Naresh: సినీ కార్మికుల బంద్‌పై స్పందించిన నరేశ్‌

తెలుగు చిత్ర పరిశ్రమలోని(Tollywood) సినీ కార్మికులు వేతనాలను పెంచకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ బుధవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే...

Published : 22 Jun 2022 11:44 IST

వీడియో రిలీజ్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: వేతనాలను పెంచకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలోని(Tollywood) సినీ కార్మికులు బుధవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సినీ కార్మికులు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై నటుడు నరేశ్‌ (Naresh) స్పందించారు. కరోనా కారణంగా మూడేళ్ల నుంచి చిత్రపరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోందని, ఇలాంటి సమయంలో సమ్మెబాట పట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం నరేశ్‌ కొన్ని వీడియోలు షేర్‌ చేశారు.

‘‘నిన్నటి నుంచి ఎక్కడ చూసినా సినిమా షూటింగ్స్‌ ఆగిపోతున్నాయనే వార్తలు కనిపిస్తున్నాయి. యూనియన్లు వేతనాలు పెంచకపోవడం వల్ల షూటింగ్స్‌ ఆపేస్తామంటూ కార్మికులు పోరాటం చేస్తున్నారని తెలిసింది. అందరికి మంచి జరిగేలా పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంతోపాటు సినీ పరిశ్రమ కూడా దెబ్బతింది. కార్మికులు, చిన్న ఆర్టిస్టులు తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడ్డారు. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది. తెలుగు చిత్రపరిశ్రమకు అంతటా మంచి పేరు వస్తోంది. మనందరి బ్యాంకు ఖాతాలు డబ్బులతో నిండకపోయినా.. కనీసం మనందరి కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్నింటికీ పరిష్కారం ఉంటుంది. సమ్మె గురించి విని నిర్మాతలు, దర్శకులు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇండస్ట్రీ బిడ్డగా నేను కోరేది ఒక్కటే.. నిర్మాతలు కూడా కరోనా సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. వడ్డీలు కట్టలేని పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాస్త స్థిరపడుతున్నారు. ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఒక వారం లేదా పదిరోజులు సమయం తీసుకుని, ఫెడరేషన్‌, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి రావడం కష్టం కాదు. కృష్ణానగర్‌, ఫిలింనగర్‌కు ఉన్న దూరం 3 కిలోమీటర్లు. అందరం కలిస్తేనే ఒక కుటుంబం. అందరం కలిసి ఒక పరిష్కారం తీసుకువస్తాం. ఇండస్ట్రీ బిడ్డగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. పెద్దలందరం కలిసి నిర్ణయం తీసుకుని.. సినీ పరిశ్రమ మరోసారి అంధకారంలోకి వెళ్లకుండా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నా’’ అని నరేశ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని