Jug Jugg Jeeyo: మెట్రోలో స్టార్ల సందడి.. చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్ల ఫైర్‌!

బాలీవుడ్‌ స్టార్లు వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ మెట్రోలో చేసిన సందడి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘సామాన్యులకేనా నిబంధనలు సెలబ్రిటీలకు వర్తించవా?’ అనే ప్రశ్న నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.

Published : 16 Jun 2022 02:09 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్లు వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), కియారా అడ్వాణీ (Kiara Advani) మెట్రోలో చేసిన సందడి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘సామాన్యులకేనా నిబంధనలు.. సెలబ్రిటీలకు వర్తించవా?’ అనే ప్రశ్న నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. తాము కలిసి నటించిన ‘జుగ్‌ జుగ్‌ జియో’ (Jug Jug Jeeyo) చిత్ర ప్రచారంలో ఈ జంట ఫుల్‌ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే వీరు ఓ ఈవెంట్‌కు వెళ్లాల్సి ఉండగా రోడ్డు మార్గంలో వెళ్తే ఆలస్యమవుతుందని భావించి, ముంబయి మెట్రోని ఆశ్రయించారు. ఈ ఇద్దరితోపాటు ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ కూడా ఉన్నారు. ఆ ప్రయాణంలో.. పలువురు సెల్ఫీ, ఫొటోలు అడగ్గానే ముగ్గురూ పోజులిచ్చారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యాయి. కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. అంతవరకు బాగానే ఉందిగానీ కియారా, వరుణ్‌ ట్రైన్‌లో వడాపావ్‌ తినడమే నెటిజన్లు ఫైర్‌ అయ్యేలా చేసింది. 

ఈ వీడియోను కొందరు ఎంజాయ్‌ చేయగా మరికొందరు విమర్శించారు. ‘‘మెట్రోలో ఆహార పదార్థాలు తినకూడదనే విషయం మీకు తెలియదా?’, ‘వీఐపీలు కదా ఏమైనా చేయొచ్చు’, ‘సంబంధిత అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో రాజ్‌ మెహతా తెరకెక్కించిన చిత్రమే ‘జుగ్‌ జుగ్‌ జియో’. వివాహ గొప్పతనాన్ని తెలియజేసే ఈ సినిమా జూన్‌ 24న విడుదలకానుంది.

కియారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా రూపొందిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో మెరిసింది. ప్రస్తుతం ‘ఆర్సీ 15’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమాలో నటిస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని