Nayanthara: అలా కనిపిస్తేనే అభిమానులకు ‘నయనా’నందం.. బర్త్‌డే స్పెషల్‌

నయనతార పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు. 

Published : 18 Nov 2022 09:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడని హీరోయిన్‌, ఎక్కువ సినిమాలు చేసిన కథానాయిక ఎవరు? సినీ అభిమానులంతా టక్కున చెప్పే సమాధానం నయనతార. ‘దుర్గ’లా అమాయకంగా కనిపించాలన్నా, ‘సాషా’గా గ్లామర్‌ డోస్‌ పెంచాలన్నా, ‘గాయత్రి’గా హోమ్లీగా ఉండాలన్నా, ‘దేవిక’గా అన్యాయాన్ని ఎదిరించాలన్నా.. ఇలా ఎలాంటి పాత్రకైనా పూర్తి న్యాయం చేయగలదనే విశ్వాసానికి ప్రతిరూపం నయనతార. ఈ తార పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర అంశాలు.. 

ముందు నుంచే నటికావాలనుకున్నారా?

లేదు. కేరళలోని తిరువల్లాకు చెందిన నయనతార బాల్యమంతా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గడిచింది. ఆంగ్ల సాహిత్యంలో బీఏ పూర్తి చేశారు. తర్వాత సీఏ కావాలనుకున్నారు. కానీ, సినిమా కథలో ట్విస్ట్‌ల్లానే ఆమె జీవితం మలుపు తిరిగింది. అదెలా అంటే.. యాడ్ ఏజెన్సీ నిర్వహించే నయన్‌ పెదనాన్న ఆమె ఫొటోలు తీసి పలు ప్రకటన సంస్థలకు పంపించేవారు. వాటిని చూసిన మలయాళీ దర్శకుడు సత్యన్‌ అంతిక్కండ్‌.. తన సినిమాలో చేయమని నయన్‌ను అడిగారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పగా కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయానికే వదిలేశారు. కొన్ని రోజుల పాటు తీవ్ర మథనం తర్వాత నయన్‌ నటించేందుకు అంగీకరించారు.

ఎన్ని సినిమాలు చేశారు?

ఆమె నటించిన తొలి చిత్రం ‘మనసినక్కరే’ (2003). తర్వాత మోహన్‌లాల్‌తో రెండు సినిమాలు చేసి, ‘అయ్యా’తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్‌ ‘చంద్రముఖి’లో ఓ కీ రోల్‌ పోషించడంతో నయన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ మారిపోయింది. ఈ డబ్బింగ్‌ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయన్‌.. నేరుగా తెలుగులో నటించిన తొలి సినిమా  ‘లక్ష్మీ’. ఇది మంచి విజయం అందుకోవడంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. ‘బాస్‌’, ‘దుబాయ్‌ శీను’, ‘తులసి’, ‘అదుర్స్‌’, ‘బాడీగార్డ్‌’, ‘సింహా’, ‘ శ్రీరామ రాజ్యం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’, ‘బాబు బంగారం’, ‘సైరా’, ‘గాడ్‌ఫాదర్‌’.. ఇలా ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో తన నటనతో మెరిసి దటీజ్‌ నయనతార అనిపించుకుంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో నటించిన నయన్‌ ఇటీవల తన 75వ చిత్రాన్ని ప్రకటించింది. ఓ కథానాయిక ఇన్ని సినిమాలు చేయడం విశేషమే. ఈ తరం హీరోయిన్ల (దక్షిణాది)లో అత్యధిక చిత్రాల్లో నటించిన ఘనత కూడా ఆమెదే. ఓవైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే నాయికా ప్రాధాన్య సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు.

మీడియా ముందుకు ఎందుకురారు?

ఇదే ప్రశ్న నయన్‌ను అడిగితే ‘‘ఎక్కువగా మాట్లాడటాన్ని నేను ఇష్టపడను. మితభాషిని. ఎప్పుడో ఒక్కసారి మీడియా ముందుకొస్తే ఎన్నో విషయాలు అడుగుతారు.. నేను వివరించొచ్చు. కానీ, పదేపదే వచ్చాననుకోండి మీడియా అడిగేందుకు ప్రశ్నలూ ఉండవు, నేనూ ఏం చెప్పలేను’’ అని ఓ సందర్భంలో నవ్వుతూ చెప్పారు నయన్‌.

ఇన్నేళ్ల కెరీర్‌ సాఫీగా సాగిందా?

నయన్‌ కెరీర్‌లో 2010 ప్రత్యేకం. ఆ ఏడాది తెలుగులో ‘సింహా’, తమిళంలో ‘బాస్‌: ఎంగిర భాస్కరన్‌’, మలయాళంలో ‘బాడీగార్డ్‌’, కన్నడలో ‘సూపర్’ ఆమెకు తిరుగులేని విజయాన్ని అందించాయి. నాలుగు భాషల్లో సూపర్‌హిట్‌ అందుకోవడమంటే మామూలు విషయం కాదు. ఈ ఉత్సాహంతో రాకెట్‌లా దూసుకెళ్లాల్సిన సమయంలో నయన్‌ కొన్ని సమస్యల కారణంగా సినిమాలకు దూరమైంది. తర్వాత సమస్యలను అధిగమించి కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. ఆమెపై పలు గాసిప్స్‌ వస్తే తొలినాళ్లలో బాధపడినా తర్వాత స్పందించడం మానేశారు.

చీరకట్టులోనే చూస్తామన్నారట..

తన తొలి తమిళ సినిమా ‘అయ్యా’తోనే అక్కడ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకొన్నారు నయనతార. అందులోని పాత్రకు తగ్గట్టే బయటా చీరకట్టులోనే కనిపించండని చాలామంది ఆమెను కోరారట. వారి విజ్ఞప్తికి నయన్‌ నో చెప్పలేదు. కళ్లద్దాలు, ముక్కెర, బూట్లు ధరించడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది.

ప్రేమ.. పెళ్లి

‘‘బ్రేకప్‌లేని జీవితం ఉండదుగా?’’ అని ఒకానొక సమయంలో అనుకున్న నయన్‌.. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ (2015) అనే సినిమాతో వీరి పరిచయం మొదలై, అది ప్రేమగా మారి తర్వాత దంపతులను చేసింది. ఈ జంటకు ఇద్దరు మగ కవలలు. 38వ వసంతంలోకి అడుగుపెడుతోన్న డయానా మరియమ్‌ కురియన్‌ అలియాస్‌ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని