Needa Review: నయనతార-నీడ (రివ్యూ)

Needa Review: కుంచకో బోబన్‌, నయనతార కీలక పాత్రల్లో నటించిన ‘నీడ’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 23 Jul 2021 10:58 IST

చిత్రం: నీడ; నటీనటులు: కుంచకో బోబన్‌, నయనతార, ఇజిన్‌హష్‌, దివ్య ప్రభ, లాల్‌, రోనీ డేవిడ్‌, సాజు కరప్‌ తదితరులు; సంగీతం: సూరజ్‌ ఎస్‌.కరప్‌; సినిమాటోగ్రఫీ: దీపక్‌ డి.మేనన్‌; ఎడిటింగ్‌: అప్పు ఎన్‌.భట్టాత్రి, అరుణ్‌లాల్‌ ఎస్‌.పి.; స్క్రీన్‌ప్లే: ఎస్‌.సంజీవ్‌; దర్శకత్వం: అప్పు ఎన్‌. భట్టాత్రి; విడుదల: ఆహా

వైవిధ్య చిత్రాలు, కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. ముఖ్యంగా యువ దర్శకులు చక్కని కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంతేకాదు, అగ్ర కథానాయకులు సైతం ఆయా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక కరోనా నేపథ్యంలో అక్కడ విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికలు ఇతర భాషల్లో డబ్బింగ్‌/సబ్‌టైటిల్స్‌తో అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అలా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్న మలయాళ చిత్రం ‘నిజల్’. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘నీడ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది? అసలు ఈ నీడ కథ ఏంటి? కుంచకో బోబన్‌, నయనతార ఎలా నటించారు? యువ దర్శకుడు అప్పు ఎన్‌.భట్టాత్రి సినిమాను ఎలా తెరకెక్కించారు.

కథేంటంటే: మేజిస్ట్రేట్‌ అయిన జాన్‌ బేబీ(కుంబకో బోబన్‌) కారు ప్రమాదంలో గాయపడతాడు. ముఖానికి తీవ్రగాయమవుతుంది. అది నయం అవడానికి కొన్ని రోజులు మాస్క్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి జాన్‌కు జరిగింది జరగనట్టు.. జరగనిది జరిగినట్లు ఊహించుకుంటూ ఉంటాడు. దీంతో అందరూ అతన్ని వింతగా చూస్తుంటారు.  స్నేహితురాలైన డాక్టర్‌ షాలిని ద్వారా జాన్‌కు ఓ విషయం తెలుస్తుంది. ఎనిమిదేళ్ల నితిన్‌(ఇజన్ హష్‌) క్రైమ్‌ స్టోరీ చెప్పాడని, అందుకు స్కూల్‌ మొత్తం ఆశ్చర్యపోయిందని చెబుతుంది. జాన్‌కు ఆ పాయింట్‌ ఆసక్తిగా అనిపిస్తుంది. దీంతో నితిన్‌ తల్లి షర్మిల(నయనతార)ను కలుసుకుని పిల్లాడికి ఆ కథ ఎలా తెలుసో కనుకుందామని అనుకుంటాడు. నితిన్‌ రాసిన కథ పేపర్‌ను  తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్తే చెరువులో నిజంగానే అస్థిపంజరం బయటపడుతుంది. దీంతో పోలీసులతో పాటు, అందరూ ఆశ్చర్యపోతారు. ఇలాంటి కథలు నాకు చాలా తెలుసు అని నితిన్‌ చెప్పడంతో జాన్‌ బేబీ షాక్‌ అవుతాడు. అసలు నితిన్‌ చెప్పిన కథలు నిజమేనా? ఆ హత్యలు ఎవరు చేశారు? జాన్‌ బేబీ, షర్మిల వాటిని ఎలా ఛేదించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇటీవల కాలంలో మిస్టరీ థ్రిల్లర్‌లకు మంచి ఆదరణ ఉంటోంది. చిన్న పాయింట్‌ తీసుకుని చివరి వరకూ బిగిసడలని కథనంతో వస్తున్న ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. సినిమా ప్రథమార్ధం ఎంత బలంగా ఉంటే ద్వితీయార్ధంపై అంత ఆసక్తి ఉంటుంది. ‘నీడ’ విషయంలో యువ దర్శకుడు అప్పు భట్టాత్రి అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. అయితే, ఏదో ఉందని ద్వితీయార్ధం చూడటం మొదలు పెట్టిన ప్రేక్షకుడికి చివరకు వచ్చే సరికి చిన్న అసంతృప్తి కలుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఓ కొండ గుహ ముందు నిలబడ్డాం. అందులో నుంచి సింహం గర్జనలు వినిపిస్తున్నాయి. ఆ గర్జనల శబ్దంతో చెవులు దద్దరిల్లిపోతున్నాయి. అదుగో కాసేపట్లో సింహం గుహ నుంచి బయటకు వస్తోందనుకుని ఆశగా చూస్తుంటే అందులోని నుంచి ఎలుక బయటకు వస్తే ఎలా ఉంటుందో ‘నీడ’ను చూస్తే అలా ఉంటుంది. అయితే, మరీ ఎలుకతో పోల్చడం కాస్త తక్కువే అయినా, బయటకు వచ్చింది మాత్రం సింహమైతే కాదు.

ఎనిమిదేళ్ల పిల్లాడు చెప్పిన కథను పట్టుకుని జడ్జి అయిన జాన్‌ బేబీ ఇన్వెస్టిగేషన్‌ చేయడంతో కథ ఆసక్తిని పెంచుతుంది. అయితే, ఆ హత్య జరిగి సుమారు 30ఏళ్లు అవుతుందని తెలియడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. 30ఏళ్ల కిందట జరిగిన హత్యను ఎనిమిదేళ్ల బాలుడు ఎలా చెప్పాడన్న ఉత్కంఠ కలుగుతుంది. మరోవైపు ఈ హత్యల గురించి జడ్జి అయిన జాన్‌కు ఎలా తెలిశాయా? అన్నది తెలుసుకోవడానికి పోలీసులు నిఘా పెడతారు. దీంతో కథనం ఆసక్తిగా సాగుతుంది. నాకు ఇంకా కొన్ని కథలు తెలుసు అంటూ నితిన్‌ చెప్పడంతో విరామ సన్నివేశానికి దర్శకుడు ఇచ్చిన ఈ ట్విస్ట్‌ ద్వితీయార్ధంపై ఉత్కంఠను పెంచుతుంది. దీంతో, అసలు నితిన్‌కు ఈ కథలన్నీ ఎలా తెలుసన్న కోణం నుంచి జాన్‌ పరిశోధన మొదలు పెడతాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా నెమ్మదిగా ఉంటాయి. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నట్లు కథ, కథనాలను నడిపించాడు దర్శకుడు. అసలు నితిన్‌కు కథలు ఎలా తెలిశాయన్న పాయింట్‌ ఆసక్తిగా ఉంటుంది. అదే ప్రీ క్లైమాక్స్‌ ముందు కథనాన్ని పరుగులు పెట్టేలా చేసింది. పతాక సన్నివేశాలు, హత్యలు చేయడం వెనుక ఉన్న వ్యక్తి, అతను చెప్పిన కారణాలు తెలిసిన తర్వాత ప్రథమార్ధంలో ఇంత బిల్డప్‌ ఇచ్చింది దీని కోసమా? అనిపిస్తుంది. అయితే, ఓవరాల్‌గా ఓ మంచి థ్రిల్లర్‌ను చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. పైగా నిడివి కూడా తక్కువ ఉండటం సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అయింది.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమా కథ మొత్తం చాలా తక్కువ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా కుంచకో బోబన్‌, నయనతార, ఇజిన్‌ హష్‌ల మధ్య నడుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. న్యాయమూర్తి పాత్రలో కుంచకో బోబన్‌, ఎనిమిదేళ్ల పిల్లాడి తల్లిగా నయనతార కూడా చక్కగా నటించారు. మిగిలిన వాళ్లు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సూరజ్‌ నేపథ్య సంగీతం కథలో ప్రేక్షకుడిని లీనం చేసింది. పాటలు పెద్దగా గుర్తుండవు. దీపక్‌ మేనన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠగా తీర్చిదిద్దారు. స్వతహాగా ఎడిటర్‌ అయిన అప్పు ఎన్‌. భట్టాత్రి, ఈ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టాడు. చివరి వరకూ ప్రేక్షకుడిలో ఉత్కంఠను కలిగించడంతో సఫలమయ్యాడు. హత్యల వెనుక బలమైన పాయింట్‌ ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తంగా అతని ప్రయత్నాన్ని అభినందించవచ్చు. మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాలు చూసేవారికి ఈ సినిమా బాగానే కనెక్ట్‌ అవుతుంది. నయనతార ఊహలతో దీనికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తుందని క్లైమాక్స్‌లో హింట్‌ ఇచ్చాడు దర్శకుడు.

బలాలు

+ ప్రథమార్ధం

+ కథ, కథనాలు

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: ఆ ‘నీడ’ ఎవరిదో తెలియనంత వరకూ ఉత్కంఠగానే వెంటాడుతుంది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని