Nawazuddin Siddiqui: థియేటర్లో అడుగుపెట్టే రోజు కోసం వేచిచూస్తున్నా!

‘‘మంచి కథా బలం ఉన్న చిత్రంతో థియేటర్లో అడుగుపెట్టే రోజు కోసం వేచిచూస్తున్నాను’’ అంటున్నారు ప్రముఖ హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ.

Published : 11 Jul 2024 01:46 IST

‘‘మంచి కథా బలం ఉన్న చిత్రంతో థియేటర్లో అడుగుపెట్టే రోజు కోసం వేచిచూస్తున్నాను’’ అంటున్నారు ప్రముఖ హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ అభిమానులను అలరించే ఆయన.. ఇటీవలే ‘రౌతు కా రాజ్‌’తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ జీ5 ఓటీటీ వేదికగా విడుదలై మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని తన అనుభవాలను, రాబోయే ప్రాజెక్టుల గురించి ‘ఈనాడు’ సినిమాతో పంచుకున్నారు నవాజుద్దీన్‌.

  • ‘‘రౌతు కా రాజ్‌’ చిత్ర దర్శకుడు ఈ కథతో నన్ను సంప్రదించినప్పుడే ఇందులో నేను పోషించే పాత్రను విభిన్నంగా చూపించబోతున్నారని అర్థమైంది. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం నిండిన కథలకు, ప్రయోగాలు చేసే పాత్రలకే ఫిదా అవుతున్నారు. అందుకే వెంటనే ఈ ప్రాజెక్టును అంగీకరించాను. ఇందులో ఇన్‌స్పెక్టర్‌ దీపక్‌ సింగ్‌ పాత్రలో బాధ్యత గల పోలీసు అధికారిగా కనిపిస్తూనే హాస్యాన్ని పంచే అవకాశం వచ్చింది’’.
  • ‘‘నేను చిత్రపరిశ్రమకు వచ్చి దాదాపు 25ఏళ్లు పూర్తయ్యాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఇప్పటి వరకు ఎంతో మంది అగ్రతారలతో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ.. అమితాబ్‌ బచ్చన్‌తో నటించిన ‘తీన్‌’, దివంగత నటి శ్రీదేవితో కలిసి తెరను పంచుకున్న ‘మామ్‌’ చిత్రాలు నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనవి. ‘మామ్‌’ సినిమా విడుదలై ఇటీవలే ఏడేళ్లు పూర్తయ్యాయి. శ్రీదేవితో కలిసి పనిచేసిన రోజుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సెట్లో ఎన్నో కొత్త విషయాల్ని, సలహాలను అందించారామె. ఇప్పటికీ ఆమెతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను’’.
  • ‘‘ప్రస్తుత ప్రపంచంలో ఓటీటీల హవానే కొనసాగుతోంది. నాకు వచ్చే ప్రాజెక్టులు కూడా ఓటీటీ వేదికగా విడుదలయ్యే కంటెంట్‌తోనే రూపొందుతున్నాయి. కానీ.. నా  సినిమాలు ఓటీటీకే పరిమితం అవుతాయని చెప్పట్లేదు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మంచి కంటెంట్‌ ఉన్న కథతో థియేటర్లో అడుగుపెట్టాలని అనుకుంటున్నాను. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను’’. 
  • ‘‘ఇప్పటి వరకు నేను నటించిన పాత్రలు ఒక ఎత్తయితే ‘హడ్డీ’లో ట్రాన్స్‌జెండర్‌గా కనిపించడం మరో ఎత్తు. నేను మునుపెన్నడూ పోషించని పాత్రది. నేను చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏవిధంగా స్వీకరిస్తారోనన్న భయం ఉండేది. ఈ పాత్రలో నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా రిస్క్‌తో కూడుకున్న చిత్రాలు చేస్తేనే ప్రేక్షకులకు మరింత దగ్గరవుతామనేది నా అభిప్రాయం. మమ్ముట్టి నటించిన ‘కాథల్‌ ది కోర్‌’ లాంటి కథలపై నాకు ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. త్వరలో ఓ బయోపిక్‌తో రాబోతున్నాను. ఇప్పటికే దీనికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని