Ugram OTT Release: ఓటీటీలోకి నరేశ్‌ కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

నరేశ్‌ (Naresh) పోలీస్‌ అధికారి పాత్రలో నటించిన చిత్రం ‘ఉగ్రం’ (Ugram OTT Release) ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.

Published : 31 May 2023 13:54 IST

హైదరాబాద్‌: ‘నాంది’ తర్వాత నరేశ్‌ (Naresh) కథానాయకుడిగా విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉగ్రం’ (Ugram). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మే నెల ఆరంభంలో విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ నరేశ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఈసినిమా త్వరలో ఓటీటీ వేదికగా సినీ ప్రియులను అలరించనుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జూన్‌ 2 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది.

కథేంటంటే: సీఐ శివకుమార్‌ (అల్లరి నరేష్‌) నిజాయితీ గల పోలీస్‌ అధికారి. అపర్ణ (మిర్నా మేనన్‌)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె తండ్రి నరసింహారెడ్డి పటేల్‌ (శరత్‌ లోహితస్వా)ను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప (ఊహా రెడ్డి) కూడా పుడుతుంది. కానీ, ఓ కారు ప్రమాదం శివకుమార్‌ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఆ ప్రమాదంలో శివ జ్ఞాపకశక్తి కోల్పోతాడు. మరోవైపు, ఆ యాక్సిడెంట్‌ తర్వాత శివ భార్య, పాప కనిపించకుండా పోతారు. మరి వాళ్లను వెతికి పట్టుకునేందుకు అతడు చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన భార్య, బిడ్డతో పాటు నగరంలో కనిపించకుండా పోయిన అనేక మంది ఆచూకీని తనెలా కనుగొన్నాడు?(Ugram movie review) అసలు వాళ్లందరినీ కిడ్నాప్‌ చేసిందెవరు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు