Siddharth: సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్‌ కామెంట్‌.. జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం

నటుడు సిద్ధార్థ్‌ తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌పై చేసిన కామెంట్‌ సరైంది కాదని, వెంటనే ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరింది.

Updated : 10 Jan 2022 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటుడు సిద్ధార్థ్‌ తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌పై చేసిన కామెంట్‌ సరైంది కాదని, వెంటనే ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరింది. కారణం ఏంటంటే.. ఇటీవల.. పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ట్విటర్‌ వేదికగా సైనా నెహ్వాల్‌ ఈ విషయంపై స్పందించింది. ‘ప్రధానికే అలాంటి పరిస్థితి ఎదురైతే.. ఏ దేశమైనా సురక్షితంగా ఉందని ఎలా అనుకోగలం. ప్రధానిపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని పేర్కొంది. సంబంధిత ట్వీట్‌ను సిద్ధార్థ్‌ రీట్వీట్‌ చేస్తూ ‘‘చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌.. భగవంతుడి దయవల్ల భారతదేశాన్ని కాపాడేవారు ఉన్నారు’’ అని వ్యాఖ్యానించాడు.

దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ రేఖాశర్మ సిద్ధార్థ్‌ వ్యాఖ్యల్ని ఖండించారని తెలిపింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ‘‘సామాజిక మాధ్యమాల వేదికగా ఓ మహిళను కించపరిచేలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. సిద్ధార్థ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, విచారణ జరిపాలని మహారాష్ట్ర డీజీపీని రేఖాశర్మ కోరారు. అసభ్యకరంగా మాట్లాడినందుకుగానూ సిద్ధార్థ్‌ ట్విటర్‌ ఖాతాను వెంటనే తొలగించాలంటూ ట్విటర్‌ ఇండియా గ్రీవెన్స్‌ అధికారికి ఓ లేఖ రాశారు’’ అని కమిషన్‌ లేఖలో పేర్కొంది.

ఇదిలా ఉంటే, తాను ఎవరినీ ఉద్దేశించి అలా మాట్లాడలేదని, తాను ఒక విధంగా చెప్పినదాన్ని మరోలా అర్థం చేసుకున్నారని సిద్ధార్థ్‌ తాజాగా మరో ట్వీట్‌ పెట్టాడు. కొన్ని విషయాల్లో ‘కాక్‌ అండ్‌ బుల్‌’ అని ప్రస్తావిస్తుంటామని, తనకు అవమానపరచాలనే ఉద్దేశం లేదని తెలిపాడు. మరోవైపు సిద్ధార్థ్‌ ట్వీట్‌పై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ స్పందించారు. ‘‘ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. ఒక నటుడిగా ఆయనను ఇష్టపడతా. కానీ, ఇది మాత్రం సరైనది కాదు. ఆయన తన అభిప్రాయాన్ని ఇంతకంటే మంచి పదాలతో వ్యక్త పరచవచ్చు. ట్విటర్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారనుకుంటా. ప్రధాని భద్రత అనేది దేశ సమస్య అయితే, దేశంలో ఏది భద్రమైనదో నాకు కచ్చితంగా తెలియదు’’ అని సైనా కౌంటర్‌ ఇచ్చారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts