#NBK107: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌.. వీరసింహారెడ్డి

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 22 Oct 2022 05:13 IST

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ మాస్‌ యాక్షన్‌ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. దునియా విజయ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌.. అన్నది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్‌ లోగోను శుక్రవారం రాత్రి కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద విడుదల చేశారు. ప్రచార చిత్రంలో బాలకృష్ణ నెరసిన జుట్టుతో నల్లచొక్కా.. పంచె ధరించి మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్‌ ద్వారా స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ.. ‘‘ఒక బాలకృష్ణ అభిమాని.. ‘సమరసింహారెడ్డి’ ఫ్యాన్‌.. ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ‘వీరసింహారెడ్డి’. బాలయ్యను అందరూ ఎలా చూడాలనుకుంటున్నారో.. అంతకు రెండింతలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. సంక్రాంతికి మన వీరసింహారెడ్డి విజృంభించబోతున్నాడు. ఈ చిత్రంలో ఒక్క డైలాగ్‌ చెబుతాను. ‘వీర సింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల. చదివింది అనంతపురం. రూలింగ్‌ కర్నూల్‌’. ఇలాంటి డైలాగ్‌లు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమాకి సాయిమాధవ్‌ మంచి మాటలు రాశారు. తమన్‌ చక్కటి స్వరాలందించారు’’ అన్నారు. ‘‘బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కచ్చితంగా పెద్ద హిట్‌ అందుకుంటాం’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా. నిర్మాత వై.రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘‘ఆరోజుల్లో వచ్చిన ‘సమరసింహా రెడ్డి’లో ఏయే మంచి అంశాలు ఉన్నాయో.. అవన్నీ దీంట్లోనూ ఉన్నాయి.ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంచి కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంద’’న్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు