Nassar: హోటల్‌లో వెయిటర్‌గా నాజర్‌.. చిరంజీవికి విషయం తెలియడంతో..

ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారట సినీ నటుడు నాజర్‌.. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Updated : 02 Jul 2024 07:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు, తమిళ చిత్రాల్లో విలక్షణ పాత్రలతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాజర్‌ (Nassar). ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఆయన కూడా సినిమా కష్టాలను అనుభవించారు. ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత కొద్దిరోజులు అవకాశాలు రాకపోవడంతో హోటల్‌లో వెయిటర్‌గానూ పనిచేశారు. అప్పుడే చిరంజీవి (Chiranjeevi) పిలిచి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారట. అయినా కూడా ఆత్మాభిమానం అడ్డువచ్చి, ఆయన్ను కలవటానికి వెళ్లలేదని నాజర్‌ ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘మా బ్యాచ్‌లో నాకు వెంటనే అవకాశాలు దొరకలేదు. చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. షూటింగ్‌కు వెళ్లాలంటే మా ఇంటి దగ్గరి నుంచి ఉదయం 6గంటలకే బయలుదేరి వెళ్లాలి. అప్పట్లో ఆర్టిస్టులందరూ భోజనం బాక్స్‌లు కట్టుకుని వచ్చేవారు. ఉదయాన్నే మా అమ్మ వంట చేయలేక కొన్నిసార్లు అన్నం మాత్రమే వండేది. దీంతో ఉత్త అన్నం బాక్సులో పెట్టుకుని వెళ్లేవాడిని. చిరంజీవి, ఇతర నటులకు ఆంధ్రా మెస్‌ నుంచి భోజనాలు వచ్చేవి. భోజనాలతో పాటు వచ్చే సాంబారు, కూరలు ఇస్తారేమోనని ఎదురు చూసేవాడిని.  ఒకరోజు ఇలాగే అన్నం తెచ్చుకుని చూస్తుంటే, చిరంజీవి ఒక మాట అన్నారు. ‘ఉదయాన్నే వంట కోసం అమ్మను ఇబ్బంది పెట్టొద్దు. నువ్వూ మాతో కలిసి భోజనం చెయ్‌. మేం ఏడుగురం తింటున్నాం కదా నువ్వు మాతో కలిసి తిను’ అని అన్నారు. అప్పటి నుంచి ఆ షూటింగ్‌ అయ్యే వరకూ చిరంజీవితో కలిసి భోజనం చేసేవాడిని. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తాజ్‌ కోరమండల్‌ హోటల్లో వెయిటర్‌ పనిచేయడం మొదలు పెట్టా’’

‘‘సినిమాలు జీవితం కాదని, నెలజీతం తీసుకుంటూ ఇలాంటి ఉద్యోగం చేసుకుంటే మంచిదని అనిపించింది. అలాంటి సమయంలో ఒకసారి ఫిలిం ఛాంబర్‌లో షూటింగ్‌ జరుగుతోందని తెలిసింది. తాజ్‌ కోరమండల్‌ హోటల్ నుంచి ఫిలిం ఛాంబర్‌ కి.మీ. దూరంలోనే ఉంటుంది. అప్పుడు నాకు సైకిల్‌ మాత్రమే ఉండేది. బ్రేక్‌ టైమ్‌లో సైకిల్‌పై అక్కడకు వెళ్లాను. అప్పుడు చిరంజీవి మూవీ షూటింగ్ జరుగుతోంది. కొద్దిసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి వచ్చేశాను. అంతకన్నా ముందే మా మధ్య పరిచయం ఉండటంతో, నేను షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన విషయం చిరంజీవి గమనించి, నన్ను పిలిపించారు. ‘నాజర్‌ ఏం చేస్తున్నావ్‌’ అని అడిగారు. ‘హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నా’ అని చెప్పా. ‘మంచి నటుడివి ఇలా చేయడమేంటి? రేపు ఉదయం వచ్చి నన్ను కలువు’ అని అన్నారు. సినిమా అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి అటువైపు వెళ్లకుండా ఉంటే బాగుంటుందని అనిపించింది. దీంతో చిరంజీవి పిలిచినా ఆత్మాభిమానం అడ్డువచ్చి నేను వెళ్లలేదు. ఆ తర్వాత చిరంజీవి పెద్ద స్టార్‌ అయ్యారు. బాలచందర్‌గారి చిత్రాలతో నేనూ నెమ్మదిగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, విలన్‌గా అవకాశాలు దక్కించుకున్నా. ఆ తర్వాత మేం కలిసి చేసిన సినిమాలు పెద్దగా లేవు. ‘ఖైదీ నంబర్‌ 150’లో చిన్న పాత్ర అయినా ఆయన కోసం చేశా’’ అంటూ నాజర్‌ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని