Nayanthara: వాళ్ల అత్యుత్సాహం వల్ల ఇబ్బందిపడ్డా.. పదేళ్ల తర్వాత నయన్‌ ఇంటర్వ్యూ

తన తదుపరి చిత్రం ‘కనెక్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వివాహమైన తర్వాత మొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి నయనతార. కొత్త సినిమా విశేషాలతోపాటు ఇప్పటివరకూ తాను వర్క్‌ చేసిన స్టార్స్‌ అందరి గురించి ఆమె ఎన్నో విషయాలు పంచుకున్నారు.

Published : 22 Dec 2022 02:03 IST

చెన్నై‌: దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార (Nayanthara) వివాహమైన తర్వాత మొట్టమొదటిసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తదుపరి చిత్రం ‘కనెక్ట్‌’ (Connect) ప్రమోషన్స్‌లో భాగంగా నయన్‌తో సుమ స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సినిమా విశేషాలతోపాటు టాలీవుడ్‌ హీరోల గురించి ఆమె ఎన్నో విషయాలు పంచుకున్నారు.

ప్రీ రిలీజ్‌లు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి?

నయనతార: నీతో ఇంటర్వ్యూలో పాల్గొనాలనుకున్నా. కానీ, నువ్వు ఫుల్‌ బిజీగా ఉంటున్నావు కదా. అందుకే నేను కూడా వేరే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకు రాలేదు. (నవ్వులు).

మీకు హారర్‌ సినిమాలంటే భయం లేదా?

నయనతార: నాకు హారర్‌ చిత్రాలు చూడాలన్నా, చేయాలన్నా ఇష్టమే. ఆ జోనర్‌లో వచ్చిన సినిమాలు చూస్తున్నప్పుడు కాస్త భయం వేసినట్లు ఉంటుంది. కానీ దాన్ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఫీలవుతా.

‘కనెక్ట్‌’లో భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయా?

నయనతార: భయంగా అనిపించినప్పటికీ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు థియేటర్‌ అనుభవాన్ని మెండుగా పొందుతారు.

‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌మీట్‌లోనూ మీరు పాల్గొనలేదు కదా?

నయనతార: ఆ సమయంలో నేను  దేశంలో లేను.

‘కనెక్ట్‌’కు లాక్‌డౌన్‌తో ఏదైనా సంబంధం ఉందా? 

నయనతార: లాక్‌డౌన్‌లో ఓ వైద్యుడి కుటుంబంలో జరిగిన సంఘటన నేపథ్యంలో దీన్ని చిత్రీకరించాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దీన్ని రూపొందించినప్పటికీ.. షూట్‌ మాత్రం ఇటీవలే చేశాం.

‘రాజా రాణి’ తర్వాత సత్యరాజ్‌తో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

నయనతార: ఇదొక విభిన్న చిత్రం. పేరుపొందిన నటీనటులను ఈ కథలో భాగం చేయాలనుకున్నాం. సత్యరాజ్‌ సర్‌ మంచి నటుడు. ‘కనెక్ట్‌’లో ఆయన ఒదిగిపోయిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆయనలా ఈ పాత్రను ఎవరూ పోషించలేరు. ఆయనతో వర్క్‌ని ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తాను. ఆయనతో సెట్‌లో ఉంటే తండ్రితో కలిసి వర్క్‌ చేస్తున్న భావన కలుగుతుంది.

అనుపమ్‌ ఖేర్‌ను ఈ ప్రాజెక్ట్‌లో ఎలా భాగం చేశారు?

నయనతార: ‘కనెక్ట్‌’ విషయంలో మేము తీసుకున్న మరో మంచి నిర్ణయం ఆయన్ని ఎంచుకోవడం. దక్షణాది నుంచి కాకుండా వేరే ఇండస్ట్రీ వాళ్లను తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన పేరే మా మదిలో మెదిలింది. కథ చెప్పిన వెంటనే ఆయన ఓకే అన్నారు. షూట్‌లో ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం రాలేదు. మా ఇద్దరి సన్నివేశాలు కేవలం జూమ్‌ కాల్‌లోనే ఉంటాయి.

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌, నిర్మాత విఘ్నేశ్‌ శివన్‌.. ఏమైనా మార్పులు చూశారా?

నయనతార: విఘ్నేశ్‌ దర్శకుడిగా ఒకలా ఉంటాడు. ఆయనకు కావాల్సిన సీన్స్‌, షాట్స్‌పైనే దృష్టి పెట్టేవాడు. ఇక, నిర్మాతగా ఆయన పూర్తి భిన్నంగా వ్యవహరిస్తాడు. ఒకరోజు ఎప్పుడైనా షూట్‌ కాస్త ముందుగానే పూర్తైతే.. వెళ్లిపోవాలనుకున్నప్పుడు.. మరో సీన్‌ చేయవచ్చు కదా. ఎందుకు వెళ్లిపోవడం అంటాడు. (నవ్వులు)

మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు వస్తే ఎవరు ముందు సైలెంట్‌ అయిపోతారు?

నయనతార: అలాంటిది ఏదైనా జరిగితే.. నేను సైలెంట్‌గా గుడ్‌నైట్‌ చెప్పేసి వెళ్లి పడుకుని పోతాను.

మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి తెలుసుకునేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటివి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాయా?

నయనతార: నేను ఉన్న ఫీల్డ్‌ అలాంటిది. అందరూ నా లైఫ్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కొంతవరకూ అవి బాగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు మరీ ఎక్కువగా నా జీవితంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటివి నన్ను కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి.

పెళ్లి అయ్యాక.. ఓ మహిళ వర్క్‌ లైఫ్‌లో మార్పులు వస్తాయని భావిస్తున్నారా?

నయనతార: పెళ్లి అయ్యాక అబ్బాయి ఏమీ మారడని.. అమ్మాయి జీవితం చాలా మారుతుందని అంటుంటారు. నేను దాన్ని నమ్మను. ఉదాహరణకు విఘ్నేశ్‌ నాకు సుమారు 9 ఏళ్ల నుంచి తెలుసు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అదొక్కటే మా మధ్య మారింది. పెళ్లి అయ్యాక వర్క్‌లైఫ్‌లో ఎలాంటి మార్పులు రాలేదు. తన సపోర్ట్‌ వల్ల పెళ్లి తర్వాతే నేను ఎక్కువ ప్రాజెక్ట్‌లు ఓకే చేశా.

లాక్‌డౌన్‌లో మీ లైఫ్‌ ఎలా సాగింది?

నయనతార: ప్రశాంతంగా నిద్రపోయాను. ఎన్నో ఏళ్ల నుంచి షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాను. విఘ్నేశ్‌ బర్త్‌డే, లేదా నా బర్త్‌డే సమయంలోనే బ్రేక్‌ తీసుకుని విహారయాత్రకు వెళ్లేదాన్ని. మధ్యలో ఎప్పుడూ బ్రేక్స్‌ తీసుకోలేదు. ప్రతిరోజూ వర్క్‌లోనే ఉండేదాన్ని. అందువల్ల లాక్‌డౌన్‌లో ఎక్కువ సమయం నిద్రలోనే గడిపేశాను.

ఏమైనా షోలు, ప్రోగ్రామ్స్‌ చూస్తారా? 

నయనతార: సాధారణంగా నేను షోలు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తా. అయితే లాక్‌డౌన్‌ మరీ ఎక్కువగా చూశా. దాని వల్ల కాస్త బోర్‌ కొట్టింది. అందుకే బ్రేక్‌ తీసుకున్నా.

వెంకటేశ్‌తో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

నయనతార: ఆయన నా మొదటి తెలుగు హీరో. మేమిద్దరం ఎన్నో సినిమాలు చేశాం. ఆయనతో సెట్‌లో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్లు ఉంటుంది. ఒక పెద్ద హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాననే భావన కలగదు.

నాగార్జునను ఒక్క పదంలో అభివర్ణించాలంటే ఏం చెబుతారు?

నయనతార: అందగాడు. 

మెగాస్టార్‌ చిరంజీవి గురించి ఏమైనా చెప్పగలరు?

నయనతార: అగ్రనటుడు అయినప్పటికీ మెగాస్టార్‌ చిరంజీవి స్టార్‌డమ్‌ను చూపించరు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే లక్షణం ఆయనది. నటీనటులను జాగ్రత్తగా చూసుకుంటారు. 

రవితేజ..?

నయనతార: రవితేజ నేనూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే కాకపోతే ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉండటం.. ఈ మధ్య కాలంలో మేమిద్దరం కలవకపోవడం వల్ల  కాస్త మాటలు తగ్గాయి. సెట్‌లో ఉన్నప్పుడు హిందీలోనే మాట్లాడుకునేవాళ్లం. 

ప్రభాస్‌..?

నయనతార: ప్రభాస్‌ స్వీట్‌ హార్ట్‌‌. సెట్‌లో బాగా అల్లరి చేసేవాడు. ఎంతో సరదాగా మాట్లాడేవాడు. ఇప్పుడు అతడు పెద్దస్టార్‌ అయ్యాడు. ఆనందంగా ఉంది.

ఎన్టీఆర్‌..?

నయనతార: తారక్‌ బాగా అల్లరి చేస్తాడు. నాపై జోక్స్‌ వేసేవాడు. ఓసారి సెట్‌లో నేను రెడీ అవుతున్నప్పుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అలా చూస్తున్నావు? అని అడగ్గా.. ‘ఎందుకు అంతలా మేకప్‌ వేసుకుంటున్నావు’ అని ప్రశ్నించాడు. షాట్‌కు వెళ్లాలి కదా. అందుకే అని చెప్పా. దానికి ఆయన.. ‘స్క్రీన్‌పై నేను ఉన్నప్పుడు అందరూ నన్నే చూస్తారు కదా. ఇంకా నువ్వు రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది’ అని సరదాగా జోక్స్‌ వేశాడు. మంచి డ్యాన్సర్‌. రిహార్సల్స్‌ చేయకుండానే డ్యాన్స్ చేస్తాడు.

బాలయ్య..?

నయనతార: బాలయ్య సరదా మనిషి. ఆయనతో మాట్లాడటానికి అందరూ భయపడతారు కానీ ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరితో సరదాగా మాట్లాడతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని