Naresh: పవిత్రా లోకేష్‌తో వివాహం.. స్పష్టతనిచ్చిన నరేష్‌

తనకూ పవిత్రా లోకేశ్‌ మధ్య ఉన్న  బంధంపై సీనియర్‌ నటుడు నరేశ్‌ స్పష్టతనిచ్చారు. అంతేకాదు, పెళ్లిపైనా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Published : 20 May 2023 01:43 IST

హైదరాబాద్: సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh), పవిత్రా లోకేశ్‌(pavitra lokesh)లు సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు కన్నడలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనకూ పవిత్రా లోకేశ్‌ మధ్య బంధంపై నరేశ్‌ స్పష్టతనిచ్చారు. అంతేకాదు, తమ పెళ్లిపైనా అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘‘ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో ఒకదాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. 50శాతం కన్నా ఎక్కువ మంది దంపతులు జీవితాంతం కలిసి ఉంటున్నారు. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడుల కారణంగానో, లేదో ఇతర ఏ సమస్య వల్లే అలా కలిసి ఉంటున్నారు. మరికొందరు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం మనందరికీ స్వేచ్ఛగా బతికే హక్కును ప్రసాదించింది. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. మనకు ఉన్నది ఒకటే జీవితం. ఉన్నంతకాలం సంతోషంగా బతకాలి. సమాజంలో ఉన్న పరిస్థితుల కారణంగా ‘మళ్లీ పెళ్లి’ టీజర్‌, ట్రైలర్‌కు చాలా మంది కనెక్ట్‌ అయ్యారు’’

‘‘పవిత్రా లోకేశ్‌ను వివాహం చేసుకుంటారా?’ అని ఈ మధ్య విలేకరులు అడుగుతున్నారు. ‘అసలు వివాహం అంటే ఏంటి?’ తాళికట్టడం, ఉంగరం ధరించడం వివాహమా? ఇవన్నీ మన మత, సంప్రదాయల కోసం పెట్టుకున్న గుర్తులు. వివాహం అంటే రెండు హృదయాలు కలవడం. మా మనసులు ఎప్పుడో కలిశాయి. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఈ విషయాన్నే నేను స్పష్టం చేయాలనుకున్నా. అదే సమయంలో వివాహ వ్యవస్థ అంటే మాకెంతో గౌరవం. ప్రపంచం మారుతోంది. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్‌. అందరూ మా సినిమా చూడండి. ఆ తర్వాత కూడా మిమ్మల్ని కలుస్తాం. మీకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు చెబుతాం’’ అని నరేశ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు