maa elections: ప్రకాశ్‌రాజ్‌ మేఘం.. కానీ విష్ణు సూర్యుడు రోజూ ఉదయిస్తాడు!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ మేఘం లాంటివాడని, కురిసి కరిగిపోతాడని సీనియర్ నటుడు, పూర్వ మా అధ్యక్షుడు నరేష్ అన్నారు.

Published : 05 Oct 2021 01:26 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ మేఘం లాంటివాడని, కురిసి కరిగిపోతాడని సీనియర్ నటుడు, పూర్వ మా అధ్యక్షుడు నరేష్ అన్నారు. మంచు విష్ణు సూర్యుడిలాంటి వాడని ప్రతి ఉదయం విష్ణు ఉదయిస్తాడని కొనియాడారు. అక్టోబర్ 10న జరిగే ఎన్నికలను పురస్కరించుకొని నరేశ్‌తో కలిసి మంచు విష్ణు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. చిత్రపురి కాలనీ, కృష్ణానగర్, మణికొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ‘మా’ సభ్యులను కలిసి తనకు ఓటు వేసి తెలుగు నటీనటుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని అభ్యర్థించారు.

అవకాశాల కోసం ఆరాటపడే నటీనటులకు తాను గెలిస్తే తప్పకుండా సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నరేష్, మంచు విష్ణుల రాకతో చిత్రపురి కాలనీలో సందడి నెలకొంది. ఎప్పుడూ లేని విధంగా మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తుండటం సభ్యులకు ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అటు ప్రకాశ్‌రాజ్ కూడా తన ప్యానెల్ సభ్యులతో కలిసి మూకుమ్మడి సమావేశాలు నిర్వహిస్తూ తన ప్రణాళికను ఓటర్లకు వివరిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇరువురు అధ్యక్ష అభ్యర్థులు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తుండటం సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని