Naresh Pavitra: మా బంధాన్ని బ్రేక్‌ చేయాలని చూసింది: నరేశ్‌

‘మళ్ళీ పెళ్లి’ (Malli pelli) ప్రమోషన్స్‌లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారు నటుడు నరేశ్‌ (Naresh), నటి పవిత్రా లోకేశ్‌ (Pavitra Lokesh). తాజాగా వీరిద్దరూ ఈటీవీతో సరదాగా ముచ్చటించారు.

Published : 21 May 2023 01:41 IST

హైదరాబాద్‌: ‘మళ్ళీ పెళ్లి’ (Malli pelli)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు నరేశ్‌ (Naresh), నటి పవిత్రా లోకేశ్‌ (Pavitra Lokesh). ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. మరికొన్ని రోజుల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో నరేశ్‌ - పవిత్ర తాజాగా ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తమ రిలేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మళ్ళీ పెళ్లి’ కేవలం నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తెరకెక్కించిన సినిమా కాదు. సమాజంలోని పరిస్థితులు, ఎంతోమంది ఆలోచనలను ఆధారంగా చేసుకుని దీన్ని తీర్చిదిద్దాం. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి వాటివల్ల వివాహ వ్యవస్థ ఈ మధ్యకాలంలో దెబ్బతింటోంది. వైవాహిక బంధంపై మాకున్న గౌరవానికి అద్దం పడుతూ దీన్ని రూపొందించాం. ఇదొక బోల్డ్‌ ఐడియా. సెన్సార్‌ బృందంతోపాటు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రాన్ని చూపించాం. అందరూ మెచ్చుకున్నారు. యూత్‌ కూడా మా సినిమాకు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది’’

‘‘సోషల్‌మీడియాలో మాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రివెంజ్‌ కోసమే నేను ఈ సినిమా చేశానని అన్నారు. ఎవరి ఉద్దేశాలు వాళ్లకు ఉంటాయి. వాటిని మేము తప్పుబట్టడం లేదు. ఒకరిపై రివెంజ్‌ తీర్చుకోవాలంటే యూట్యూబ్‌ వేదికగా వాళ్లను విమర్శిస్తూ వీడియోలు షేర్‌ చేయవచ్చు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదు’’ అని నరేశ్‌ తెలిపారు.

అనంతరం ‘మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా?’ అని విలేకరి ప్రశ్నించగా..  ‘‘ఉదాహరణకు మనం ప్రేమగా ఒక ఇల్లు కట్టుకున్నాం. దురదృష్టవశాత్తు భూకంపానికి అది కూలిపోయింది. మళ్లీ ఇల్లు కట్టుకుంటామా? లేదా? అలాగే.. నా జీవితం కూలిపోయింది. తన లైఫ్‌ కూలిపోయింది. అది మేము ఎవరికీ చెప్పలేదు. అది చెప్పినప్పుడే సమస్యలు మొదలయ్యాయి. చెప్పకపోతే ఏమీ ఉండేది కాదు. వైవాహిక బంధానికి, మానవ హక్కులకు విలువ ఇస్తూ ఏ వ్యక్తి ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు అని కోర్టు తీర్పు నిచ్చింది. నా సినిమాలు నేను చేసుకుంటూ నా తోడుని వెతుక్కున్నా. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ కొత్తదేమీ కాదు. కోర్టే దానికి అంగీకారం తెలిపింది. పెళ్లి అంటే యూనియన్‌ ఆఫ్‌ హార్ట్స్‌. మా మనసులు ఎప్పుడో కలిశాయి. మాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే తప్పకుండా అందర్నీ పిలిచి ఘనంగా చేసుకుంటాం’’ అని నరేశ్ వివరించారు.

ఇక, ఇదే ఇంటర్వ్యూలో ట్రోల్స్‌ గురించి నరేశ్‌ స్పందించారు. ‘‘ఒక వ్యక్తి ప్రమేయంతో ఇవన్నీ వచ్చాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లయ్‌ చేశాను. ఆ తర్వాత నుంచి నా పరువుకు భంగం కలిగించాలని, మా బంధాన్ని బ్రేక్‌ చేయాలని చూసింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఇలా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ నన్ను నమ్మి పవిత్ర వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెను నేను కాపాడాలి. అందుకే ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటున్నాను. మా కుటుంబం కూడా మాకు అండగా ఉంది’’ అని అన్నారు.

‘‘సినిమా షూటింగ్‌లో మా ఇద్దరికీ పరిచయమైంది. మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేశాం. మా వ్యక్తిత్వం ఒక్కటే. విషయం ఏదైనా పాజిటివ్‌గానే చూస్తాం. ఒకరిపై రివెంజ్‌ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోల్స్‌ వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. నరేశ్‌ నాకు అండగా నిలబడ్డారు’’ అని పవిత్ర వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని