Natti Kumar: కౌన్సిల్‌ ఒక్కటే ఉండాలి.. ‘దాసరి’పై సినిమా తీయబోతున్నాం.. నట్టి కుమార్‌

సినీ కార్మికుల కోసం దాసరి నారాయణరావు 1100 మందికి మెడిక్లైమ్‌ ఇప్పించారని నిర్మాత నట్టి కుమార్‌ అన్నారు. ప్రెస్‌మీట్‌లో పాల్గొని, దాసరి గురించి, కౌన్సిల్‌ ఎన్నికల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

Published : 09 Feb 2023 16:49 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావుని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరిచిపోయాయని నిర్మాత నట్టి కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దాసరి సినీ ప్రయాణంపై తాను ఓ సినిమా తీయబోతున్నానని తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 19 జరగనున్న ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ (Telugu Film Producers Council) ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘నిర్మాతలందరికీ మెడిక్లైమ్‌ ఇవ్వాల్సి వస్తుందని కొందరు పెద్దలు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఏర్పాటు చేసుకుని, కౌన్సిల్‌ను రోడ్డుమీదకు నెట్టేశారు. దాన్ని సి. కల్యాణ్‌, ప్రసన్నకుమార్‌లు నిలబెట్టారు. కౌన్సిల్‌ ఎన్నికలు ఈ నెల 19న జరగనున్నాయి. గిల్డ్‌ సభ్యులూ పోటీ చేసేందుకు వస్తున్నారు. కౌన్సిల్‌ మాత్రమే ఉండాలి.. గిల్డ్‌ క్లోజ్‌ చేయండని వారిని ఆహ్వానిస్తున్నా. వారికి పూర్తిగా సహకరిస్తా. రెండు సంస్థలు ఉండకూదనేది నా అభిప్రాయం. గిల్డ్ వాళ్లు గతేడాది నెలరోజులు షూటింగ్ బంద్ చేసినా సమస్యలు పరిష్కారంకాలేదు. సీనియర్‌ నిర్మాతలు ఉండకూదనే విధంగా గిల్డ్‌ వ్యవహరిస్తోంది. ఒకవేళ గిల్డ్‌ను కొనసాగిస్తూనే కౌన్సిల్‌ ఎన్నికల్లో ఆ సభ్యులు పోటీ చేస్తే.. నిర్మాతలంతా బాగా ఆలోచించుకుని ఓటేయండి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సిల్‌, ఛాంబర్‌ను గుర్తించలేదు. తమ సినిమా టికెట్‌ ధరలు పెంచాల్సి వచ్చినపుడు, అధిక షోలు ప్రదర్శించాలనుకున్నపుడు ప్రభుత్వాల దగ్గరకు అగ్ర హీరోలు వెళతారు. మా చిన్న నిర్మాతల కష్టాలు వారికి అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.

దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ.. ‘‘సినీ కార్మికుల కోసం దాసరి నారాయణరావు 1100 మందికి మెడిక్లైమ్‌ ఇప్పించారు. దాసరిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరిచిపోయాయి. కానీ, ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉన్నారు. మే 4న దాసరి పుట్టినరోజు. ఆ లోగా ఏదో ఓ ప్రాంతంలో ఆయన గుర్తుగా ఏదైనా నిర్మించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. దాసరి కేంద్రమంత్రిగానూ పనిచేశారు కాబట్టి పార్లమెంట్‌లో ఆయన చిత్ర పటాన్ని పెట్టించాలని అన్ని పార్టీలను కోరుతున్నా. ఈ విషయంలో కౌన్సిల్‌, ఛాంబర్‌ స్పందించి, విజ్ఞప్తి లేఖ రాయకపోతే కౌన్సిల్‌ ఎన్నికల తర్వాత నేను నిరసన వ్యక్తం చేస్తా. దాసరి జన్మదినం సందర్భంగా అదే రోజు ‘ఇది దాసరి చరిత్ర’ అనే  చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం. అది బయోపిక్‌ కాదు. సినీ పరిశ్రమలో ఆయన చేసిన ప్రయాణాన్ని చూపించనున్నాం. దాసరి పాత్రలో నటింపజేసేందుకు తమిళ అగ్ర హీరో తనయుణ్ని అనుకుంటున్నాం. ఆయనకు దక్కిన ప్రశంసలు, ఎదుర్కొన్న విమర్శలను జరిగింది జరినట్టు చూపిస్తాం. దాసరి గురించి ఈతరానికి తెలియాలి’’ అని నట్టికుమార్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని