Nayanthara: నటి మాళవికకు నయనతార కౌంటర్‌.. వీడియో వైరల్‌

తన లుక్స్‌ గురించి కామెంట్‌ చేసిన ఓ నటికి కౌంటర్‌ విసిరారు నయనతార. దర్శకుడు చెప్పిన విధంగానే తాను చేశానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 22 Dec 2022 14:23 IST

చెన్నై: సినిమాకు సంబంధించి దర్శకులు ఏం చెబితే అదే చేస్తానని అగ్రకథానాయిక నయనతార (Nayanthara) అన్నారు. సినిమా విషయంలో రియలెస్టిక్‌, కమర్షియల్‌ అనే వ్యత్యాసం ఉంటుందని.. దాన్ని కొంతమంది గ్రహించాలని చెప్పారు. ఈ మేరకు ‘కనెక్ట్‌’ (Connect) ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె గతంలో ఓ హీరోయిన్‌ తనపై చేసిన విమర్శలను గుర్తు చేసుకున్నారు. ‘‘నేను దర్శకుల నటిని. సినిమాకు అనుగుణంగా వాళ్లు ఏం చెబితే అదే చేస్తాను. డ్రెస్సింగ్‌, మేకప్‌, హావభావాలు.. ఇలా ప్రతి విషయాన్ని వాళ్లు చెప్పిన విధంగా ఫాలో అవుతా. అయితే, గతంలో నేనొక ఇంటర్వ్యూ చూశా. అందులో ఓ హీరోయిన్‌ నా డ్రెస్సింగ్‌ స్టైల్‌, మేకప్‌ గురించి కామెంట్స్‌ చేసింది. ఆమె పేరు ఇప్పుడు చెప్పాలని లేదు. ఆస్పత్రి సీన్‌లోనూ నేను మేకప్‌, లిప్‌స్టిక్‌, హెయిర్‌స్టైల్‌ చక్కగా వేసుకోవడాన్ని ఆమె తప్పు పట్టింది. అయితే, నేను చెప్పేది ఒక్కటే సినిమాల విషయంలో చిన్న వ్యత్యాసం ఉంటుంది. కమర్షియల్‌, రియలెస్టిక్‌ మూవీస్‌ ఉంటాయి. రియలెస్టిక్‌ చిత్రంలో నటిస్తే తప్పకుండా లుక్స్‌ పరంగా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్‌ సినిమాలో దర్శకుడు హీరోయిన్స్‌ను ఇలాగే స్టైలిష్‌గా చూపిస్తారు’’ అంటూ నయనతార చాలా సున్నితంగా ఆ నటికి కౌంటర్‌ విసిరారు.

కాగా, ఈ వీడియో కాస్త బయటకు రావడంతో దీనిని చూసిన నెటిజన్లు నయన్‌ మాట్లాడుతోంది నటి మాళవికా మోహన్‌ గురించేనని కామెంట్స్‌ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. ‘‘అగ్రకథానాయిక, సూపర్‌స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ఓ నటి ఆస్పత్రి సన్నివేశంలోనూ ఫుల్‌ మేకప్‌ వేసుకుని నటించింది. లిప్‌స్టిక్‌, హెయిర్‌స్టైల్‌.. అన్ని చక్కగా అలంకరించుకుంది. ఆ సీన్స్‌ చూసి నేను షాక్‌ అయ్యాను. ఎంత కమర్షియల్‌ సినిమా అయితే మాత్రం కాస్త వాస్తవికంగా ఉండేలా చూడాలి కదా అనిపించింది’’ అని కామెంట్స్‌ చేశారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్‌ మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తాను సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటంపై స్పందిస్తూ.. ‘‘18 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అప్పుడు ఇండస్ట్రీ గురించి నాకు ఏమీ తెలియదు. అందరి బాటలోనే నేనూ వెళ్లేదాన్ని. కొన్నేళ్లు గడిచిన తర్వాత నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నా. దానికి అనుగుణంగా విభిన్నమైన పాత్రలు పోషించా. ఇప్పుడైతే హీరోయిన్‌ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఎన్నో వస్తున్నాయి. నా కెరీర్‌ మొదలైన సమయంలో అలాంటి చిత్రాలపై నిర్మాతలు చాలా తక్కువ ఆసక్తి చూపించేవారు. కొన్ని చిత్రాల్లో హీరోయిన్స్‌కు సరైన పాత్రలు కూడా ఉండేవి కాదు. నటీమణులకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆలోచించేదాన్ని. ఆడియో ఫంక్షన్స్‌లోనూ హీరోయిన్స్‌ను పక్కన పెట్టేస్తారు. వాళ్ల గురించి అస్సలు మాట్లాడరు. అవన్నీ చూసి విసిగిపోయి.. సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే నేను ఏ ఫంక్షన్‌లోనూ కనిపించను’’ అని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని