Hrithik Roshan: హృతిక్‌! ముందు నీ సినిమా సంగతి చూసుకో..

బాలీవుడ్‌ సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’(Laal Singh Chaddha)పై వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. ‘బాయ్‌కట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ ట్యాగ్‌లైన్‌తో...

Updated : 17 Aug 2022 10:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’(Laal Singh Chaddha)పై వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. ‘బాయ్‌కాట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ ట్యాగ్‌లైన్‌తో కొందరు నెటిజన్లు ఈ సినిమా పట్ల వ్యతిరేకత ప్రదర్శించగా, అదే ఈ సినిమాని నష్టపరిచిందని, ప్రేక్షకులను థియేటర్‌కు వెళ్లనివ్వకుండా చేసిందని ఇటీవల ఒక సమావేశంలో ఆ చిత్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌(Aamir khan) ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ సినిమాను ముంబయిలోని ఓ మల్టిప్లెక్స్‌లో చూసిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) సినిమా బాగుందంటూ ట్విటర్‌ ద్వారా స్పందించాడు. ‘ప్లస్‌లు, మైనస్‌లు మినహాయిస్తే ‘లాల్ సింగ్‌ చడ్డా’ అద్భుతంగా ఉంది. ఇటువంటి గొప్ప సినిమాని మిస్‌ అవ్వొద్దు. వెంటనే వెళ్లి చూడండి’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇప్పుడు ఈ ట్వీట్‌ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. చాలామంది హృతిక్‌ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ..‘అవునా..అయితే ఈసారి నీ విక్రమ్‌ వేద వంతు’, ‘హృతిక్‌ ముందు నీ సినిమా సంగతి చూసుకో’, ‘ఇప్పుడీ విషయం నీకవసరమా!’ ‘ఒకే! ‘బాయ్‌కాట్‌ విక్రమ్‌ వేద’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలోకి హృతిక్‌ ఎందుకు తలదూర్చాడు అంటూ ‘విక్రమ్‌ వేద’ నిర్మాతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట.

తమిళ చిత్రం ‘విక్రమ్‌ వేద’(Vikram Vedha)ను హిందీలో సైఫ్‌ అలీ ఖాన్(Saif Ali Khan)‌, హృతిక్‌ రోషన్‌ హీరోలుగా రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఈ సినిమాలో సైఫ్‌, ఆమీర్‌ఖాన్‌ హీరోలుగా అనుకున్నారట. అయితే ఆమిర్‌ ఈ సినిమా నుంచి తప్పుకొని హృతిక్‌ రోషన్‌ పేరు సూచించడంతో హృతిక్‌ను ‘వేద’ పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. ‘విక్రమ్‌ వేద’ వచ్చే నెల(సెప్టెంబరు 30) విడుదల కానుండగా హృతిక్‌ నెటిజన్ల నుంచి ఇటువంటి హెచ్చరికలు ఎదుర్కోవడం పట్ల బాలీవుడ్‌ పలు రకాలుగా స్పందిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని