుగా భావించి వాళ్లందర్నీ విమర్శించడం తగదు. చిన్న వీడియో క్లిప్‌ చూసి వాళ్లపై ఒక అభిప్రాయానికి రాను. ఏది ఏమైనా అలాంటి సంఘటన చోటుచేసుకోవడం నిజంగా దురదృష్టకరం’’ అని నాని అన్నారు.

ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోహన్‌కృష్ణ ఇంద్రగంటి, నందినిరెడ్డి, వివేక్‌ ఆత్రేయ, శివ నిర్వాణ, వెంకటేశ్‌ మహా ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘కేజీయఫ్‌’ (KGF)ను ఉద్దేశిస్తూ.. ‘తల్లి కలను నెరవేర్చడం కోసం బంగారాన్ని సంపాదించి.. చివరికి ఆ మొత్తాన్ని సముద్రంలో పడేశాడు. అలాంటి వ్యక్తి గురించి సినిమాలు చేస్తే మనం చప్పట్లు కొడుతున్నాం’ అంటూ వెంకటేశ్‌ మహా కామెంట్స్‌ చేశాడు. కాస్త అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. అదే సమయంలో ఆయన వివరణ ఇచ్చాడు. కాగా, తాజాగా ‘దసరా’ (Dasara) ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని ఈ కాంట్రవర్సీ పై స్పందించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు