Naresh: వినోదాన్ని పంచుతూనే షాకిస్తుంది

‘‘పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. దాన్ని గౌరవించే కోణంలోనే ‘మళ్లీ పెళ్లి’ సినిమా చేశాం’’ అన్నారు నటుడు నరేష్‌ వి.కె. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమే ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్‌.రాజు తెరకెక్కించారు.

Updated : 26 May 2023 14:02 IST

‘‘పెళ్లి అనేది చాలా పవిత్రమైనది. దాన్ని గౌరవించే కోణంలోనే ‘మళ్లీ పెళ్లి’ సినిమా చేశాం’’ అన్నారు నటుడు నరేష్‌ వి.కె. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమే ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్‌.రాజు తెరకెక్కించారు. పవిత్ర లోకేష్‌ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గురువారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నరేష్‌.

ఈ సినిమా ప్రమోషన్స్‌ బాగా ప్లాన్‌ చేశారు. ఈ చిత్ర టీజర్‌, గ్లింప్స్‌.. మీ వ్యక్తిగత జీవితానిదా? సినిమాలోనిదా అన్నది ఎవరికీ అర్థం కాలేదు!?

‘‘అది మా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే. ఏదో గిమ్మిక్‌ చేసి, ప్రేక్షకుల్ని మోసపుచ్చాలనే ఉద్దేశం మాకు లేదు. ఒకవైపు షూటింగ్‌ జరుగుతుంటే.. కొన్ని దుష్టశక్తులు అసత్య ప్రచారాలు చేశాయి. వాటికి బ్లాస్ట్‌ ఇవ్వాలని అనుకున్నాం. నేను.. పవిత్ర కలిసి జీవిస్తున్నామని చెప్పాలనుకున్నాం. అప్పుడే ఆ లిప్‌లాక్‌ వీడియోని విడుదల చేశాం. అందుకే ఆ వీడియోలపై ఎలాంటి పేర్లు వేయలేదు. అయితే వాటికి దేశవ్యాప్తంగా చాలా ఆదరణ వచ్చింది. ఇందులో గిమ్మిక్‌ లేదు. సినిమాలో ఇంకా చాలా షాకింగ్‌ కంటెంట్‌ ఉంది. ఈ సినిమా థియేటర్‌లో ఆటంబాంబులా పేలుతుంది. వినోదాన్ని పంచుతూనే షాకిస్తుంది’’.

ఈ చిత్రానికి హీరోగా, నిర్మాతగా పని చేశారు. ఏది ఎక్కువ తృప్తినిచ్చింది?

‘‘నటుడిగా థ్రిల్‌ ఉంది. ఒక సినిమా హిట్టు కొట్టడమే చాలా కష్టం. అలాంటిది నేను ఇన్ని హిట్స్‌ ఇచ్చి, తెర వెనక్కు వెళ్లిపోయి, మళ్లీ తిరిగి వచ్చాను. సహాయ నటుడిగా చేశాను. ఇప్పుడు మళ్లీ హీరోగా చేస్తున్నాను. నటనలో  50ఏళ్లు పూర్తి చేసుకోవడం గొప్ప థ్రిల్‌. నిర్మాతగా పెద్ద బాధ్యత ఉంటుంది. విజయ కృష్ణ మూవీస్‌ లాంటి పెద్ద బ్యానర్‌ను మళ్లీ తీసుకురావడం.. దాని వారసత్వాన్ని కాపాడటం.. ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను ఇవ్వడం ఇంకా పెద్ద బాధ్యత. ఈ విషయంలో రాజును నమ్మాను. చాలా కష్టపడ్డాం. ఇది రెగ్యులర్‌ కథ కాదు. ఎంతో రీసెర్చ్‌ చేశాం. నటుడిగా, నిర్మాతగా ఇది చాలా పెద్ద ప్రయోగం. యూత్‌, ఫ్యామిలీ, మాస్‌.. అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా చేశాం. నిర్మాతగా చాలా నమ్మకంగా ఉన్నా’’.

ఇది మీ జీవితంలోని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసిన కథ అనుకోవచ్చా?

‘‘‘‘డర్టీ హరి’ సినిమా చూసినప్పుడే నేను ఎం.ఎస్‌.రాజుతో కనెక్ట్‌ అయ్యాను. తొలుత మేము వేరే కథ చేయాలని అనుకున్నాం. అదే సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిని ఆయన పరిశీలించారు. ఒక రోజు నా దగ్గరకు వచ్చి ‘‘నేను ఒక కథ చెబుతాను. అది మీకు, ప్రపంచానికి కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు. అలా ఈ ‘మళ్లీ పెళ్లి’ ప్రాజెక్ట్‌ మొదలైంది. నేను విజిల్‌ వేసే సీన్‌ సామాజిక మాధ్యమాల్లో ఉంది. అలా ఎందుకు చేశానని రాజు అడిగారు (నవ్వుతూ). ఒకటి మాత్రం వాస్తవం.. ఇది బయోపిక్‌ అయితే కాదు. మరి ఇంకేంటి అన్నది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఈ ‘మళ్లీ పెళ్లి’పై సమాజం దృష్టి సారిస్తుంది. ఇందులో నేను కూడా ఒక భాగం. ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతరంలో దీనికి మంచి ఆదరణ లభిస్తోంది’’.

సినిమాలో కృష్ణ పాత్రని కూడా చూపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. నిజమేనా?

‘‘ఒక సెలబ్రిటీ జీవితాన్ని తీసుకొని ఈ సినిమా చేశాం. అమ్మ, నాన్న పాత్రలు కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఆ పాత్రల గురించి ఇప్పుడే బయట పెట్టకూడదు. సినిమా చూశాక అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ కథలో ఉన్న ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. వాటి మధ్య ఎమోషనల్‌ కనెక్షన్‌ కూడా ఉంది. ఇందులో పని చేసిన వారందరికీ ఒక గౌరవం తెచ్చి పెట్టే చిత్రమిది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని