Published : 26 Jan 2022 15:41 IST

Sabu Cyril: దర్శకులు కథ చెబుతుంటే నాకు నిద్రొచ్చేస్తుంది...!

బాహుబలి... భారీతనానికి ఇప్పుడో పర్యాయపదంలా మారిపోయింది. ఆ చిత్రానికి అంతగా పేరు రావడానికి అందులోని సెట్టింగులు కూడా ఒక కారణమే. ఎస్‌ఎస్‌ రాజమౌళిలోని ఆ భారీ ఊహలకి ఆకారాన్నిచ్చినవాడు సాబు సిరిల్‌. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ లోనూ కొనసాగుతోంది. తన సెట్టింగ్స్‌ కోసం నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న ఈ నంబర్‌వన్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ప్రస్థానం.. ఆయన మాటల్లోనే...

‘నీవల్ల నా ఇగో దెబ్బతింది సాబూ...’ - అన్నారు ఓ రోజు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి.

‘నా వల్లా... ఏమైంది సార్‌...’ అన్నాన్నేను కంగారుగా.

‘ఇది ఇప్పటి సంగతి కాదు. ఆరేళ్లకిందట మీరు ముంబయిలో ఉన్నప్పుడు నేను నేను బాహుబలి కథ చెప్పడానికి వచ్చానుకదా... అదిగో అప్పుడు జరిగింది!’ అన్నారు.

‘అప్పుడు... ఏం జరిగింది సార్‌!’ అన్నాను.

‘నేను కథ చాలా బాగా చెబుతాననీ... గొప్ప నరేటర్‌ననీ నమ్ముతూ ఉండేవాణ్ణి. కానీ మీ దగ్గర నా విద్యేమీ పనిచేయలేదు. కథ ప్రారంభించిన కాసేపటికే మీ కళ్లు మూతలుపడుతున్నాయి. పదేపదే ‘కాఫీ తాగుదామా?’ అంటున్నారు. క్లైమాక్స్‌కి వచ్చేసరికి జోగుతున్నారు. ఆ రోజు నిజంగానే హర్ట్‌ అయ్యాను’ - అన్నారు రాజమౌళి స్నేహంగా నవ్వుతూ.

‘నాకు అదో పెద్ద సమస్య సార్‌! నాకు ఎవరు ఏ కథ చెప్పినా- వాళ్లు దర్శకులైనా సరే- నిద్ర ముంచుకొస్తుంది. బహుశా... చిన్నప్పుడు అమ్మమ్మ రాత్రుల్లో కథలు చెబుతుంటే నిద్రపోతాం కదా... ఆ అలవాటు అనుకుంటాను. ‘నిజానికి...

నాకు సినిమాలవైపు రావడం బొత్తిగా ఇష్టం లేదు మౌళిగారూ. అనుకోకుండానే ఇటొచ్చాను’ అంటే... ‘మరి ఇన్ని వందల సినిమాలూ... ఇన్నిన్ని జాతీయ అవార్డులూ...

ఎలా సాధించగలిగారు?’ అనడిగారు ఆశ్చర్యంగా చూస్తూ.

‘అదో పెద్ద కథలెండి...’ అంటూ మొదలుపెట్టి ఆయనకి క్లుప్తంగానే చెప్పాను. దాన్నే మీకు కాస్త వివరంగా చెబుతాను...

* * * *

కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని వాల్‌పారై అనే ఊరు మాది. నాన్న అక్కడో టీ ఎస్టేట్‌లో గుమాస్తాగా పనిచేస్తుండేవాడు. గుమాస్తాగిరి చేస్తేనేం ఆయనో గొప్ప చిత్రకారుడూ చక్కటి శిల్పకారుడు కూడా. ఎంత పనికిరాని వస్తువునిచ్చినా నిమిషాల్లో ఓ కళాఖండంగా మార్చి చూపగలడు. బహుశా, ఆయన కళలోని ఏ వెయ్యోవంతో నాకు వారసత్వంగా వచ్చి ఉంటుంది... చిన్నప్పటి నుంచీ బొమ్మలు వేస్తుండేవాణ్ణి. ఓ పెన్సిలూ, పేపరూ దొరికితే చాలు... ఏదో ఒక బొమ్మ గీస్తూ ప్రపంచాన్ని మరచిపోతుండేవాణ్ణి. అయినా చదువులోనూ బాగా రాణించాను. సైన్స్‌, మ్యాథ్స్‌లలో నంబర్‌ వన్‌గా ఉంటుండేవాణ్ణి. టెన్త్‌ తర్వాత మా కుటుంబం కోయంబత్తూరుకి షిఫ్ట్‌ కావడంతో అక్కడే ఇంటర్‌లో చేరాను. నేను స్కూల్‌కి వెళ్లేదారిలో... ఓ సైన్‌బోర్డు ఆర్టిస్టు కనిపించేవాడు. ఆయన గీసేవి కేవలం ప్రకటనలే అయినా... చాలా అద్భుతంగా అనిపించేవి. ఓ రోజు బడి నుంచి వస్తూ ఆయన దగ్గరకెళ్లి ‘నాకు మీదగ్గర ఈ ఆర్ట్‌ నేర్చుకోవాలనుంది’ అని చెప్పాను. నేను గీసిన బొమ్మలన్నీ చూపిస్తే ‘బావున్నాయి... నీ బడి పూర్తవగానే రోజూ సాయంత్రం వచ్చేసెయ్‌..!’ అన్నారు.

‘సింగిల్‌ టీ కూడా సంపాదించుకోలేవ్‌’

ఆ సైన్‌బోర్డు గురువు దగ్గరే నా చిత్రకళలో తొలి మెరుగులు దిద్దుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకుంటున్న విషయం అమ్మకి మాత్రమే చెప్పాను. అలా మూడు నెలలు గడిచాయి. ఓ రోజు నేనూ మా గురువూ బొమ్మలు గీస్తుండగా ఓ పెద్దాయన వచ్చారు. మా గురువుని ప్రశంసిస్తూ ‘ఇవి సైన్‌బోర్డులే అయినా... చాలా కళాత్మకంగా ఉన్నాయి!’ అంటూ మెచ్చుకున్నారు. పక్కనే ఉన్న నన్నూ, నేను గీస్తున్న బొమ్మల్నీ చూశాడు. ‘గురువుకు తగ్గ శిష్యుడివే! నువ్వు చెన్నైలో ఫైనార్ట్స్‌ కాలేజీలో ఎందుకు చేరకూడదూ..? ఇంటర్‌ అయ్యాక ప్రయత్నించు’ అంటూ వెళ్లిపోయాడు. ‘బొమ్మలు గీయడానికీ కాలేజీ ఉంటుందా?’ అని నోరెళ్లబెట్టేశాను నేను. అప్పట్నుంచి ఆ కాలేజీలో చేరడమే నా జీవితాశయమైంది. అందుకోసమే చెన్నైలో చదువుతానని పట్టుబట్టాను. అక్కడైతే కోచింగ్‌ బావుంటుందని అనుకున్నాడేమో నాన్న, ఓ బంధువులింట ఉంటూ చదువుకునే ఏర్పాట్లు చేశాడు. స్కూల్లో చేరిన కొద్దిరోజులకే మా క్లాస్‌ టీచర్‌ వద్ద నా లక్ష్యమేంటో చెబితే... ఆయనా ప్రోత్సహించారు. ఇంటర్‌ కాగానే నాన్నతో విషయం చెప్పాను. నేను ఊహించినట్టే ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ‘ఆ కోర్సులన్నీ డబ్బున్నవాళ్లకే సరిపోతాయి. మధ్యతరగతికి సెట్‌ కావు... వాటికి ఉద్యోగాలు రావు. సింగిల్‌ టీ సంపాదించడానికీ అష్టకష్టాలు పడతావ్‌!’ అన్నాడు. నేను అన్నం తినకుండా మొండికేసేటప్పటికి ‘ఆ కాలేజీలో చేరడానికి నేను కాణీ కూడా ఖర్చుచేయను. ఫీజు డబ్బు నువ్వే సంపాదించుకుంటానంటేనే వెళ్లు!’ అని చెప్పేశాడు. ఆ మాట అన్నాడో లేదో అమ్మతో వెళ్లి కాలేజీలో జాయినైపోయాను.

ట్యూషన్‌లు చెప్పుకుంటూ...

నాకు చెన్నైలో ఆశ్రయం కల్పించిన బంధువే ఫీజు విషయంలోనూ ఆదుకున్నారు. తన పలుకుబడితో మ్యాథ్స్‌ ట్యూషన్‌లూ, ఆర్ట్‌ క్లాసులూ చెప్పుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు, చెన్నైలో నేనుంటున్న గదికి పొరుగునే ఓ మందుల ఫ్యాక్టరీ యజమాని ఉండేవాడు. ఆయన తమ సంస్థ తయారుచేసే టానిక్‌లకి సంబంధించిన లేబుళ్లకి నా చేత డిజైన్స్‌ చేయించుకోవడం మొదలుపెట్టాడు. ఈ పనులతో నాన్నపైన ఆధారపడకుండా నా ఫీజులు నేను కట్టగలిగాను. అంతేకాదు, ఫైనార్ట్స్‌లో ‘అడ్వర్టైజ్‌మెంట్‌’ని ఆప్షన్‌గా తీసుకుని ప్రకటనలకి పనికొచ్చే గ్రాఫిక్స్‌పైన దృష్టిపెట్టాను. చదువుకుంటూనే బయటి సంస్థలకి పనులు చేయడం ప్రారంభించాను. కోర్సు ముగించగానే ఓ యాడ్‌ ఏజెన్సీని పెట్టి... మా అక్క పెళ్ళికి కావాల్సిన డబ్బు సర్దగలిగాను. మా అక్క రిసెప్షన్‌ రోజు... పెళ్ళిపనుల్లో పడి నిద్రాహారాలు మానడం వల్ల అనుకుంటా... అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాను. కాసేపటికి లేచి చూస్తే చుట్టూ ఉన్నవాళ్లందరూ ‘ఇలా తిండితిప్పలు మానేయొచ్చా!’ అంటూ కసురుతూ కనిపించారు కానీ... ఒకమ్మాయి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయింది. ఆ కన్నీళ్లు మా ఇంట భూకంపం సృష్టించాయి. ఆ అమ్మాయి నా భార్య అన్న రహస్యాన్ని బట్టబయలు చేశాయి!

అదో ప్రేమ కథ...!

ఆ అమ్మాయి మా మావయ్య కూతురు. ఆయన ఎవరో కాదు... ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్‌ అజయ్‌ విన్సెంట్‌! ఎంత బంధువైనా ఆయనేమో పేరున్న కళాకారుడు, నాన్నేమో చిరుద్యోగి కాబట్టి ఇరుకుటుంబాల మధ్యా బాగా ఎడం ఉండేది. ఆ ఇంటి పిల్లని పెళ్ళి చేసుకునే ఊహే నాకెప్పుడూ రాలేదు. మొదట్నుంచి ఓ స్నేహితురాలిగానే చూస్తూ వచ్చాను. అది ఎప్పుడు ప్రేమగా మారిందో ఒకర్ని విడిచి ఒకరం ఉండలేని స్థితికి ఎప్పుడు వెళ్లామో గుర్తులేదు. ఇక మా పెళ్ళిని పెద్దలు ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి... రహస్యంగా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాం. ఆర్థికంగా నిలదొక్కుకున్నాక అందరికీ చెబుదామనుకున్నాం. కానీ... అక్క పెళ్ళిలో తన కన్నీళ్లు ఆ రహస్యాన్ని దాచలేకపోయాయి. ఆ పెళ్ళిలోనే పెద్ద గొడవలయ్యాయి. తనని కాలేజీకి వెళ్లనివ్వకుండా కట్టడి చేశారు. దాంతో కట్టుబట్టల్తో ఇద్దరం మా కుటుంబాలకి దూరమై వేరుగా కాపురం పెట్టాం. మా పెద్ద పాప కడుపులో పడ్డాక పెద్దల మనసు కొద్దిగా కరిగి... తనని కాన్పుకి తీసుకెళ్లారు. కానీ నన్ను మాత్రం పలకరించనైనా లేదు. దాంతో, ఇద్దరం ఒకే నగరంలో ఉన్నా సాయంత్రాల్లో పరాయివాళ్లలా ఓ గుడిలో కలుసుకునేవాళ్లం. మా రెండో పాప పుట్టాకకానీ మా మావయ్య నాతో మాట్లాడలేదు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో నేను ఆయనకి అసిస్టెంటుగా పనిచేశానుకానీ... ఆయన మీదున్న ఒకలాంటి భయం నాకు సినిమామీదా ఏర్పడింది అని చెప్పాలి. అందుకే ప్రకటనల రంగంలో ఉన్నప్పుడు ఎన్ని అవకాశాలు వచ్చినా నేను అటువైపు వెళ్లలేదు.

మిత్రుని కోసం...

ఫైనార్ట్స్‌ కాలేజీలో నాకు జూనియర్‌గా ఉంటూ వచ్చిన అశోక్‌... సినిమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుండేవాడు. అతనో మలయాళం సినిమాకి పనిచేస్తూ ఉన్నప్పుడు... ఓ పెద్ద తెలుగు సినిమాలో అవకాశం వచ్చింది. దాంతో మిగతా పనిని నన్ను పూర్తిచేయమని తాను వెళ్లిపోయాడు. ఆ పనిలో భాగంగా నేను వేసిన సెట్‌ని... ప్రముఖ మలయాళ దర్శకుడు భరతన్‌ చూశాడు. ఆయన ‘అమరం’ అన్న సినిమా కోసం ఓ భారీ సొరచేపని తయారుచేసివ్వమన్నాడు. అది నచ్చి నేను వద్దంటున్నా ఆ సినిమాకి నన్నే ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఉండమన్నాడు. దానికి పనిచేస్తున్నప్పుడే అర్థమైంది... నేను పుట్టిందే ఇందుకోసమని! అప్పట్నుంచీ ఇప్పటిదాకా సినిమాల్లో పనిచేస్తున్న ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నాను. నా రెండో సినిమా మోహన్‌లాల్‌ హీరోగా ‘తేన్‌మావిన్‌ కొంబత్తు’కి జాతీయ అవార్డు అందుకున్నాను. ఆ తర్వాతి ఏడాది ‘కాలాపానీ’ చిత్రానికీ జాతీయ అవార్డు రావడంతో... తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరసగా భారీ సినిమాల అవకాశాలొచ్చాయి.

హాలీవుడ్‌ స్థాయిలో...

కమల్‌హాసన్‌ ‘హే రామ్‌’; మణిరత్నం ‘అమృత’, ‘గురు’; శంకర్‌ ‘అపరిచితుడు’ సినిమాలు నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. అవన్నీ ఒక ఎత్తైతే శంకర్‌ ‘రోబో’ ఒక్కటీ ఒకెత్తు. ఈ సినిమా కోసం ముందు హాలీవుడ్‌ నిపుణులనే శంకర్‌ సంప్రదించారు. వాళ్లు ఓ చిన్న రోబో తయారీ నమూనాకే కోటి రూపాయల బడ్జెట్‌ చెప్పారట. అప్పుడే ఆయన నా దగ్గరకొచ్చారు... నేను కోటిరూపాయల రోబోని ఐదారు లక్షలకే చేసి చూపిస్తే ఆశ్చర్యపోయారు. అలా ఆ సినిమా బడ్జెట్‌ని ముప్పావు శాతం తగ్గించేశాను. ఆ సినిమాకి రెండేళ్లు శ్రమించి... హాలీవుడ్‌కి ఏ మాత్రం తగ్గకుండా సెట్టింగ్స్‌ని సృష్టించాం.

బాహుబలి’ అలా...

2013లో ఎస్‌ఎస్‌ రాజమౌళి నాకు బాహుబలి కథ చెప్పారు. నేను సగంలో నిద్రపోయినా... ఆయన ఊహలు ఎంత పెద్దవో అర్థమైపోయింది. ఆ తర్వాతి మీటింగ్‌లోనే ఆ చిత్రానికి కావాల్సిన ప్రాథమిక డిజైన్‌లన్నింటినీ పూర్తి చేసి చూపించాను. ‘కథ వింటున్నప్పుడు నిద్రపోయినా ఎలా చేశాడబ్బా...’ అన్న ఆశ్చర్యం రాజమౌళిలో కనిపించినా అప్పుడు అడగలేదు! మాకు బాగా స్నేహం పెరిగాకే ఇవన్నీ అడిగారు. షూటింగ్‌కి వెళ్లడానికి ఆరునెలల ముందే ప్రతి సన్నివేశానికీ తగ్గ మినియేచర్‌లనీ సిద్ధం చేసుకున్నాను. అంతఃపురంలోని ఆసనాల నుంచీ పోరాటాల్లోని ఆయుధాల దాకా ప్రతిదీ కొత్తగా ఉండేలా పట్టుబట్టి మరీ చేయించుకున్నారు రాజమౌళి. ప్రసవ వేదనకి ఏమాత్రం తీసిపోని ఆ ఐదేళ్ల శ్రమకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టినప్పుడు... ఓ తల్లిలాగే ఆనందించాన్నేను. అటు బాహుబలి పూర్తవడంతోనే ఇటు ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల్లోకి దిగిపోయాం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’... 1920ల్లో జరిగే యాక్షన్‌ సినిమా. కాబట్టి ఆ కాలంలో వాడే అవకాశమున్న వస్తువులనే చూపించాలి. ఆ తరహాలోనే డిజైన్‌ చేయాలి. అవి కాకుండా... తెరపైన ఆధునిక కాలానికి చెందిన ఏ వస్తువు కనిపించినా ప్రేక్షకుల ముందు అభాసుపాలవుతాం.

ఇక్కడ నా చిన్నప్పటి అనుభవం బాగా ఉపయోగపడింది. మా నాన్న ఒకప్పుడు బ్రిటిష్‌వాళ్లకి చెందిన టీ ఎస్టేట్‌లోనే పనిచేస్తుండేవారు. వాళ్ల కార్యాలయంలో ఒకప్పుడు ఆంగ్లేయులు వాడిన వస్తువులన్నీ ఉండేవి. నేను వాటిని చూస్తూనే పెరిగాను కాబట్టి... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆ డిజైన్‌లని సునాయాసంగా తీసుకురాగలిగాను. తినబోతూ రుచులు ఎందుకుగానీ... సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ బ్రిటిష్‌ ఇండియాలోనే ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని